Ganapathi Laddu
-
గణపతి లడ్డు ‘ రూ.76 వేలు
ఉరవకొండ: వినాయక చవితిని పురస్కరించుకుని ఉరవకొండలోని రంగావీధిలో కాణిపాక వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కొలువుదీర్చిన గణనాథుడిని మంగళవారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా స్వామి వద్ద ఉంచిన లడ్డును వేలం వేయగా అదే వీధికి చెందిన నాగభూషణం రూ. 76 వేలకు పాట పాడి దక్కించుకున్నారు. అదే సమయంలో వినాయకుడికి కప్పిన శాలువను రూ. 33 వేలకు సూర్యనారాయణ, కండువాను రూ. 10,500కు విజయ్‌కుమార్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వారిని స్థానికులు అభినందించారు. -
లంబో ‘ధర’ం
* వేలం పాటలో రికార్డు స్థాయి ధర పలికిన గణపతి లడ్డూలు హైదరాబాద్: భక్తుల కొంగుబంగారం.. లంబోదరుని మహా ప్రసాదం. సోమవారం రాజధాని వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వేలం పాటల్లో గణపతి లడ్డూలు రికార్డు స్థాయి ధర పలికాయి. చారిత్రక ప్రసిద్ధి పొందిన బాలాపూర్ వినాయకుని లడ్డూను అదే ప్రాంతానికి చెందిన సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి రూ.9.50 లక్షలకు దక్కించుకున్నారు. లడ్డూల వేలంలో బాలాపూర్ గణపతితో పోటీపడే బడంగ్‌పేట విఘ్నేశ్వరుని లడ్డూ ఈసారి అమాంతం తగ్గిపోయింది. గతేడాది రూ.6.30 లక్షలు పలికిన ఈ లడ్డూ ధర ఈసారి రూ.4.05 లక్షలకు పడిపోయింది. దీనిని బడంగ్‌పేట నగర పంచాయతీ అధ్యక్షుడు (టీఆర్ఎస్) కర్రె కృష్ణ దక్కించుకున్నారు. లడ్డూని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు అంకితమిస్తున్నట్టు కృష్ణ ప్రకటించారు. ఈసారి గణపతి లడ్డూలను దక్కించుకునేందుకు ముస్లింలు సైతం ముందుకు రావడం విశేషం. -
విశాఖలో.. వినాయకుడి లడ్డూ 12.75 లక్షలు
విశాఖపట్నం: విశాఖలో గణపతి లడ్డూ రూ.12.75 లక్షల ధర పలికింది. మాధవధార వద్ద కళింగనగర్‌లో విజయ వినాయక ఉత్సవ కమిటీ నేతృత్వంలో గణపతి ఉత్సవాలు జరిగాయి. సోమవారం 27 కిలోల లడ్డూను గణపతికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఈ లడ్డూకు వేలం నిర్వహించారు. గాజువాకకు చెందిన వాడపల్లి రమాదేవి, మద్దిలపాలెం ప్రాంత వాసి దువ్వారపు భాస్కరరెడ్డి, పెందుర్తికి చెందిన కర్రి కృష్ణభార్గవ్ ముగ్గురూ కలిసి ఏకంగా వేలంలో రూ. 12.75 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. కాగా, వేలంలో వచ్చిన మొత్తాన్ని సీఎం సహాయ నిధికి, చిన్న పిల్లల గుండె శస్త్ర చికిత్సలకు ఖర్చు చేస్తామని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లడ్డూ లక్షల రూపాయల ధర పలకడం విశేషం.