నేనే ముఠా మేస్త్రీ
ఆత్రేయపురం : ‘ఓయ్రబ్బా...ఓయ్రబ్బా... ఓయ్.. ఈ రీచ్‌కు నేనే మేస్త్రీ’ అంటూ తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ ముఠా మేస్త్రీ అవతారమెత్తారు. ఇసుక రీచ్‌ల్లో అక్రమాలను అరికట్టేందుకు ఆయన పడే పాట్లు ఇవి. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టినా, సామాన్యులకు అది అందని ద్రాక్షగానే మారింది. ఇసుక రీచ్‌ల్లో తిష్టవేసిన కొందరు అధికార పార్టీ నాయకులు.. వాహనాల్లో లోడింగ్, ర్యాంపుల్లో బాటల నిర్వహణ కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరకు నాలుగు రెట్లు వసూలు చేస్తున్నారు. ఈ అక్రమాలను అడ్డుకునేందుకు ఎస్సై జేమ్స్ రత్న ప్రసాద్ ముఠామేస్త్రీ అవతారమెత్తారు.
ట్రాక్టర్లపై కూలీ వేషంలో ఎస్సై రత్నప్రసాద్ ఆత్రేయపురం, వద్దిపర్రు, వెలిచేరు, పేరవరం ఇసుక రీచ్‌లపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా గురువారం వెలిచేరు ఇసుక రీచ్‌లో అక్రమ వసూళ్లు జరుగుతున్నట్టు గుర్తించి, జట్టు మేస్త్రీని మందలించారు. అధిక వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్వాహకులు పలాయనం చిత్తగించడంతో గురువారం వెలిచేరు రీచ్‌లో ఇసుక లోడింగ్ నిలిచిపోయింది.