Ramateerdha
-
‘క్లాసికల్’ పీటముడికి సత్వర స్పందనే పరిష్కారం
సందర్భం ఏ దశలోనైనా గుర్తింపుపొందిన సాహిత్యం ఆ భాషలో వచ్చి ఉంటే దాన్ని విశిష్ట భాషగా గుర్తించవచ్చనేది యునెస్కో వంటి సంస్థల అవగాహన. దీనికీ, శాసనాలు వెతుక్కుని ప్రాచీనతలు నిర్ధారించుకునే చాదస్తానికి ఎలాంటి సంబంధం లేదు. తెలుగు, కన్నడ, మలయాళ, ఒడియా భాషలకు క్లాసికల్ హోదా వర్తింపునకు సంబం ధించి మద్రాస్ హైకోర్టు పంపిన నోటీసులకు జవాబు గా ఆంధ్రా, తెలంగాణ, కర్ణాట క, కేరళ, ఒడిశా ప్రభుత్వాలు తమ వాదనలను ఈ బుధవా రం (ఏప్రిల్ 8) సమర్పించా ల్సి ఉంది. ఆ ప్రభుత్వాలు తమ తమ భాషలకు విశిష్ట హోదా రావడం, ఏ విధం గానూ తమిళ భాషాభివృద్ధికి విఘాతం కాదని హైకోర్టు కు విన్నవించాలి. అంతేకాకుండా ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా తమిళుడైన ఆర్ గాంధీ, ఈ నాలుగు భాషల అభివృద్ధికి ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చిన క్లాసికల్ (విశిష్ట) హోదాకు అకారణంగా అడ్డుపడు తున్నారనే విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్లాలి. ఈ నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ అంశంపై సమాధానం ఇచ్చేటప్పడు, తమ భాషల పరిరక్షణా, పరిశోధనా రంగాల అభివృద్ధి ఏ విధంగానూ తమిళ ప్రజల ప్రయో జనాలకు నష్టం కలిగించదని కోర్టుకు స్పష్టం చేయాలి. అసలుకు క్లాసికల్ హోదా అంటే ఏమిటో ఈ రాష్ట్రా లలో ఏ మేరకు అవగాహన ఉందో చూద్దాం. ఈ ఆంగ్ల పదాన్ని ఒక్కో రాష్ట్రం వారు ఒక్కోలా తమ భాషలో వ్యవహరిస్తున్నారు. ‘శాస్త్రీయ తమిళ్’ అంటూ హిందీలో ఉపయోగిస్తూనే, ‘సెందమిళ్’ అంటూ తమ తమిళ భాషా భివృద్ధి సంస్థను మైసూరు నుంచి వేరు చేసి తమ రాష్ట్రం పట్టుకుపోయి ఎంచక్కా కేంద్రప్రభుత్వ నిధులతో ఒరిగే సమస్త లబ్ధినీ 2008 నుంచీ పొందుతున్నారు. ఇక కన్నడలో దీన్ని ‘అభిజాతె కన్నడ’ అంటున్నారు. మనం తెలుగులో ప్రాచీన భాష అంటున్నాము. మలయాళంలో ‘శ్రేష్టభాష’ అంటున్నారు. ఒడియాలో ‘శాస్త్రీయ మాన్య త’ అంటున్నారు. వీటిలో ఏ పేరూ క్లాసికల్ అంటే సాహి త్య విశిష్టత అనే అర్థంలో లేదు. దాదాపు అన్ని భాషల వారూ ఈ హోదా విషయమై క్లాసికల్ అనే పదానికి సం స్కృతపదాన్నే తమ భాషలో వాడుతున్నారు. వాస్తవానికి ఏ దశలోనైనా విశిష్టంగా గుర్తింపు పొం దిన సాహిత్యం ఆ భాషలో వచ్చి ఉంటే ఆ భాషను విశిష్ట భాషగా గుర్తించవచ్చనేది అంతర్జాతీయ విద్యావంత సమాజంలో, యునెస్కో వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు గల అవగాహన, దీనికీ శాసనాలు వెతుక్కుని ప్రాచీన తలు నిర్ధారించుకునే చాదస్తానికి ఎలాంటి సంబంధం లేదు. మనం ప్రాచీనం అనుకున్నాం కాబట్టి, అలా తమి ళులు తప్పుదారి పట్టించారు కాబట్టి, అందరం ఈ ప్రాచీనతే విశిష్టత అని నమ్ముతూ నిష్ఫలంగా వెతు క్కుంటూ పోతున్నాం. అదే తమిళులకు కూడా కావల సింది కాబట్టి, గుట్టు చప్పుడు కాకుండా వారి భాష సంస్థ అభివృద్ధి అవుతుండగా, మిగతా దక్షిణాది భాషల అభివృద్ధిని వారు కేసుల ద్వారా తొక్కి పట్టి ఉంచుతు న్నారు. మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు మిగిలిపోయాం. ఇప్పటికైనా ఈ కేసునుంచి త్వరగా బయటపడి తెలుగు క్లాసికల్ సంస్థను రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి ముందుగా ఆర్ గాంధీ అనే తమిళుడు మనకు వ్యతిరేకంగా వేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించే కోర్టుకు చెప్పాల్సిన అంశాలపై తెలుగు రాష్ట్రాలకు స్పష్టత ఉండాలి. తనను తాను ఈ కేసులో ఇంప్లీడ్ చేసుకుని భాషాభిమానిగా చెన్నై నివాసి తొమాటి సంజీవరావు వ్యక్తిగా ఒంటి చేత్తో పోరాడుతూ చూపుతున్న అంకితభావం మన ప్రభుత్వాలకూ, పౌర సమాజానికీ ఆదర్శం కావాలి. గుర్తించాల్సిన అంశాలు: 1. క్లాసికల్ అంటే కాల సూచి కాదు. ఆయా భాషా సాహిత్యాలలో ఒక విశిష్ట రచన వచ్చిందా అన్న దానికి సంబంధించిన గుర్తింపు మాత్రమే. 2. ఎంత వేల ఏళ్ల కిందటి ‘సంగం’ సాహి త్యం గురించి తమిళులు మాట్లాడినా వారు 2008లో ఈ క్లాసికల్ హోదా పొందినప్పుడు, కాల నియమం ఒక వెయ్యి ఏళ్లు మాత్రమే ఉన్నది. దీనిని వారు పొందాల్సిన లబ్ధి పొందాక, 2009లో సంస్కృతానికి కూడా ఈ క్లాసి కల్ హోదా ఇస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వం 1500- 2000 ఏళ్లుగా సవరించింది. 3. దీనిపై అంతర్జాతీయం గా ఏ మార్గదర్శక నిబంధనావళి లేదు. నాలుగు వందల ఏళ్లు చరిత్ర లేని భాషలను కూడా అంతర్జాతీయ సమా జం క్లాసికల్ భాషలుగా గుర్తించింది. 4. పెపైచ్చు వేల ఏళ్ల కిందటే తమ భాషలో రచనలు ఉన్నాయని చెబు తున్న తమిళులు ఎరగవలసింది ఏమిటంటే, ఆ రచనలు జరిగింది మూల ద్రవిడంలో, అంటే, మొత్తం దక్షిణాది భాషలకు కుదురు అయిన భాష అది. 5. అయిదు వం దల ఏళ్లు మించిన రచనా వారసత్వం లేని మలయాళం, ఒడియా భాషలు క్లాసికల్ హోదాకు అర్హం అని కేంద్ర ప్రభుత్వం భావించినప్పుడే కాల నియమ నిబంధనతో క్లాసికల్ హోదాకు సంబంధం లేదన్న అవగాహన గల అంతర్జాతీయ సమాజపు ఆలోచనకు దగ్గరగా వచ్చినట్టే. అందువల్ల, తెలుగు, కన్నడ, భాషా సమాజాలు ఇప్పు డిక తాము అంత ప్రాచీనులం అంటే ఇంత ప్రాచీనులం అని శాసనాలు చూపెట్టే ఈ తెలివి తక్కువ పనులు మానుకుని, తగు వాదనలతో, తమ జవాబులను కోర్టు కు సమర్పించాల్సి ఉన్నది. 6. అటు కేంద్ర ప్రభుత్వ మూ, ఇటు ఈ నాలుగూ రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులో సమర్పించే విషయపు ఏకాభిప్రాయంపైనే, ఈ కేసు త్వరగా తేలే విషయం ఆధారపడి ఉన్నది. అందుకు అనుగుణంగా ఈ రాష్ట్రాల సాంస్కృతిక శాఖలు తక్షణ చర్యలు, ఏడేళ్ల కాలం గడిచిపోయిన ఈ తరుణంలోనైనా మొదలు పెట్టగలిగితే, మంచి జరుగుతుంది. 7. పౌర సమాజం, అందుకు తగు ఒత్తిడిని, సాంఘికంగా, సాం స్కృతికంగా, ఆచరణ చేయవలసిన రాజకీయ వర్గాలపై తీసుకురావడం, ప్రభుత్వ వర్గాలను సచేతనం చేయడం మనం అందరం చేయవలసిన పని. (వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత) మొబైల్: 98492 00385 -
మనకి చార్వాకులూ... వాళ్లకి చార్లీలూ...
సందర్భం మతంలోని జీవామృత సారాన్ని గ్రహించలేని వారి వల్ల ఆ మతానికే చేటు. ఒక పత్రికపై దాడిచేసి ప్రధాన సంపాదకుడిని, కార్టూనిస్టులను చంపగలిగారు. రేపు వంద లాది పత్రికలు అవే కార్టూన్లు ప్రచురిస్తే, ఎంత మంది ఉగ్రవాదులు రాగలుగుతారు? కార్టూన్లు జగవద్గీతలు. తుపాకులు పిచ్చి రబ్బరు గుళ్లు. కొంచెం చెరుపుతాయేమో కానీ పూనికను చెదరగొట్ట లేవు. ఎడారి ఇసుక రేణువంత విశ్వాసాన్ని పట్టుకుని, ఒక ఎడారినే మోస్తున్న భావనతో బయలుదేరిన భయపీడితులు వారు. తాము భయపడుతుం టారు కాబట్టే, భయపెడుతుంటారు. అన్ని రూపాలు తానే అయిన వాడికి ఏ రూపం లేకపోవడం ఒక దశే తప్ప అదొక శాశ్వత లక్షణం కాదని విశాల విశ్వం చెప్తుండగా, చాలా చిన్న భేదాలతో నరమేధం ఒక నాగరికతగా చెలరేగిపోతారు. వారు యుద్ధంలో లేకున్నా, పాత్రికేయులైనా సరే తలలు మీడియాలలో చూపిస్తూ నరికే తీవ్రత ఒకరిది. తీవ్రవాదం మీద యుద్ధం అంటూ, ఖండాలు ఖండాల ప్రజలను ప్రమాదాల అంచుకు నెడుతున్న ఆర్థిక అభి వృద్ధి ఉగ్రవాదం మరొకరిది, ఎవరివల్ల ఎక్కువ నష్టం అన్నదానికన్నా, ఇద్దరివల్లా పలు పార్శ్వాలలో శతాబ్దా లుగా సభ్య సమాజం నష్టపోతూనే ఉన్నదనేది చార్లీ పత్రిక తాత్విక ప్రాతిపదిక. ఆ పత్రిక చేసినదీ, చేస్తున్న దల్లా మందలించడమే. వెక్కిరింతకు వేద పూజ్యత ఉన్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల ఫ్రెంచ్ సమాజం అది. మేమే గొప్ప, మా భావనలే అధికం, మా దేవుళ్లే అందరికన్నా అధికం అన్నవి ఒక రకంగా ఫాసిస్టు భావ నలు. ఎటొచ్చీ ఇవి పిండరూపంలో ఉంటాయి. అదను దొరికితే, ఏ దేశంలోనైనా, ఏ మతంలోనన్నా, ఇవి తలలు పెకైత్తుతాయి. ఈ ఆధిపత్యపు భావనలకు దాసా నుదాసులైన అందరికీ, ఈ వితండ చేష్టలంటే లోప ల్లోపల ఇష్టమే ఉంటుంది. అదే మత వ్యవస్థతో వచ్చిన వైపరీత్యం. గత శతాబ్దాలన్నీ వీటితోనే నిండి ఉన్నాయి. ప్రతి సమాజం, తాను నమ్ముతున్న నమ్మకాలు నిజంగా ఏ విలువ కలిగి ఉన్నాయో పరిశీలించుకోవడం కోసం, వ్యంగ్య చిత్రం వేపు చూస్తుంది. ప్రతి కార్టూనూ ఒక సూక్ష్మ రూప శాస్త్ర చికిత్స, ఒక మానసిక వైద్యశాల. మూఢ నమ్మకాలతో గడ్డ కట్టిన ప్రతీ మత వ్యవస్థ ను ప్రశ్నించిన, వెక్కిరించిన కంచుకాగడా, చార్లీ పత్రిక. క్రీస్తు, పోప్, ప్రవక్త, ఫ్రెంచ్ అధ్యక్షుడు చార్లెస్ డిగాల్, అందరి వ్యంగ్య చిత్రాలు ప్రతీవారం, ఆ ఫ్రెంచ్ పత్రిక సంచలనాల ముఖచిత్రంగా వెలువడుతూ వచ్చాయి. రామాయణం మీద మన తెలుగు సమాజంలోనే ఎన్ని మౌలిక దృక్కోణాలు వెలువడ్డాయో మనకందరకూ తెలుసు. అంతమాత్రాన, రాముడిని దేవుడిగా విశ్వసించే వారికి విశ్వాస భంగం కలుగదు. ఒక ప్రశ్నల సమా హారానికే నిలదొక్కుకోలేని బలహీనులు కారు మత స్థాపకులు, మత దేవతలు. మేము ఒక సమూహం కాబట్టి మా నమ్మకాలను గాయపరచవద్దు అని పిరికి వాళ్లు మాత్రమే అంటారు. దీనికి ఒకనాటి యూరోప్ కూడా అతీతం ఏమీ కాదు. మన గ్రహ కుటుంబం, భూ కేంద్రం కాదని, సూర్య కేంద్రకం అని చెప్పినందుకు, అప్పటి వారి క్రైస్తవ మత నమ్మకాలు గాయపడే, వారు బ్రూనో వంటి శాస్త్ర వేత్తను నూనె గుడ్డలకు కట్టి కాల్చి వేశారు. మనం కూడా రామ మందిరమంటూ, మసీదంటూ అనేక మంది ప్రజ లను అనాగరికంగా చంపుకున్నాము. వెరసి ఏ సమా జమూ, ఈ మత ప్రేరిత విద్వేషాలకు దూరంగా లేదు. దైవ భావన పట్ల చర్చ, అనంత విశ్వం గురించి చీమ తలకాయలతో ఆలోచించినట్టే ఉంటుంది. దౌర్జన్య భాషకు ఏ దేవుడి గ్రంథంలోనూ అనుమతి లేదు. ఏ దేవుడూ, కొందరు ప్రజలకు అనుకూలుడూ, మరికొం దరు ప్రజలకు వ్యతిరేకీ కాదు. మత వ్యవస్థలు కట్టు తప్పి, పదే పదే తెంపరితనాలను తెలుపుతున్నప్పుడు మతం తెగబడి నెత్తురు కళ్ల జూసినప్పుడు, సమాజంలో పలు విశ్వాసాల మధ్య ముసలం వంటి దశకు పోతు న్నప్పుడు, ఏ సూఫీలూ సమర్థించలేదు. ఏ సాధు సం త్లూ ఆమోదించలేదు. ఏ ఫాదరీలూ కొమ్ము కాయ లేదు. ప్రతీ మతంలో ఈ జీవామృత సారం ఉన్నది. అది అందుకోలేని వారు ఏ మతంలో ఉన్నా వారి వల్ల ఆ మతానికే చేటు. ఒక్క పత్రికపై దాడి చేశారు. ఒక ప్రధాన సంపాదకుడిని, కొందరు కార్టూనిస్టులను చంపగలి గారు. రేపు వందలాది పత్రికలు అవే కార్టూన్లు ప్రచు రిస్తే, ఎంత మంది ఉగ్రవాదులు రాగలుగుతారు? ఎన్ని పత్రికల గొంతులపై దౌర్జన్యాలను సాగిస్తారు? ఏ మతమూ తన మధ్యయుగాల ఆలోచనలతో, ఆధునిక మహా ప్రవాహాన్ని ఆపలేదు. యుద్ధాలు చేసి బాంబులేయడం. తలలు నిర్దాక్షిణ్యంగా ఉత్తరించడం, పసిపిల్లలను చంపడం, కులం పేరిట కళ్లు పీకడం, కొత్త గా పెళ్లి చేసుకున్నా వారిని పరువు హత్యలు చేయడం... ఆలోచిద్దాం మరి. ఏ దేశ సమాజం ఇటువంటి విపరీత సంఘటనలకు మించిన పరిణతి కలిగి ఉంది? అలనాడు సోక్రటీస్ లొంగిపోవడాన్ని తిరస్కరించి, తాగిన హైమ్లాక్ విషంలోనే ఉన్నది మూర్ఖ ఆధిపత్యాల పట్ల మానవ నిరసన. మనకి చార్వాకులున్నారు. వాళ్లకి చార్లీలున్నాయి. కళలను ద్వేషించి, కళాకృతులను ద్వేషిం చి ఒక ఎడారి ఉగ్రవాదం మౌఢ్యపు చీకటిలో మృత్యు నృత్యం చేస్తూ ఉంటే, దాని అనుయాయుల దేశాలకు పాశ్చాత్య సమాజం కలిగిస్తున్న కడగండ్లను, తిరస్కరి స్తూనే, మానవ సమాజ పరిణామంలో ప్రశ్నకు రూపం గా నిలిచిన సోక్రటీస్ను, నేనే ఎందుకు క్రైస్తవుడ్ని కాను అన్న బెర్ట్రాండ్ రస్సెల్నూ, చనిపోయిన తండ్రికిచ్చిన మాట పక్కన పెట్టి, రాముడిని, చక్కగా రాజ్యం చేసుకో మన్న చార్వాకులను, ప్రేమ తత్వశిఖరాలైన సూఫీలను చూపెట్టి, జవాబు చెప్దాము. అల్లాహు అక్బర్, భగవాన్ సర్వాగ్రణి, గాడ్ ఈజ్ గ్రేటెస్ట్ అంటే భాషలు వేరైనా భావన ఒక్కటే అని. ఈ భాషలన్నీ పలికే భౌతిక అవయ వం నాలుక ఒక్కటే అని. తుపాకీ తూటాలు ఏర్పరిచిన ఖాళీలను, పూరించడంలో మానవ సమాజం ఎప్పుడూ నూటికి నూరు మార్కులు సాధిస్తూనే ఉంటుంది. (వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత) మొబైల్: 98492 00385 -
మాటల వంతెనపై నడచి వెళ్లినవాడు
సందర్భం సంభాషణలుగా నడిచే కథను ఉత్కంఠ అనే కత్తి వాదర మీద నడిపించడం గణేశ్ పాత్రో అభ్యాసం చేసిన విద్య. చక్కని మాట ఎవరి కలం నుంచైనా తెరకు ఎక్కినప్పుడల్లా, రంగస్థలిపై చప్పట్లు కొట్టించుకున్నప్పుడల్లా ఆయన చిరంజీవి. ఉత్తరాంధ్ర మాండలికాన్ని ఉజ్వలంగా పావలా, కొడుకు పుట్టాల వంటి నాటకాలలో ఎగ రవేసిన నాటక కర్త, అలా పాత్ర ల సహజ పలుకు తీరులో తన దృశ్యాభివ్యక్తి రూపానికి తెరలు తీసిన ప్రతిభామూర్తి, గురజాడ నాటక రూపానికి వారసుడుగా సంభావించుకోదగిన రచయిత గణేశ్ పాత్రో కొత్త సంవత్సరంలో, ఏడు పదులు దాటకుం డానే మనలని వదిలి వెళ్లిపోయారు. 1965 నుంచీ తన నాటక సృజన ద్వారా తెలుగునాట సుపరిచితులు. వీరు పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్స్ సంస్థలో మొదట పనిచేసే వారు. విశాఖలో నారాయణపేటలో ఉండే వారు. అప్పటికింకా వారు కొడుకు పుట్టాల నాటకం రాయలేదని, సీనియర్ రచయిత ఎల్.ఆర్.స్వామి గుర్తుచేసుకున్నారు. వారి నాట కాలలో నటించిన రావుజీ, శ్యామల, వంకాయల, ఎస్. కె, మిస్రో, విజయలక్ష్మి తదితరులు కూడా కొందరు సినిమా రంగాన్ని చేరుకుని, మరికొందరు నాటక రంగంలోనే తమ సేవలు అందించారు. వారి నాటకాలలో అసుర సంధ్య చాలా శక్తివంతమైన నాటకం. అలుడ్ని బలుడు కొడితే, బలుడ్ని బ్రహ్మదేవుడు కొడతాడు అన్న నీతి, చిన చేపను పెద చేప అనే పలు కుబడి ఎలా గ్రామీణస్థాయిలో మునసబు, మోతుబరి రైతు, పేద రైతులను మోసం చేసి, పట్నానికి వెళ్లినపుడు, అక్కడ పట్నవాసుల చేతిలో ఎలా వారు మోసపోతారో, తిరిగి ఈ పట్నవాసులు ఎలా మహానగరాలలో మోస పోతారో చెప్తూ , దేశం ఎల్లెడలా అల్లుకున్న అసుర సంధ్య ను ప్రస్తావించిన నాటకం ఇది. ఈ నాటకం చివర్లో, ప్రయోక్త, ప్రేక్షకులతో, మీరు ఈ నాటకం చూసి అసంతృ ప్తితో ఇంటికి వెళ్లడం రచయిత ఉద్దేశం. అప్పుడే ఈ నాటకం ఫలితం సాధించి నట్టు అని చెప్తాడు. అలా డైలాగ్ కింగ్గా, సంభాషణలుగా నడిచే కథను ఉత్కంఠ అనే కత్తివాదర మీద నడిపించడం గణేశ్ పాత్రో అభ్యాసం చేసిన విద్య. ఈ నాటకం లో అమ్మవారి ఘటాలను తలకెత్తుకు వెళ్లే పేదలలో ఒకడు ఆ అన్నపు ఘటాన్ని దొం గిలించి తమ వాడకు తీసుకు వచ్చేయడం జరుగుతుంది. ఓలమ్మో, వొణ్ణమే అంటూ ఆ పేదలందరూ ఆ అన్నపు బుట్ట చుట్టూ చేరి, ఆకలితో ఆరగించడం, ఆ నేరానికి ఆ పేదవాడు ప్రాణాలు పోగొట్టు కునే శిక్షకు గురికావడం వంటి సంఘటనలు ప్రేక్షకులు మరచిపోలేరు అని గుర్తు చేసుకున్న పేరి రవికుమార్కి నా కృతజ్ఞతలు. బాలచందర్ సినిమాలు అంటే గణేశ్ పాత్రో మాట లు అన్నది, తూర్పున సూర్యుడు ఉదయించడం వంటి ఒక సహజమైన విషయం. మరో చరిత్ర, స్వాతి, ఇది కథ కాదు, రుద్రవీణ, సీతారామయ్య గారి మనవరాలు వంటి నూరు సినిమాలకు మాటలు రాసిన కృషి గణేశ్ పాత్రోది. ఆయన ఆకలిరాజ్యం, చిలకమ్మ చెప్పింది, స్వాతి, సీతా రామయ్య గారి మనవరాలు, సినిమాలకు జాతీయ అవా ర్డులు అందుకున్నారు పాత్రో ఈ సినిమాలో రాసిన ఒక చక్కని సంభాషణ. జీవితం చిత్రమైన గురువు. ముందు పరీక్ష పెట్టి, తరువాత పాఠం నేర్పుతుంది. పావలా నాటకంలో ఆ దొరికిన పావలాతో ఆ పేద లందరూ, ఎవరికి వారు ఏవేవో చేయాలనుకున్న వారల్లా చివరలో పావలా చెల్లనిదని తెలియగానే మ్రాన్పడి పోవ డంతో నాటకం ముగుస్తుంది. పావలా నాటకంలో వేసిన శ్యామల, పావలా శ్యామలగా తెలుగు నాటక రంగంలో స్థిర నామం పొందింది. మాటల మరాఠీగా, నాటకం లేదా సినిమా ప్రేక్షకులు, కుర్చీ అంచున కూచుని ఆ కళారూపా న్ని చూసేలా, పదసంపద, చిచ్చుబుడ్లలా వెలిగించిన కళల దీపావళి వలె మన చుట్టూ అల్లుకుంటుంది. పార్వతీపురం దారిలోని మార్కొండపుట్టిలో పుట్టి, పార్వతీపురంలో చదువుకుంటున్నప్పుడే, వోలేటి బుచ్చిబాబు అనే సీనియర్ నటుడి ప్రభావంతో నాటకాల పట్ల, ఏకపాత్రాభిన యాలపట్ల ఆసక్తి పెంచుకుని పరాజితుడు అనే ఏక పాత్రను రాసి తానే వేషం కట్టారు. విశా ఖసముద్రం, ఈ గణేశుడి మదిలోని కల రంగ తరంగ మృదంగాలను నిద్రలేపిం ది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కుప్పిలి వేం కటేశ్వరరావుగారి సహాయకుడిగా, తాను నాటకంలో మెళకువలు నేర్చి, నటుడి కన్నా, నాటక రచయితగా తన ప్రతిభ తిరుగులేనిది అని గుర్తిం చిన తరువాత గణేశ్ పాత్రో మరి వెనుతిరిగి చూడలేదు. ప్రముఖ నటుడు ప్రభాకరరెడ్డి మొదటి అవకాశం కల్పిం చగా, కొడుకు పుట్టాల సినిమాగా వెండితెరకు ఎక్కింది. ప్రత్యగాత్మ, ఆత్రేయ వంటి వారిచేయి పట్టి నడిపించగా నడిచిన పదగణాల ఆరాధకుడు గణేశ్ పాత్రో. వారి చేత తన సినిమాలకు ఎన్నో సంభాషణలు రాయించుకున్న బాలచందర్ వెనకాలే, కొద్ది రోజుల తేడాలో గణేశ్పాత్రో వెళ్లిపోవడం, అక్కడ ఇంకేదో కళాకృతికి, మాటలు పొదగ డం కోసమేమో అని మనకు అనిపిస్తే, అదేమీ అతిశయోక్తి కాదు. జీవితం అనే నాటకంపట్ల అసంతృప్తి, ఒక వీడ్కోలు భావనగా, మనకోసం వదిలివెళ్లిన ఈ ఉత్తముడు, మాట ల వంతెన మీదే నడిచివెళ్లి పోయుంటాడు. నిర్ణయం సిని మాలో హలో గురూ ప్రేమ కోసమే పాట రచయిత కూడా ఈ గణేశుడే. మనకు వారి కళారూప ప్రేమను వదిలి వెళ్లిన గణేశ్ పాత్రో ఎక్కడికీ వెళ్లలేదు. చక్కని మాట, ఎవరి కలం నుంచైనా తెరకు ఎక్కినప్పుడల్లా, రంగస్థలిపై చప్పట్లు కొట్టించుకున్నప్పుడల్లా, ఆయన చిరంజీవి. రామతీర్థ (వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత) మొబైల్: 9849200385