Ganesh Pathro
-
‘పాత్రో’చిత సంభాషణ
గణేష్ పాత్రో మరణంతో మూగబోయిన మాట ఉత్తరాంధ్ర మాండలికానికి వన్నె తెచ్చిన రచయిత. గణేష్ పాత్రో మరణంతోమూగబోయిన మాట ఉత్తరాంధ్ర మాండలికానికి వన్నె తెచ్చిన రచయిత ఉత్తరాంధ్ర యాసలో (మాండలికంలో) సంభాషణలు పలికించడంలో గురజాడ తర్వాత తానే అనిపించుకున్నారు... రావి శాస్త్రి వంటి ఉద్దండుల స్ఫూర్తితో రచయితగా ఎదిగారు... నాటక, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేశారు... ఆయన మాటలతోనే రాణించిన సినిమాలెన్నో ఉన్నాయి... చివరిగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి సంభాషణలు అందించి ఈ తరం ప్రేక్షకులను కూడా మెప్పించారు... గణేష్‌పాత్రో ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ... ఆయన మరణం కళారంగానికి తీరని లోటని ప్రముఖులెందరో సంతాపం తెలిపారు... విశాఖపట్నం-కల్చరల్: ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ చిత్రాల్లో విశాఖ అందాలు కనువిందు చేశాయి. మద్రాసులో తయారైన సినిమాల్లో ఉత్తరాంధ్ర జీవనం ప్రతిఫలించే పాత్రలెన్నో కనిపిస్తాయి. పదునెక్కిన మాటలు ప్రేక్షకులను ఆలోచింపచేస్తాయి. దీని వెనకు ఉన్న ఒకే ఒక వ్యక్తి గణేష్‌పాత్రో. సమాజాన్ని నిలదీసిన ‘స్వాతి’, తాతయ్యకు మురిపాలు పంచిన ‘సీతారామయ్యగారి మనవరాలు’ ఆయన కలం బలంతోనే అంతగా రాణించారంటే అతిశయోక్తి కాదు. సినిమాల్లోకి రాకముందే ఆయన ‘పావలా’, ‘కొడుకు పుట్టాల’, ‘లాభం’ వంటి ఎన్నో నాటకాల్లో ఉత్తరాంధ్ర మాండలికాన్ని ఉపయోగించారు. కుటుంబ వ్యవస్థలోని బంధాలు, ఆత్మీయ విలువలు ఆయన రచనలో ప్రతిఫలిస్తాయి. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన పాత్రో విశాఖపట్నం వెంకటేశ్వరస్వామి మెట్ట నారాయణవీధిలో చాలా కాలం నివాసమున్నారు. టెలిగ్రాఫ్ కార్యాలయంలో పనిచేసేవారు. ఆయన ఏవీఎన్ కాలేజీలో, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ప్రఖ్యాత నాటక ప్రయోక్త, ఏయూ సాంస్క ృతిక విభాగం స్టేజ్ డెరైక్టర్‌గా పనిచేసిన కె.వెంకటేశ్వరరావు ప్రోత్సాహంతో ఎన్నో నాటకాలకు ప్రాణం పోశారు. ఆ తర్వాత ఆయన కుమార్తెను వివాహం చేసుకున్నారు. 1975లో సినీ నటుడు గుమ్మడి వేంకటేశ్వరరావు ప్రోత్సాహంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. కె.బాలచందర్, క్రాంతికుమార్, కోడి రామకృష్ణ వంటి ఎందరో ప్రఖ్యాత దర్శకుల చిత్రాలకు సంభాషణలు అందించారు. మహాకవి గురజాడ అప్పారావు స్వర్ణోత్తర శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర సాంస్క ృతిక మండలి ‘గురజాడ సాహితీ పురస్కారం’తో గణేష్పాత్రోను సత్కరించింది. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఉత్తరాంధ్ర గర్వించదగ్గ సృజనాత్మకమైన రచయిత గణేష్‌పాత్రో. ప్రత్యేకమైన శైలిగల సాహితీ పరిమళం. తెలుగు సినిమాలో ‘సంప్రదాయ ఒరవడి’ మాట వినిపిస్తే అది గణేష్‌పాత్రో అనేంతగా గుర్తింపు పొందారు. తనకంటూ ప్రత్యేక ఢతశైలి ఏర్పరుచుకుని చివరి చిత్రం వరకు చక్కని అనుబంధాల మధ్య చిక్కని భావంతో మాటలందించారు. నాటకాల్లోనే కాదు సినిమాల్లోనూ ఆయన ఉత్తరాంధ్రను ప్రతిఫలింపజేశారు. అనేక చిత్రాల్లో దొండపర్తి, నక్కవానిపాలెం వంటి విశాఖ ప్రాంతాలను ప్రస్తావించారు. ‘సంసారం ఒక చదరంగం’ సినిమాలో వదినతో గొడవ పడ్డ సరోజ ‘వదినా నువ్వు వీరఘట్టం నేను విశాఖపట్నం...నువ్వు టెన్త్‌క్లాసు నేను బీఎస్సీ’ అంటుంది పొగరుగా. ఆయన మృతి తెలుగు సినిమాకు, ముఖ్యంగా వైజాగ్‌కు తీరని లోటు. -గొల్లపూడి మారుతీరావు, ప్రఖ్యాత రచయిత, నటుడు ఉత్తరాంధ్ర మాండలికానికి పట్టం కట్టారు... గణేష్‌పాత్రో రచించిన మొట్టమొదటి నాటిక ‘పావలా’లో రంగడిగా నటించాను. సినిమా ఇండస్ట్రీకి వెళ్లడానికి ముందు నుంచి ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన రాసిన ఎన్నో కథలను నేను దర్శకుడిగా మారి నాటకాలు ప్రదర్శించేవాడిని. ఆయన రాసిన ప్రఖ్యాత పావలా నాటకాన్ని రాష్ట్రం మొత్తం తీసుకెళ్లిన అవకాశం నాకు దక్కింది. ఆయన సృష్టించిన ఎన్నో పాత్రలు ధరించే అవకాశం నాకు దక్కింది. కథా వస్తువులను పరిగ్రహించడంలో, సన్నివేశాల మేళవింపులో, మాటల కూర్పులో నిత్య నూతన పరిమళాన్ని వెదజల్లిన ప్రతిభాశాలి. సినిమాల్లోకి వెళ్లినా అతని మాటల పట్టు మాత్రం ఏ మాత్రం జారలేదు. ఉత్తరాంధ్ర మాండలికానికి వన్నె తెచ్చిన వ్యక్తిగా అతన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అలాంటి వ్యక్తి ఈ రోజు మన నుంచి దూరం కావడం నిజంగా బాధాకరం. -మిశ్రో, సీనియర్ నటుడు, దర్శకుడు మంచి క్రియేటివ్ రైటర్ సినీ పరిశ్రమలో విశాఖపట్నం నుంచి గుర్తింపు పొందిన రచయితల్లో గొల్లపూడి మారుతీరావు మొదటి వ్యక్తికాగా, రెండో వ్యక్తి గణేష్‌పాత్రో. ఆయన కేరీర్ విశాఖపట్నం నుంచే ప్రారంభమైంది. ఎంతో పేరు గాంచిన పెద్ద పెద్ద దర్శకులకు కథలు, సంభాషణలు అందించిన మహా సృజనాత్మకమైన రచయిత. తన మాటలతో సినిమాకు ప్రాణం పోసేవారు. మంచి క్రియేటివిటీ ఉన్న రచయిత. నాటక రంగం నుంచి వెళ్లి సినిమాల్లో రాణించిన వారిలో అగ్రగణ్యుడు. నాటక రచనలో ఎంత ప్రతిభ చూపారో... సినిమాల్లోనూ అదేవిధంగా మంచి పట్టుతో రచన సాగించారు. -కాశీవిశ్వనాధ్, సినీ రచయిత ఆయన అభినందన నాకెంతో ప్రత్యేకం నాకు ఆయనతో వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేదు. కానీ చిన్న వయస్సు నుంచే నాటకాలంటే ఉన్న పిచ్చి వలన అనేక నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చేవాడిని. ఆయన ఎదురుగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. అవి చూసినప్పుడు దగ్గరకు వచ్చి ఎంతగానో అభినందించేవారు. సినిమాలో ఆయన రాసిన కథ, మాటలు, చాలా అద్భుతంగా ఉండేవి. చాలా సరళంగా ఉంటూ చక్కని సందేశాన్ని అందించే విధంగా పాత్రల మధ్య సంభాషణలు ఉండేవి. అలా మాటలు రాసే సత్తా అతి కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. అతని చివరి చిత్రం ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చూస్తే అతని డైలాగ్స్ పవర్ ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. -సత్యానంద్, నట శిక్షకుడు -
మాటల వంతెనపై నడచి వెళ్లినవాడు
సందర్భం సంభాషణలుగా నడిచే కథను ఉత్కంఠ అనే కత్తి వాదర మీద నడిపించడం గణేశ్ పాత్రో అభ్యాసం చేసిన విద్య. చక్కని మాట ఎవరి కలం నుంచైనా తెరకు ఎక్కినప్పుడల్లా, రంగస్థలిపై చప్పట్లు కొట్టించుకున్నప్పుడల్లా ఆయన చిరంజీవి. ఉత్తరాంధ్ర మాండలికాన్ని ఉజ్వలంగా పావలా, కొడుకు పుట్టాల వంటి నాటకాలలో ఎగ రవేసిన నాటక కర్త, అలా పాత్ర ల సహజ పలుకు తీరులో తన దృశ్యాభివ్యక్తి రూపానికి తెరలు తీసిన ప్రతిభామూర్తి, గురజాడ నాటక రూపానికి వారసుడుగా సంభావించుకోదగిన రచయిత గణేశ్ పాత్రో కొత్త సంవత్సరంలో, ఏడు పదులు దాటకుం డానే మనలని వదిలి వెళ్లిపోయారు. 1965 నుంచీ తన నాటక సృజన ద్వారా తెలుగునాట సుపరిచితులు. వీరు పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్స్ సంస్థలో మొదట పనిచేసే వారు. విశాఖలో నారాయణపేటలో ఉండే వారు. అప్పటికింకా వారు కొడుకు పుట్టాల నాటకం రాయలేదని, సీనియర్ రచయిత ఎల్.ఆర్.స్వామి గుర్తుచేసుకున్నారు. వారి నాట కాలలో నటించిన రావుజీ, శ్యామల, వంకాయల, ఎస్. కె, మిస్రో, విజయలక్ష్మి తదితరులు కూడా కొందరు సినిమా రంగాన్ని చేరుకుని, మరికొందరు నాటక రంగంలోనే తమ సేవలు అందించారు. వారి నాటకాలలో అసుర సంధ్య చాలా శక్తివంతమైన నాటకం. అలుడ్ని బలుడు కొడితే, బలుడ్ని బ్రహ్మదేవుడు కొడతాడు అన్న నీతి, చిన చేపను పెద చేప అనే పలు కుబడి ఎలా గ్రామీణస్థాయిలో మునసబు, మోతుబరి రైతు, పేద రైతులను మోసం చేసి, పట్నానికి వెళ్లినపుడు, అక్కడ పట్నవాసుల చేతిలో ఎలా వారు మోసపోతారో, తిరిగి ఈ పట్నవాసులు ఎలా మహానగరాలలో మోస పోతారో చెప్తూ , దేశం ఎల్లెడలా అల్లుకున్న అసుర సంధ్య ను ప్రస్తావించిన నాటకం ఇది. ఈ నాటకం చివర్లో, ప్రయోక్త, ప్రేక్షకులతో, మీరు ఈ నాటకం చూసి అసంతృ ప్తితో ఇంటికి వెళ్లడం రచయిత ఉద్దేశం. అప్పుడే ఈ నాటకం ఫలితం సాధించి నట్టు అని చెప్తాడు. అలా డైలాగ్ కింగ్‌గా, సంభాషణలుగా నడిచే కథను ఉత్కంఠ అనే కత్తివాదర మీద నడిపించడం గణేశ్ పాత్రో అభ్యాసం చేసిన విద్య. ఈ నాటకం లో అమ్మవారి ఘటాలను తలకెత్తుకు వెళ్లే పేదలలో ఒకడు ఆ అన్నపు ఘటాన్ని దొం గిలించి తమ వాడకు తీసుకు వచ్చేయడం జరుగుతుంది. ఓలమ్మో, వొణ్ణమే అంటూ ఆ పేదలందరూ ఆ అన్నపు బుట్ట చుట్టూ చేరి, ఆకలితో ఆరగించడం, ఆ నేరానికి ఆ పేదవాడు ప్రాణాలు పోగొట్టు కునే శిక్షకు గురికావడం వంటి సంఘటనలు ప్రేక్షకులు మరచిపోలేరు అని గుర్తు చేసుకున్న పేరి రవికుమార్కి నా కృతజ్ఞతలు. బాలచందర్ సినిమాలు అంటే గణేశ్ పాత్రో మాట లు అన్నది, తూర్పున సూర్యుడు ఉదయించడం వంటి ఒక సహజమైన విషయం. మరో చరిత్ర, స్వాతి, ఇది కథ కాదు, రుద్రవీణ, సీతారామయ్య గారి మనవరాలు వంటి నూరు సినిమాలకు మాటలు రాసిన కృషి గణేశ్ పాత్రోది. ఆయన ఆకలిరాజ్యం, చిలకమ్మ చెప్పింది, స్వాతి, సీతా రామయ్య గారి మనవరాలు, సినిమాలకు జాతీయ అవా ర్డులు అందుకున్నారు పాత్రో ఈ సినిమాలో రాసిన ఒక చక్కని సంభాషణ. జీవితం చిత్రమైన గురువు. ముందు పరీక్ష పెట్టి, తరువాత పాఠం నేర్పుతుంది. పావలా నాటకంలో ఆ దొరికిన పావలాతో ఆ పేద లందరూ, ఎవరికి వారు ఏవేవో చేయాలనుకున్న వారల్లా చివరలో పావలా చెల్లనిదని తెలియగానే మ్రాన్పడి పోవ డంతో నాటకం ముగుస్తుంది. పావలా నాటకంలో వేసిన శ్యామల, పావలా శ్యామలగా తెలుగు నాటక రంగంలో స్థిర నామం పొందింది. మాటల మరాఠీగా, నాటకం లేదా సినిమా ప్రేక్షకులు, కుర్చీ అంచున కూచుని ఆ కళారూపా న్ని చూసేలా, పదసంపద, చిచ్చుబుడ్లలా వెలిగించిన కళల దీపావళి వలె మన చుట్టూ అల్లుకుంటుంది. పార్వతీపురం దారిలోని మార్కొండపుట్టిలో పుట్టి, పార్వతీపురంలో చదువుకుంటున్నప్పుడే, వోలేటి బుచ్చిబాబు అనే సీనియర్ నటుడి ప్రభావంతో నాటకాల పట్ల, ఏకపాత్రాభిన యాలపట్ల ఆసక్తి పెంచుకుని పరాజితుడు అనే ఏక పాత్రను రాసి తానే వేషం కట్టారు. విశా ఖసముద్రం, ఈ గణేశుడి మదిలోని కల రంగ తరంగ మృదంగాలను నిద్రలేపిం ది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కుప్పిలి వేం కటేశ్వరరావుగారి సహాయకుడిగా, తాను నాటకంలో మెళకువలు నేర్చి, నటుడి కన్నా, నాటక రచయితగా తన ప్రతిభ తిరుగులేనిది అని గుర్తిం చిన తరువాత గణేశ్ పాత్రో మరి వెనుతిరిగి చూడలేదు. ప్రముఖ నటుడు ప్రభాకరరెడ్డి మొదటి అవకాశం కల్పిం చగా, కొడుకు పుట్టాల సినిమాగా వెండితెరకు ఎక్కింది. ప్రత్యగాత్మ, ఆత్రేయ వంటి వారిచేయి పట్టి నడిపించగా నడిచిన పదగణాల ఆరాధకుడు గణేశ్ పాత్రో. వారి చేత తన సినిమాలకు ఎన్నో సంభాషణలు రాయించుకున్న బాలచందర్ వెనకాలే, కొద్ది రోజుల తేడాలో గణేశ్‌పాత్రో వెళ్లిపోవడం, అక్కడ ఇంకేదో కళాకృతికి, మాటలు పొదగ డం కోసమేమో అని మనకు అనిపిస్తే, అదేమీ అతిశయోక్తి కాదు. జీవితం అనే నాటకంపట్ల అసంతృప్తి, ఒక వీడ్కోలు భావనగా, మనకోసం వదిలివెళ్లిన ఈ ఉత్తముడు, మాట ల వంతెన మీదే నడిచివెళ్లి పోయుంటాడు. నిర్ణయం సిని మాలో హలో గురూ ప్రేమ కోసమే పాట రచయిత కూడా ఈ గణేశుడే. మనకు వారి కళారూప ప్రేమను వదిలి వెళ్లిన గణేశ్ పాత్రో ఎక్కడికీ వెళ్లలేదు. చక్కని మాట, ఎవరి కలం నుంచైనా తెరకు ఎక్కినప్పుడల్లా, రంగస్థలిపై చప్పట్లు కొట్టించుకున్నప్పుడల్లా, ఆయన చిరంజీవి. రామతీర్థ (వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత) మొబైల్: 9849200385