రామతీర్థ
సందర్భం
మతంలోని జీవామృత సారాన్ని గ్రహించలేని వారి వల్ల ఆ మతానికే చేటు. ఒక పత్రికపై దాడిచేసి ప్రధాన సంపాదకుడిని, కార్టూనిస్టులను చంపగలిగారు. రేపు వంద లాది పత్రికలు అవే కార్టూన్లు ప్రచురిస్తే, ఎంత మంది ఉగ్రవాదులు రాగలుగుతారు?
కార్టూన్లు జగవద్గీతలు. తుపాకులు పిచ్చి రబ్బరు గుళ్లు. కొంచెం చెరుపుతాయేమో కానీ పూనికను చెదరగొట్ట లేవు. ఎడారి ఇసుక రేణువంత విశ్వాసాన్ని పట్టుకుని, ఒక ఎడారినే మోస్తున్న భావనతో బయలుదేరిన భయపీడితులు వారు. తాము భయపడుతుం టారు కాబట్టే, భయపెడుతుంటారు. అన్ని రూపాలు తానే అయిన వాడికి ఏ రూపం లేకపోవడం ఒక దశే తప్ప అదొక శాశ్వత లక్షణం కాదని విశాల విశ్వం చెప్తుండగా, చాలా చిన్న భేదాలతో నరమేధం ఒక నాగరికతగా చెలరేగిపోతారు.
వారు యుద్ధంలో లేకున్నా, పాత్రికేయులైనా సరే తలలు మీడియాలలో చూపిస్తూ నరికే తీవ్రత ఒకరిది. తీవ్రవాదం మీద యుద్ధం అంటూ, ఖండాలు ఖండాల ప్రజలను ప్రమాదాల అంచుకు నెడుతున్న ఆర్థిక అభి వృద్ధి ఉగ్రవాదం మరొకరిది, ఎవరివల్ల ఎక్కువ నష్టం అన్నదానికన్నా, ఇద్దరివల్లా పలు పార్శ్వాలలో శతాబ్దా లుగా సభ్య సమాజం నష్టపోతూనే ఉన్నదనేది చార్లీ పత్రిక తాత్విక ప్రాతిపదిక. ఆ పత్రిక చేసినదీ, చేస్తున్న దల్లా మందలించడమే. వెక్కిరింతకు వేద పూజ్యత ఉన్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల ఫ్రెంచ్ సమాజం అది.
మేమే గొప్ప, మా భావనలే అధికం, మా దేవుళ్లే అందరికన్నా అధికం అన్నవి ఒక రకంగా ఫాసిస్టు భావ నలు. ఎటొచ్చీ ఇవి పిండరూపంలో ఉంటాయి. అదను దొరికితే, ఏ దేశంలోనైనా, ఏ మతంలోనన్నా, ఇవి తలలు పెకైత్తుతాయి. ఈ ఆధిపత్యపు భావనలకు దాసా నుదాసులైన అందరికీ, ఈ వితండ చేష్టలంటే లోప ల్లోపల ఇష్టమే ఉంటుంది. అదే మత వ్యవస్థతో వచ్చిన వైపరీత్యం. గత శతాబ్దాలన్నీ వీటితోనే నిండి ఉన్నాయి. ప్రతి సమాజం, తాను నమ్ముతున్న నమ్మకాలు నిజంగా ఏ విలువ కలిగి ఉన్నాయో పరిశీలించుకోవడం కోసం, వ్యంగ్య చిత్రం వేపు చూస్తుంది. ప్రతి కార్టూనూ ఒక సూక్ష్మ రూప శాస్త్ర చికిత్స, ఒక మానసిక వైద్యశాల.
మూఢ నమ్మకాలతో గడ్డ కట్టిన ప్రతీ మత వ్యవస్థ ను ప్రశ్నించిన, వెక్కిరించిన కంచుకాగడా, చార్లీ పత్రిక. క్రీస్తు, పోప్, ప్రవక్త, ఫ్రెంచ్ అధ్యక్షుడు చార్లెస్ డిగాల్, అందరి వ్యంగ్య చిత్రాలు ప్రతీవారం, ఆ ఫ్రెంచ్ పత్రిక సంచలనాల ముఖచిత్రంగా వెలువడుతూ వచ్చాయి. రామాయణం మీద మన తెలుగు సమాజంలోనే ఎన్ని మౌలిక దృక్కోణాలు వెలువడ్డాయో మనకందరకూ తెలుసు. అంతమాత్రాన, రాముడిని దేవుడిగా విశ్వసించే వారికి విశ్వాస భంగం కలుగదు. ఒక ప్రశ్నల సమా హారానికే నిలదొక్కుకోలేని బలహీనులు కారు మత స్థాపకులు, మత దేవతలు. మేము ఒక సమూహం కాబట్టి మా నమ్మకాలను గాయపరచవద్దు అని పిరికి వాళ్లు మాత్రమే అంటారు.
దీనికి ఒకనాటి యూరోప్ కూడా అతీతం ఏమీ కాదు. మన గ్రహ కుటుంబం, భూ కేంద్రం కాదని, సూర్య కేంద్రకం అని చెప్పినందుకు, అప్పటి వారి క్రైస్తవ మత నమ్మకాలు గాయపడే, వారు బ్రూనో వంటి శాస్త్ర వేత్తను నూనె గుడ్డలకు కట్టి కాల్చి వేశారు. మనం కూడా రామ మందిరమంటూ, మసీదంటూ అనేక మంది ప్రజ లను అనాగరికంగా చంపుకున్నాము. వెరసి ఏ సమా జమూ, ఈ మత ప్రేరిత విద్వేషాలకు దూరంగా లేదు.
దైవ భావన పట్ల చర్చ, అనంత విశ్వం గురించి చీమ తలకాయలతో ఆలోచించినట్టే ఉంటుంది. దౌర్జన్య భాషకు ఏ దేవుడి గ్రంథంలోనూ అనుమతి లేదు. ఏ దేవుడూ, కొందరు ప్రజలకు అనుకూలుడూ, మరికొం దరు ప్రజలకు వ్యతిరేకీ కాదు. మత వ్యవస్థలు కట్టు తప్పి, పదే పదే తెంపరితనాలను తెలుపుతున్నప్పుడు మతం తెగబడి నెత్తురు కళ్ల జూసినప్పుడు, సమాజంలో పలు విశ్వాసాల మధ్య ముసలం వంటి దశకు పోతు న్నప్పుడు, ఏ సూఫీలూ సమర్థించలేదు. ఏ సాధు సం త్‌లూ ఆమోదించలేదు. ఏ ఫాదరీలూ కొమ్ము కాయ లేదు.
ప్రతీ మతంలో ఈ జీవామృత సారం ఉన్నది. అది అందుకోలేని వారు ఏ మతంలో ఉన్నా వారి వల్ల ఆ మతానికే చేటు. ఒక్క పత్రికపై దాడి చేశారు. ఒక ప్రధాన సంపాదకుడిని, కొందరు కార్టూనిస్టులను చంపగలి గారు. రేపు వందలాది పత్రికలు అవే కార్టూన్లు ప్రచు రిస్తే, ఎంత మంది ఉగ్రవాదులు రాగలుగుతారు? ఎన్ని పత్రికల గొంతులపై దౌర్జన్యాలను సాగిస్తారు?
ఏ మతమూ తన మధ్యయుగాల ఆలోచనలతో, ఆధునిక మహా ప్రవాహాన్ని ఆపలేదు. యుద్ధాలు చేసి బాంబులేయడం. తలలు నిర్దాక్షిణ్యంగా ఉత్తరించడం, పసిపిల్లలను చంపడం, కులం పేరిట కళ్లు పీకడం, కొత్త గా పెళ్లి చేసుకున్నా వారిని పరువు హత్యలు చేయడం... ఆలోచిద్దాం మరి. ఏ దేశ సమాజం ఇటువంటి విపరీత సంఘటనలకు మించిన పరిణతి కలిగి ఉంది?
అలనాడు సోక్రటీస్ లొంగిపోవడాన్ని తిరస్కరించి, తాగిన హైమ్లాక్ విషంలోనే ఉన్నది మూర్ఖ ఆధిపత్యాల పట్ల మానవ నిరసన. మనకి చార్వాకులున్నారు. వాళ్లకి చార్లీలున్నాయి. కళలను ద్వేషించి, కళాకృతులను ద్వేషిం చి ఒక ఎడారి ఉగ్రవాదం మౌఢ్యపు చీకటిలో మృత్యు నృత్యం చేస్తూ ఉంటే, దాని అనుయాయుల దేశాలకు పాశ్చాత్య సమాజం కలిగిస్తున్న కడగండ్లను, తిరస్కరి స్తూనే, మానవ సమాజ పరిణామంలో ప్రశ్నకు రూపం గా నిలిచిన సోక్రటీస్‌ను, నేనే ఎందుకు క్రైస్తవుడ్ని కాను అన్న బెర్ట్రాండ్ రస్సెల్నూ, చనిపోయిన తండ్రికిచ్చిన మాట పక్కన పెట్టి, రాముడిని, చక్కగా రాజ్యం చేసుకో మన్న చార్వాకులను, ప్రేమ తత్వశిఖరాలైన సూఫీలను చూపెట్టి, జవాబు చెప్దాము. అల్లాహు అక్బర్, భగవాన్ సర్వాగ్రణి, గాడ్ ఈజ్ గ్రేటెస్ట్ అంటే భాషలు వేరైనా భావన ఒక్కటే అని. ఈ భాషలన్నీ పలికే భౌతిక అవయ వం నాలుక ఒక్కటే అని. తుపాకీ తూటాలు ఏర్పరిచిన ఖాళీలను, పూరించడంలో మానవ సమాజం ఎప్పుడూ నూటికి నూరు మార్కులు సాధిస్తూనే ఉంటుంది.
(వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత)
మొబైల్: 98492 00385