
ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
గోపాలపట్నం : విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతాలని ఆశచూపి నిరుద్యోగులకు టోకరా వేశాడు ఓ ప్రబుద్ధుడు. అగ్రిమెంట్, వీసా తదితర ఖర్చుల కోసమని ఒక్కొక్కరి నుంచి రూ.80 వేల వరకు వసూలు చేసి పరారయ్యాడు. దీంతో బాధితులంతా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబుని ఆశ్రయించి వారి గోడు వెల్లబుచ్చుకున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయకపోగా నిందితులుగా చూస్తున్నారంటూ వాపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాపురంలో క్షౌరశాల నిర్వహిస్తున్న సురేష్ రష్యాలో ఉద్యోగాలున్నాయంటూ షాపుకొచ్చిన వారందరికీ ప్రచారం చేశాడు. నిరుద్యోగులు, కూలీలు, కలాసీలు అతడిని ఆశ్రయించారు.
అతడు వెంకటరమణ అనే వ్యక్తిని వీరికి పరిచయం చేశాడు. పేరొందిన కంపెనీ ద్వారా రష్యా షిప్‌యార్డులో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని, కలాసీ, వెల్డరు, క్వాలిటీ కంట్రోల్ తదితర ఉద్యోగాలున్నాయని నమ్మించాడు. నెలకి రూ.80 వేలు జీతం, ఓటీ చేస్తే రెట్టింపు వేతనం ఉంటుందని పేర్కొన్నాడు. వీసా, పాస్‌పోర్టుకి రూ. 30 వేలు, ఇతర ఖర్చులకు రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపాడు. వారికి అగ్రిమెంట్ పత్రాలూ కూడా ఇచ్చాడు. దీంతో సుమారు 70 మంది వరకు తొలుత రూ.30 వేలు చొప్పున చెల్లించారు. మూడు నెలల తరువాత బోగస్ పాస్‌పోర్టు, వీసాలను వెంకటరమణ వారికి అందజేశాడు.
దీంతో ఒక్కొక్కరూ రూ. 50 వేల చొప్పున సమర్పించారు. అక్టోబరు 31న సింగపూర్ విమానం ఎక్కాలంటూ విమాన టికెట్‌లు ఇచ్చాడు. సరిగ్గా వీరు ప్రయాణం ముందు రోజు వెంకటరమణ నుంచి ఫోనొచ్చింది. రష్యాలో వాతావరణం బాగోలేదు, విమాన టికెట్లు రద్దయ్యాయని చెప్పాడు. అతనిపై అనుమానంతో నిరుద్యోగులు విశాఖ విమానాశ్రయానికి వెళ్లి ఆరా తీశారు. అవి బోగస్ టికెట్లని తేలడంతో కంగుతిన్నారు. మోసపోయామని గ్రహించి మల్కాపురం పోలీసులకు కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యేని ఆశ్రయించిన బాధితులు
ఎమ్మెల్యే గణబాబుని 24 మంది బాధితులు భార్యాపిల్లలతో కలిశారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే సరిగా స్పందించకపోగా తమపై కన్నెర్రజేస్తున్నారని వాపోయారు. నిందితులను అదుపులోకి తీసుకున్నాకే వారు ఇలా ప్రవరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మల్కాపురం సీఐకి ఫోన్ చేసి బాధితులకు డబ్బులు వచ్చేలా చూడాలని ఆదేశించారు. రష్యాలో గల కంపెనీ యాజమాన్యానికి ఫోన్ చేయగా ఇక్కడ ఉద్యోగాలేం లేవని, నమ్మి మోసపోవద్దని స్పష్టం చేసినట్టు ఎమ్మెల్యే బాధితులకు వివరించారు.