Gandikota celebrations
-
పొలిమేర సినిమాలో ఉన్న గుడి ఎక్కడ ఉంది..? అసలు చరిత్ర ఇదే!
‘మా ఊరి పొలిమేర’కు కొనసాగింపుగా పొలిమేర-2 విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. పార్ట్-1లో మర్డర్ మిస్టరీకి చేతబడి అంశాన్ని జత చేసి అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన సినిమా ఇది. పార్ట్-2లో అన్నీ రివీల్ చేస్తాడు దర్శకుడు. జాస్తిపల్లి ఊరి పొలిమేరలో ఉన్న ఏకపాదమూర్తి గుడికి.. కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికి.. లింక్ ఉందని.. అక్కడ నిధులు ఉన్నాయని కొమిరి చేసే క్షుద్రపూజల వల్ల వాటిని సొంతం చేసుకోవచ్చని ఇలా ఒక చక్కట కథాంశంతో దర్శకుడు చూపించాడు. సినిమాలో భాగంగా ఆ గుడి జాస్తిపల్లిలో ఉంది అని చెప్పారు.. కానీ గుడి ఉండేది ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వద్ద ఉన్న గండికోటలో ఉంది. మాధవరాయ దేవాలయం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో గండికోట కోటలో ఉన్న 16వ శతాబ్దపు హిందూ దేవాలయం . అప్పట్లో కృష్ణుడి ప్రతిమ ఉండేది. దీనిని మాధవ పెరుమాళ్ ఆలయం లేదా మాధవరాయ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. భారత ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించింది. ఈ గుడిలో రాధేశ్యామ్,సైరా నరసింహారెడ్డి, ఇండియన్-2,మర్యాద రామన్న వంటి చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరిగాయి. గుడి చరిత్ర ఆలయంలోని కళ, నిర్మాణ లక్షణాల విశ్లేషణ ఆధారంగా చూస్తే దీనిని 16 వ శతాబ్దం మొదటి త్రైమాసికంలో నిర్మించినట్లు సూచిస్తుంది. ఆలయానికి సంబంధించిన తొలి ప్రస్తావన 16వ శతాబ్దపు శాసనాలలో కనుగొనబడింది. గండికోటలో విజయనగర కాలం నాటి రాజులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 16వ శతాబ్దపు శాసనాలు ఆ గుడిలో కనుగొనబడ్డాయి. పాపా తిమ్మరాజు అనే వ్యక్తితో సహా అనేక మంది వ్యక్తులు మాధవరాయ (లార్డ్ కృష్ణుడు) దేవుడికి నమస్కరించి, దేవుడికి మాల ( తోమాల ) సమర్పించారని వీటిలో పేర్కొంది. ఆ గుడిలో నిధులు ఉన్నాయా..? మహ్మదీయుల దాడుల వల్ల ఈ గుడి పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో గుడిలో ఉన్న విగ్రహాన్ని అక్కడి నుంచి కడప జిల్లాలోని మైదుకూరుకు తరలించినట్లు ఆధారాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఈ గుడిలో దేవుడి విగ్రహం లేదు. ఊరికి దూరంగా ఉండటం వల్ల అసాంఘిక కార్యకలాపాలు జరిగే ఛాన్స్ ఉందని గుడికి లాక్ చేసి ఉంచుతారు. టూరిస్ట్‌లు వెళ్లిన సమయంలో గేట్లు తెరుస్తారు. స్థానికులు చెబుతున్న ప్రకారం ఆ గుడిలో ఎలాంటి నిధులు లేవని.. మహ్మదీయుల దాడుల సమయంలో వాటిని దోచుకున్నారని చెప్పుకొస్తున్నారు. కానీ గుడి గోడలపై చాలా ప్రత్యేకమైన చిహ్నాలు ఉన్నాయి. -
వైభవంగా ముగిసిన గండికోడ ఉత్సవాలు
-
చిరస్మరణీయంగా గండికోట ఉత్సవాలు
జమ్మలమడుగు: గండికోట ఉత్సవాలు జిల్లావాసులకే కాకుండా ఇతర ప్రాంతాల వారికి కూడా గుర్తుండిపోయేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్డీఓ వి.నాగన్న పేర్కొన్నారు. గురువారం ఆయన తన కార్యాలయంలో డీఎస్పీ ఎన్.నాగరాజు, సీఐలు మంజునాథరెడ్డి, మధుసూదనరావు, ఎంఈఓ చిన్నయ్యలతో కలిసి ఉత్సవాల నిర్వాహణపై చర్చించారు. ఆర్డీఓ మాట్లాడుతూ ఉత్సవాలకు మన రాష్ట్రానికి చెందిన పర్యాటకులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు కూడా వస్తారన్నారు. ప్రత్యేక ఆకర్షణగా గాయకులతోపాటు, ప్రత్యేక ఆటలపోటీలు, పారాగ్లెడింగ్,బెలూన్, కియాకింగ్, రాక్క్లయింబింగ్ తదితర విన్యాసాలు కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాయలసీమ ప్రాంతాలకు చెందిన కబడ్డీ అల్లెంగుండు ఎత్తడం వంటి పోటీలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం మూడు గంటలనుంచి ఉత్సవాలు ప్రారంభంలో భాగంగా ర్యాలీతో నిర్వహిస్తామన్నారు. డీఎస్పీ నాగ రాజు మాట్లాడుతూ గండికోట ఉత్సవాలలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా వందకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాయింట్‌కలెక్టర్–2 శివారెడ్డి, ఆర్టీఓ అధికారివీర్రాజులు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు నుంచి గండికోట వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. -
వైభవంగా గడికోట మైసమ్మ బోనాలు
మహేశ్వరం: మండల కేంద్రంలోని గడికోట మైసమ్మ బోనాలు ఆదివారం వైభవంగా జరిగాయి. శిగవగంగ రాజరాజేశ్వర ఆలయ బ్రహోత్సవాలకు ముందుగా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు వైభవంగా నిర్వహిం చారు. గడికోటలో వెలసిన మైసమ్మ ఆలయంలో భక్తిశ్రద్ధలతో అభిషేకం, హారతి, కుంకుమార్చన, మంత్రపుష్పం, పుష్పాలంకరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శివగంగ రాజరాజేశ్వర ఆలయ చైర్మన్ కాకి కుమార్ ముదిరాజ్ అధ్యక్షతన అమ్మవారికి ప్రత్యేకంగా బోనం తయారు చేయించి శివసత్తులు పూనకాలు, పోతరాజుల నృత్యాలు నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ప్రతి సంవత్సరం శివగంగ రాజరాజేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలకు ముందుగా ఆలయం నుంచి గడికోట మైసమ్మకు బోనం సమర్పించి ఉత్సవాల పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ కమిటీ చైర్మన్ కాకి కుమార్ ముదిరాజ్ తెలిపారు. ఈసారి శివగంగ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మహేశ్వరం సర్పంచ్ కర్రోళ్ల ప్రియాంక, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్రోళ్ల చంద్రయ్య, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, ఏకలవ్య, జోరల రమేష్, వీరుబాబు, నాగేష్, పరమేష్, యాదయ్య, శ్రీనివాస్‌రెడ్డి, నయీంఖాన్ ఉన్నారు. -
గండికోట ఉత్సవాలకు సర్వం సిద్ధం
జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: గండికోట వారసత్వ ఉత్సవాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 21వతేదీ ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పనులను వేగవంతంగా పూర్తి చేయించారు. గత మూడు రోజులుగా ఇన్చార్జి కలెక్టర్ శ్వేత అధికారులతో కలిసి పనులు పర్యవేక్షించడంతోపాటు నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. గండికోట ఉత్సవాలలో జరిగే కార్యక్రమాలను సుమారు మూడు వేల మంది వీక్షించేలా ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. వేదికను జుమ్మా మసీదు ముందు భాగం ఆకారంలో తీర్చి దిద్దారు. రాష్ట్రం నలుమూలలా తయారైన వివిధ రకాల వస్తువుల ప్రదర్శన కోసం ఎగ్జిబిషన్ స్టాల్స్, వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్‌తో పాటు, పుస్తకాల ప్రదర్శన, ఫుడ్‌స్టాల్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. రహదారి వెంబడి అలంకరణ పనులు పూర్తి చేశారు. నేడు పట్టణంలో ర్యాలీ.. గండికోట ఉత్సవాల సందర్భంగా జమ్మలమడుగు పట్టణంలో ఆదివారం ఉదయం ఆర్డీఓ వి.నాగన్న ఆధ్వర్యంలోకళాకారులు, స్థానిక అధికారులు, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం గండికోటలో కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉత్సవాల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. గండికోట ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేసినట్లు కడప డిప్యూటీ చీఫ్ మేనేజర్ కిశోర్‌కుమార్ పేర్కొన్నారు. మూడు రోజులపాటు సాగే ఈ ఉత్సవాలలో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జమ్మలమడుగు నుంచి గండికోటకు ఒక్కొక్కరికి రూ.13 చొప్పున టిక్కెట్ ధర నిర్ణయించామన్నారు. రానుపోను టిక్కెట్ కూడ ఇస్తామని ఆయన తెలిపారు. ప్రొద్దుటూరు నుంచి 2, మిగతా ఆరు డిపోల నుంచి ఒక్కొక్క బస్సును గండికోటకు నడుపుతామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
గండికోట ఉత్సవాలను వైభవంగా నిర్వహిద్దాం!
– 16, 17 తేదీల్లో ఉత్సవాలు – ముఖ్యమంత్రికి ఆహ్వానం కడప కల్చరల్ : జిల్లాకు ప్రతిష్టాత్మకరంగా ఉన్న గండికోటలో వారసత్వ ఉత్సవాలను అక్టోబరు 16, 17 తేదీలలో వైభవంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల వారు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ కేవీ సత్యనారాయణ తెలిపారు. కలెక్టరేట్ సభా భవనంలో శుక్రవారం ఆయన గండికోట ఉత్సవాల సన్నాహాక తొలి సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గండికోట ఉత్సవాల సందర్బంగా కడప, ప్రొద్దుటూరులలో కూడా ఒకటి, రెండు రోజులు ముందు ప్రచార సంబరాలు నిర్వహించి ప్రధాన ఉత్సవాలకు ఎక్కువ మంది హాజరయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం సావనీర్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రెండు రోజుల్లో ఉత్సవాలకు సంబంధించిన అన్ని విభాగాల తుది ప్రణాళికలను సిద్ధం చేసి కార్యచరణ ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానిస్తున్నామని, ప్రకటించిన తేదీలలో ఆయనకు వీలు కాకుంటే ఆ వారంలోనే వీలైన తేదీలలో నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర పర్యాటకశాఖ రీజినల్ డైరెక్టర్ జి.గోపాల్ మాట్లాడుతూ ఉత్సవాలను గండికోటతోపాటు ఇతర ప్రాంతాలలో కూడా నిర్వహించాలన్న కొందరి సూచనపై చర్చ నిర్వహించారు. సిద్దవటం, కడప లేదా ఇతర ప్రాంతాలలో నిర్వహించేందుకు ఆర్థిక వనరులు సరిపోవని, ఒకటి, రెండు రోజులు ముందు సన్నాహాల స్వాగత ఉత్సవాలను కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగులలో నిర్వహిద్దామని కలెక్టర్ పేర్కొన్నారు. ఉత్సవాలను ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి రాత్రి 8.00 గంటల వరకు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సిద్దవటం సీతారామయ్య, ఎలియాస్‌రెడ్డి, ఎన్.ఈశ్వర్‌రెడ్డి, సాంబశివారెడ్డి, ఇంకా పలువురు ప్రముఖులు మాట్లాడారు. ఏఎస్పీ విజయ్‌కుమార్, జిల్లా పర్యాటకశాఖ అధికారి ఖాదర్‌బాషా, డీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి, అన్ని విభాగాల కమిటీ కన్వీనర్లు, సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.