చిన్న సినిమాలను బతికించుకుందాం
శాటిలైట్ సంస్థల సహకారం అవసరం
షరతులను వెనక్కి తీసుకోవాలి
తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం నేతల వినతి
వెంగళరావునగర్: ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిన్న సినిమాలను బతికించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం నేతలు తెలిపారు. యూసుఫ్‌గూడ డివిజన్లోని గణపతి కాంప్లెక్స్ సమీపంలో గల ఫోరం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు ప్రతినిధులు మాట్లాడారు. పలు శాటిలైట్ సంస్థలు విధిస్తున్న డిమాండ్లతో చిన్న సినిమాలు ఆడే పరిస్థితులు లేవన్నారు.
ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోని బీ, సీ సెంటర్లు ఇటీవల కాలంలో మూతబడి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా సంస్థల డిమాండ్ల కారణంగా చిన్న సినిమాలు తీసుకుంటే బడ్జెట్ పెరిగిపోతుండటంతో ఆడించలేక పలు థియేటర్లను సైతం కూల్చివేస్తున్నారని పేర్కొన్నారు. డిజిటల్ స్క్రీనింగ్ ప్రొజెక్షన్ యూఎఫ్ఓ, క్యూబ్, పీఎక్స్‌డీ సర్వీసులను వెంటనే తగ్గించాలన్నారు.
28 షోలకు సంబంధించిన నగదును సినిమా ప్రదర్శనకు ముందే చెల్లిస్తున్నా ఆ షోలన్నీ ప్రదర్శించనపుడు వారాల ప్రకారం ఏర్పాటు చేసుకున్న చార్జీలనే ప్రదర్శించిన షోలకు తీసుకోవాలని, మిగతా మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని వారు కోరారు. ఒకవేళ ఆ నగదును డిస్ట్రిబ్యూటర్‌కు తిరిగి చెల్లించలేకపోతే మరో సినిమాకైనా సర్దుబాటు చేయాలని సూచించారు. కొత్త సినిమాను కనీసం 15 సెంటర్లలో రిలీజ్ చేయాలని క్యూబ్ సంస్థ విధించిన షరతును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యలపై వచ్చే నెల రెండో తేదీన ఏపీ ఫిలిం చాంబర్లో సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
చాంబర్ నేతలు తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన చేపట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఫోరం నేతలు ఇన్నారెడ్డి, శ్రీనివాసరావు, కృష్ణరాము, లింగంగౌడ్, గణేశ్, వెంకటేశ్వర రావు, సజ్జు తదితరులు పాల్గొన్నారు.