మిద్దెలు, మేడలపైనే అంత్యక్రియలు !
వారణాసి: భారీ స్థాయిలో వరదలు వచ్చినప్పుడు ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లడం, లేదంటే ఇంటి మిద్దెలు, మేడలు ఎక్కి భద్రంగా ఉండటం సహజమే. కానీ, ఇప్పుడు మృతదేహాలు కూడా మేడలపైకి వెళుతున్నాయి. అదేమిటి అని ఆశ్చర్యపోతున్నారా. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్ మొత్తం జలమయం అయింది. ముఖ్యంగా ఇక్కడి గంగానది ఉదృతంగా ప్రవహిస్తోంది. వారణాసి వద్ద ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. అటు బిహార్ లో కూడా ఇలాంటి పరిస్థితే.
ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ లోని ఉత్తర భూభాగాన్ని దాదాపు లక్షమందికి పైగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇక వారణాసిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఉన్న ప్రత్యేక ఘాట్లన్ని నీటిలో మునిగిపోయాయి. ఫలితంగా ఇప్పుడు ఆ క్రతువులు నిర్వహించేందుకు ఎక్కడా ఒక్క స్మశాన వాటికి, ప్రత్యేక ప్రదేశం లేకపోవడంతో చనిపోయినవారి మృతదేహాలను ఘాట్ ల వద్ద ఉన్న కొన్ని భవన సముదాయాలపై భాగంలోకి తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా చనిపోయినవారిని తీసుకెళ్లి శ్మశానం కొరతతో భవంతిపై భాగంలో పెట్టి దహనం చేస్తున్నారని, ఇది వారణాసిలో గంగా ప్రవాహ తీరుకు ఉదాహరణ అని అధికారులు చెబుతున్నారు.