Ganababu
-
టీడీపీలో టికెట్ల కుమ్ములాటలు..!
-
సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌కు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమాచారం పక్కాగా అందుతోందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా లాబీలో ఆయన విలేకరులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ... ‘ఇంటెలిజెన్స్ ద్వారా కాకుండా సొంత మార్గాల్లో సీఎం సమాచారం తెప్పించుకుంటున్నారు. మొన్న విశాఖలో జరిగిన సమీక్షలో ఈ విషయం స్పష్టమైంది. క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ చెప్పని సమాచారాన్ని కూడా సీఎం జగన్ తెప్పించుకున్నారు. నాయకుడికి అలాంటి సమాచారం అవసరం’ అని పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానం ఇచ్చారు. పీపీఏలపై అత్యున్నతమైన కమిటీ సమీక్ష చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఒక పద్దతి ప్రకారం నిజానిజాలను పరిశీలన చేస్తోందన్నారు. కమిటీ నివేదిక రాగానే అన్ని విషయాలు బయటకు చెబుతామని తెలిపారు. పద్దతి ప్రకారం జరగాలంటే కొంత సమయం పడుతుందని మంత్రి వివరించారు. అదే విధంగా వివిధ అంశాలపై చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మహిళల భద్రతకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురానున్న చట్టం ఆవశ్యకతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు సభకు వివరిస్తున్నారు. -
‘గంటా’.. ‘గణ’గణమనలేదు!
రాష్ట్రమంతటా చావుదెబ్బతిన్నా.. అప్పటి జీవీఎంసీ అధికారుల బ్లాక్మెయిల్ రాజకీయంతో చచ్చీచెడీ గెలిచిన నగర టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఐదేళ్లపాటు నగరంలో పార్టీని నడిపించిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు ముందుగానే పార్టీ బాధ్యతల నుంచి తీసిపారేశారు. దాంతో అలిగిన వాసుపల్లి పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టనని భీష్మించుకున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గణబాబుల ఆశలపై అధినేత నీళ్లు చల్లేశారు. ఆనవాయితీగా ప్రతిపక్షానికి కేటాయించే అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్ పదవిని వీరిద్దరూ ఆశించారు. సీనియారిటీ, కుల సమీకరణలు తదితర లెక్కలు వేసుకొని మరీ కేబినెట్ మంత్రి హోదా కలిగిన ఆ పదవిపై ఆశలు పెంచుకున్నారు.అయితే అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్‌కు పీఏసీ చైర్మన్‌గిరీ ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా గంటా, గణబాబులకు జెల్లకొట్టారు. సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాఅంతటా ఫ్యాన్ గాలి ఉధృతంగా వీచినా.. అప్పటి జీవీఎంసీ అధికారుల బ్లాక్మెయిల్ రాజకీయంతో విశాఖ నగరంలో మాత్రం టీడీపీ అభ్యర్థులు చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా బయటపడ్డారు. అలా నగరం నాలుగుదిక్కులా టీడీపీ ఎమ్మెల్యేలే ఉండటంతో పార్టీ అధినేత చంద్రబాబు పదవుల కేటాయింపులో వారికి ప్రాధాన్యత ఇస్తారని అందరూ ఆశించారు. ఆ మేరకు ప్రతిపక్ష పార్టీకి కేటాయించే ప్రజా పద్దుల కమిటీ(పబ్లిక్ అకౌంట్స్ కమిటీ–పీఏసీ) చైర్మన్ పదవిని నగర టీడీపీ ఎమ్మెల్యేల్లో ఎవరో ఒక్కరికి కట్టబెడతారని భావించారు. యాధృచ్ఛికమే కావొచ్చు గానీ గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలూ సీనియర్లే. గంటా శ్రీనివాసరావు వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, పివీజీఆర్ నాయుడు అలియాస్ గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబులు మూడుసార్లు, వాసుపల్లి గణేష్ వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో సహజంగానే వీరిలో ఎవరో ఒకరికి పీఏసీ చైర్మన్ పదవి దక్కుతుందని ఆశించారు. సామాజికవర్గ లెక్కల ప్రకారం వెలగపూడి మొదటి నుంచి ఆ పదవిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఇక తనకంటే ఎక్కువ దఫాలు గెలిచిన ఎమ్మెల్యేలు ఉండటంతో వాసుపల్లి గణేష్ కూడా ఏమో వస్తే రావచ్చు.. అన్న ఆశ తప్పించి.. ఆ పోస్టు గురించి పెద్దగా ప్రయత్నించిన దాఖలాల్లేవు. కానీ సుమారు ఎనిమిదేళ్లుగా బుగ్గకారుకు అలవాటు పడిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మూడుసార్లు గెలిచి సీనియర్ ముద్ర వేసుకున్న పశ్చిమ ఎమ్మెల్యే గణబాబులు మాత్రం ఆ పదవి కోసం తీవ్రంగా పోటీ పడ్డారనే చెప్పాలి. గంటాకు మొండిచెయ్యి సామాజికవర్గ కోణంలో చూసినా.. సీనియర్ల లెక్క చూసినా.. తనకు కచ్చితంగా పీఏసీ చైర్మన్ పదవి వస్తుందని గంటా శ్రీనివాసరావు లెక్కలు వేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందునా.. ఎన్నికలైన కొద్దిరోజుల్లోనే గంటా పార్టీ ఫిరాయించేస్తారని, కమలం గూటికి వెళ్లిపోతారన్న వదంతులు బలంగా వినిపించాయి. ఆయన వ్యక్తిగత పర్యటనలకు శ్రీలంక. అమెరికా వెళ్లిన సందర్భాల్లో గంటా క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టేశారన్న వాదనలూ వినిపించాయి. ఈ నేపథ్యంలో గంటాను మచ్చిక చేసుకునేందుకు కచ్చితంగా చంద్రబాబు పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెడతారని పార్టీలోని ఓ వర్గం అంచనా వేసింది. ఎన్నికల ముందు కూడా టికెట్ విషయంలో గంటాను చివరి క్షణం వరకు ముప్పుతిప్పలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు కచ్చితంగా గంటాకు పదవి ఇచ్చి తనదారిలోకి తెచ్చుకుంటారన్న లెక్కలు వేశారు. కాపు సామాజికవర్గ కోణంలో కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో గంటా కంటే సీనియర్లు లేకపోవడంతో ప్రభుత్వపరంగా దక్కే ఒకే ఒక్క పీఏసీ పదవి ఆయనదేనన్న ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే తన రాజకీయాన్ని ప్రదర్శించి గంటాకు ఝలక్ ఇచ్చారు. గణబాబు ఆశలపై నీళ్లు ఇక మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను ఈసారి చంద్రబాబు కరుణిస్తారని, గతంలో మంత్రి పదవి ఇవ్వని కారణంగా ఇప్పుడైనా బీసీ కోటాలో పీఏసీ పదవి ఇస్తారని గణబాబు ఆశిస్తూ వచ్చారు. గంటాకు కాకుంటే తనకే కచ్చితంగా వస్తుందని లెక్కలు వేసుకున్నారు. గంటాను బాబును నమ్మే పరిస్థితి లేదని, తమ నాయకుడికే కీలక పదవి వస్తుందని ఆయన వర్గీయులు కూడా బలంగా నమ్ముతూ వచ్చారు. కానీ చంద్రబాబునాయుడు విశాఖ ఎమ్మెల్యేలను ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్‌కు పీఏసీ పదవి కట్టబెట్టేశారు. దీంతో విశాఖ టీడీపీ శ్రేణులు, ప్రత్యేకించి గంటా, గణబాబు వర్గీయులు నైరాశ్యంలో మునిగిపోయారు. -
ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
గోపాలపట్నం : విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతాలని ఆశచూపి నిరుద్యోగులకు టోకరా వేశాడు ఓ ప్రబుద్ధుడు. అగ్రిమెంట్, వీసా తదితర ఖర్చుల కోసమని ఒక్కొక్కరి నుంచి రూ.80 వేల వరకు వసూలు చేసి పరారయ్యాడు. దీంతో బాధితులంతా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబుని ఆశ్రయించి వారి గోడు వెల్లబుచ్చుకున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయకపోగా నిందితులుగా చూస్తున్నారంటూ వాపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాపురంలో క్షౌరశాల నిర్వహిస్తున్న సురేష్ రష్యాలో ఉద్యోగాలున్నాయంటూ షాపుకొచ్చిన వారందరికీ ప్రచారం చేశాడు. నిరుద్యోగులు, కూలీలు, కలాసీలు అతడిని ఆశ్రయించారు. అతడు వెంకటరమణ అనే వ్యక్తిని వీరికి పరిచయం చేశాడు. పేరొందిన కంపెనీ ద్వారా రష్యా షిప్‌యార్డులో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని, కలాసీ, వెల్డరు, క్వాలిటీ కంట్రోల్ తదితర ఉద్యోగాలున్నాయని నమ్మించాడు. నెలకి రూ.80 వేలు జీతం, ఓటీ చేస్తే రెట్టింపు వేతనం ఉంటుందని పేర్కొన్నాడు. వీసా, పాస్‌పోర్టుకి రూ. 30 వేలు, ఇతర ఖర్చులకు రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపాడు. వారికి అగ్రిమెంట్ పత్రాలూ కూడా ఇచ్చాడు. దీంతో సుమారు 70 మంది వరకు తొలుత రూ.30 వేలు చొప్పున చెల్లించారు. మూడు నెలల తరువాత బోగస్ పాస్‌పోర్టు, వీసాలను వెంకటరమణ వారికి అందజేశాడు. దీంతో ఒక్కొక్కరూ రూ. 50 వేల చొప్పున సమర్పించారు. అక్టోబరు 31న సింగపూర్ విమానం ఎక్కాలంటూ విమాన టికెట్లు ఇచ్చాడు. సరిగ్గా వీరు ప్రయాణం ముందు రోజు వెంకటరమణ నుంచి ఫోనొచ్చింది. రష్యాలో వాతావరణం బాగోలేదు, విమాన టికెట్లు రద్దయ్యాయని చెప్పాడు. అతనిపై అనుమానంతో నిరుద్యోగులు విశాఖ విమానాశ్రయానికి వెళ్లి ఆరా తీశారు. అవి బోగస్ టికెట్లని తేలడంతో కంగుతిన్నారు. మోసపోయామని గ్రహించి మల్కాపురం పోలీసులకు కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేని ఆశ్రయించిన బాధితులు ఎమ్మెల్యే గణబాబుని 24 మంది బాధితులు భార్యాపిల్లలతో కలిశారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే సరిగా స్పందించకపోగా తమపై కన్నెర్రజేస్తున్నారని వాపోయారు. నిందితులను అదుపులోకి తీసుకున్నాకే వారు ఇలా ప్రవరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మల్కాపురం సీఐకి ఫోన్ చేసి బాధితులకు డబ్బులు వచ్చేలా చూడాలని ఆదేశించారు. రష్యాలో గల కంపెనీ యాజమాన్యానికి ఫోన్ చేయగా ఇక్కడ ఉద్యోగాలేం లేవని, నమ్మి మోసపోవద్దని స్పష్టం చేసినట్టు ఎమ్మెల్యే బాధితులకు వివరించారు. -
గిరిజనుల భారీ ర్యాలీ
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ శ్రీకృష్ణ విద్యా మందిర్ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం వనవాసీ కళ్యాణాశ్రమ్ ఆధ్వర్యంలో ‘రాష్ట్ర గిరిజన మహాసభ’ నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన గిరిజనులు, మహిళలు ప్రేమసమాజం నుంచి శ్రీకృష్ణ విద్యా మందిర్ సమావేశ వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డాబాగార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా ద్వారకానగర్ సభాస్థలికి చేరుకున్నారు. సభకు శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, అఖిల భారత సంఘటన ప్రతినిధి పి.సోమయాజులు, వనవాసి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విశ్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గణబాబు, డాక్టర్ ఎన్.ఎస్.రాజు, గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు ఆర్.ఎస్.దొర , పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు. బాలాసాహెబ్దేశ్పాండే శత జయంతిని పురస్కరించుకొని ‘వనవాణి’గిరిజన మాసపత్రిక ప్రత్యేక సంచికను పూజ్యస్వామిజీ ఆవిష్కరించారు. అశోక్ బీకే స్టీల్స్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి ముఖేష్ బస్సల్వనవాసీ కళ్యాణాశ్రమ్కు విరాళంగా ఇచ్చిన సంచార వైద్యశాలను స్వరూపానందేంద్ర సరస్వతి ప్రారంభించారు. అనంతరం వనహేల వనవాస విద్యార్థులకు గతంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గణబాబు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వనవాసి సేవలు,ప్రముఖుల ఫొటోలు, స్వామి వివేకానంద సంచార పుస్తక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.