Ganga River cleansing
-
ఏడాది చివరకు కాలుష్యరహిత యమున
న్యూఢిల్లీ: రాబోయే డిసెంబర్ చివరకు యమునా నదిలోకి ఎలాంటి మురికి నీరు చేరదని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ చెప్పారు. నదిలోకి దారితీసే అన్ని మురుగుకాల్వలను అప్పటికల్లా మూసివేస్తారన్నారు. 1,300కిలోమీటర్ల పొడవున ప్రవహించే యమునా నది దేశంలోని అత్యంత కలుషిత నదుల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ నది నుంచి దేశరాజధానికి మంచినీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీలో నది 22 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. కానీ నదిలోని 98 శాతం కలుషితమంతా ఇక్కడనుంచే వస్తోంది. నదిలోకి మురుగునీరు వదిలే 18 డ్రెయిన్స్ ఉన్నాయని, వీటిని మూసివేసి, మురుగునీటిని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు మళ్లించే పనులు చేపడతామని అశోక్ చెప్పారు. ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిని నదిలోకి వదులుతారని, దీంతో నదిలో పరిశుభ్రమైన నీరు మాత్రమే ప్రవహిస్తుందని వివరించారు. యమునా నదిని శుభ్రపరిచేందుకు ఎన్జీయోధా(నమామి గంగే యమునా ఆఫ్ ఢిల్లీ ఏరియా)ను ప్రారంభిస్తామన్నారు. -
‘నమామి గంగా’పై మోదీ సమీక్ష
కాన్పూర్: గంగా నది శుద్ధీకరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలకు ప్రత్యక్ష తార్కాణంగా నిలవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. నమామి గంగా ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన జాతీయ గంగా మండలి మొదటి భేటీకి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చంద్రశేఖర్ ఆజాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో శనివారం ఈ భేటీ జరిగింది. నదీ జలాలను రక్షించేందుకు అది ప్రవహిస్తున్న రాష్ట్రాలకు 2015–20 వరకు రూ. 20 వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకు వచ్చిందని సంబంధిత వ్యవహారాల అధికారులు తెలిపారు. భేటీ అనంతరం మోదీ అరగంట పాటు గంగానదిలో బోటు షికారుకు వెళ్లారు. ప్రయాణం నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఘాట్ మెట్లు ఎక్కుతుండగా ఆయన పట్టు జారి పడిపోయారు. వెంటనే ఆయన వెంట ఉన్న బలగాలు ఆయనకు సహాయం చేశాయి. అన్ని మెట్లలో ఒక మెట్టు ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఘటన జరిగినట్లు ఎస్పీజీ బలగాలు తెలిపాయి. -
రూ.7 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఫలితమేదీ!
గంగా నది ప్రక్షాళనపై ప్రభుత్వాన్ని ఆక్షేపించిన గ్రీన్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ: కలుషితమవుతున్న గంగా నది ప్రక్షాళనకు రెండేళ్లలో రూ.7 వేల కోట్లు ఖర్చు పెట్టినా పర్యావరణ సమస్య నేటికీ తీవ్రంగానే ఉందని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. నదిని పరిరక్షించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. హరిద్వార్– ఉన్నావోల మధ్య గంగా నది తీరం నుంచి 100మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరాదంది. ఈ ప్రాంతాన్ని ‘అభివృద్ధి రహిత ప్రాంతం’(నో డెవలప్మెంట్ జోన్)గా ప్రకటించింది. నదికి 500 మీటర్ల పరిధిలో వ్యర్థాలను డంప్ చేయరాదని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా నదిలో చెత్త డంప్ చేసినవారు పర్యావరణ పరిహారం కింద రూ.50 వేల జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంతర్కుమార్ నేతృత్వం లోని ప్రత్యేక బెంచ్ ఉత్తర్వులిచ్చింది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎం జీసీ) కింద చేపట్టిన ప్రక్షాళన పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని సూచించింది. ఈ మేరకు 543 పేజీల ఉత్తర్వుల్లో మార్గదర్శకాలను ఎన్జీటీ సూచించింది.