గణేశ్ పాత్రో
సందర్భం
సంభాషణలుగా నడిచే కథను ఉత్కంఠ అనే కత్తి వాదర మీద నడిపించడం గణేశ్ పాత్రో అభ్యాసం చేసిన విద్య. చక్కని మాట ఎవరి కలం నుంచైనా తెరకు ఎక్కినప్పుడల్లా, రంగస్థలిపై చప్పట్లు కొట్టించుకున్నప్పుడల్లా ఆయన చిరంజీవి.
ఉత్తరాంధ్ర మాండలికాన్ని ఉజ్వలంగా పావలా, కొడుకు పుట్టాల వంటి నాటకాలలో ఎగ రవేసిన నాటక కర్త, అలా పాత్ర ల సహజ పలుకు తీరులో తన దృశ్యాభివ్యక్తి రూపానికి తెరలు తీసిన ప్రతిభామూర్తి, గురజాడ నాటక రూపానికి వారసుడుగా సంభావించుకోదగిన రచయిత గణేశ్ పాత్రో కొత్త సంవత్సరంలో, ఏడు పదులు దాటకుం డానే మనలని వదిలి వెళ్లిపోయారు. 1965 నుంచీ తన నాటక సృజన ద్వారా తెలుగునాట సుపరిచితులు. వీరు పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్స్ సంస్థలో మొదట పనిచేసే వారు. విశాఖలో నారాయణపేటలో ఉండే వారు. అప్పటికింకా వారు కొడుకు పుట్టాల నాటకం రాయలేదని, సీనియర్ రచయిత ఎల్.ఆర్.స్వామి గుర్తుచేసుకున్నారు. వారి నాట కాలలో నటించిన రావుజీ, శ్యామల, వంకాయల, ఎస్. కె, మిస్రో, విజయలక్ష్మి తదితరులు కూడా కొందరు సినిమా రంగాన్ని చేరుకుని, మరికొందరు నాటక రంగంలోనే తమ సేవలు అందించారు.
వారి నాటకాలలో అసుర సంధ్య చాలా శక్తివంతమైన నాటకం. అలుడ్ని బలుడు కొడితే, బలుడ్ని బ్రహ్మదేవుడు కొడతాడు అన్న నీతి, చిన చేపను పెద చేప అనే పలు కుబడి ఎలా గ్రామీణస్థాయిలో మునసబు, మోతుబరి రైతు, పేద రైతులను మోసం చేసి, పట్నానికి వెళ్లినపుడు, అక్కడ పట్నవాసుల చేతిలో ఎలా వారు మోసపోతారో, తిరిగి ఈ పట్నవాసులు ఎలా మహానగరాలలో మోస పోతారో చెప్తూ , దేశం ఎల్లెడలా అల్లుకున్న అసుర సంధ్య ను ప్రస్తావించిన నాటకం ఇది. ఈ నాటకం చివర్లో, ప్రయోక్త, ప్రేక్షకులతో, మీరు ఈ నాటకం చూసి అసంతృ ప్తితో ఇంటికి వెళ్లడం రచయిత ఉద్దేశం. అప్పుడే ఈ నాటకం ఫలితం సాధించి నట్టు అని చెప్తాడు. అలా డైలాగ్ కింగ్‌గా, సంభాషణలుగా నడిచే కథను ఉత్కంఠ అనే కత్తివాదర మీద నడిపించడం గణేశ్ పాత్రో అభ్యాసం చేసిన విద్య. ఈ నాటకం లో అమ్మవారి ఘటాలను తలకెత్తుకు వెళ్లే పేదలలో ఒకడు ఆ అన్నపు ఘటాన్ని దొం గిలించి తమ వాడకు తీసుకు వచ్చేయడం జరుగుతుంది. ఓలమ్మో, వొణ్ణమే అంటూ ఆ పేదలందరూ ఆ అన్నపు బుట్ట చుట్టూ చేరి, ఆకలితో ఆరగించడం, ఆ నేరానికి ఆ పేదవాడు ప్రాణాలు పోగొట్టు కునే శిక్షకు గురికావడం వంటి సంఘటనలు ప్రేక్షకులు మరచిపోలేరు అని గుర్తు చేసుకున్న పేరి రవికుమార్‌కి నా కృతజ్ఞతలు.
బాలచందర్ సినిమాలు అంటే గణేశ్ పాత్రో మాట లు అన్నది, తూర్పున సూర్యుడు ఉదయించడం వంటి ఒక సహజమైన విషయం. మరో చరిత్ర, స్వాతి, ఇది కథ కాదు, రుద్రవీణ, సీతారామయ్య గారి మనవరాలు వంటి నూరు సినిమాలకు మాటలు రాసిన కృషి గణేశ్ పాత్రోది. ఆయన ఆకలిరాజ్యం, చిలకమ్మ చెప్పింది, స్వాతి, సీతా రామయ్య గారి మనవరాలు, సినిమాలకు జాతీయ అవా ర్డులు అందుకున్నారు పాత్రో ఈ సినిమాలో రాసిన ఒక చక్కని సంభాషణ. జీవితం చిత్రమైన గురువు. ముందు పరీక్ష పెట్టి, తరువాత పాఠం నేర్పుతుంది.
పావలా నాటకంలో ఆ దొరికిన పావలాతో ఆ పేద లందరూ, ఎవరికి వారు ఏవేవో చేయాలనుకున్న వారల్లా చివరలో పావలా చెల్లనిదని తెలియగానే మ్రాన్పడి పోవ డంతో నాటకం ముగుస్తుంది. పావలా నాటకంలో వేసిన శ్యామల, పావలా శ్యామలగా తెలుగు నాటక రంగంలో స్థిర నామం పొందింది. మాటల మరాఠీగా, నాటకం లేదా సినిమా ప్రేక్షకులు, కుర్చీ అంచున కూచుని ఆ కళారూపా న్ని చూసేలా, పదసంపద, చిచ్చుబుడ్లలా వెలిగించిన కళల దీపావళి వలె మన చుట్టూ అల్లుకుంటుంది.
పార్వతీపురం దారిలోని మార్కొండపుట్టిలో పుట్టి, పార్వతీపురంలో చదువుకుంటున్నప్పుడే, వోలేటి బుచ్చిబాబు అనే సీనియర్ నటుడి ప్రభావంతో నాటకాల పట్ల, ఏకపాత్రాభిన యాలపట్ల ఆసక్తి పెంచుకుని పరాజితుడు అనే ఏక పాత్రను రాసి తానే వేషం కట్టారు. విశా ఖసముద్రం, ఈ గణేశుడి మదిలోని కల రంగ తరంగ మృదంగాలను నిద్రలేపిం ది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కుప్పిలి వేం కటేశ్వరరావుగారి సహాయకుడిగా, తాను నాటకంలో మెళకువలు నేర్చి, నటుడి కన్నా, నాటక రచయితగా తన ప్రతిభ తిరుగులేనిది అని గుర్తిం చిన తరువాత గణేశ్ పాత్రో మరి వెనుతిరిగి చూడలేదు. ప్రముఖ నటుడు ప్రభాకరరెడ్డి మొదటి అవకాశం కల్పిం చగా, కొడుకు పుట్టాల సినిమాగా వెండితెరకు ఎక్కింది. ప్రత్యగాత్మ, ఆత్రేయ వంటి వారిచేయి పట్టి నడిపించగా నడిచిన పదగణాల ఆరాధకుడు గణేశ్ పాత్రో. వారి చేత తన సినిమాలకు ఎన్నో సంభాషణలు రాయించుకున్న బాలచందర్ వెనకాలే, కొద్ది రోజుల తేడాలో గణేశ్‌పాత్రో వెళ్లిపోవడం, అక్కడ ఇంకేదో కళాకృతికి, మాటలు పొదగ డం కోసమేమో అని మనకు అనిపిస్తే, అదేమీ అతిశయోక్తి కాదు. జీవితం అనే నాటకంపట్ల అసంతృప్తి, ఒక వీడ్కోలు భావనగా, మనకోసం వదిలివెళ్లిన ఈ ఉత్తముడు, మాట ల వంతెన మీదే నడిచివెళ్లి పోయుంటాడు. నిర్ణయం సిని మాలో హలో గురూ ప్రేమ కోసమే పాట రచయిత కూడా ఈ గణేశుడే. మనకు వారి కళారూప ప్రేమను వదిలి వెళ్లిన గణేశ్ పాత్రో ఎక్కడికీ వెళ్లలేదు. చక్కని మాట, ఎవరి కలం నుంచైనా తెరకు ఎక్కినప్పుడల్లా, రంగస్థలిపై చప్పట్లు కొట్టించుకున్నప్పుడల్లా, ఆయన చిరంజీవి.
రామతీర్థ
(వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత)
మొబైల్: 9849200385