రేపు వైద్యుల సంఘం ఎన్నికలు
- ఆస్పత్రుల్లో హోరెత్తుతున్న ప్రచారం
- సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్న వైనం
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వవైద్యుల సంఘం యూనిట్ల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. నిత్యం రోగులతో కిక్కిరిసిపోయే ఆయా ప్రభుత్వ ఆస్పత్రులన్ని తాజాగా ఆయా అభ్యర్థుల ప్రచారాలతో హోరెత్తుతున్నాయి. తెలంగాణలో 17 యూనిట్లకు ఈనెల 12న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగునున్నాయి. వీటిలో ఉస్మానియా యూనిట్-1, యూనిట్-2, గాంధీ యూనిట్, ఫెరిఫెరల్ యూనిట్(వైద్యవిధానపరిషత్ పరిధి), ఈఎస్ఐ యూనిట్, రంగారెడ్డి జిల్లా యూనిట్లకు ఎన్నికలు జరుగుతాయి.
ఒక్కో యూనిట్ పరిధిలో సుమారు 300మంది వైద్యులు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. నిన్నమొన్నటి వరకు ఉప్పునిప్పులా చిటపటలాడిన సీమాంధ్ర, తెలంగాణ వైద్యులు ఎన్నికల నేపథ్యంలో ఒకరినొకరు ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకుసాగుతున్నారు.