గంగనీళ్ల జాతర ప్రారంభం
సారంగాపూర్, న్యూస్‌లైన్ : భక్తుల కొంగుబంగారం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ అడెల్లి మహాపోచమ్మ గంగంనీళ్ల జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస శర్మ, ఈవో నారాయణ, చైర్మన్ రవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆభరణాలు మూటకట్టారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారి ఆభరణాలకు, మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆనవాయితీ ప్రకారం సేవదారులు తమ తలపై అమ్మవారి నగలను ధరించి ఊరేగింపుగా కాలినడకన తీసుకెళ్లారు. తొలుత ఆలయంనుంచి ప్రారంభమైన నగల ఊరేగింపు మండలంలోని అడెల్లి, సారంగాపూర్, యాకర్పెల్లి, వంజర్, ప్యారమూర్, గ్రామాల మీదుగా దిలావర్పూర్ మండలంలోని కదిలి, మాటేగాం, దిలావర్పూర్, కంజర్, సాంగ్వి గ్రామాల గుండా గోదావరి నదీ తీరానికిరాత్రివరకు చేరుకోనున్నాయి.
దారిపొడవునా దండాలే...
అమ్మవారి నగలు ఆయా గ్రామాల గుండా ఊరేగింపుగా వెళ్తుండటంతో ఆయా గ్రామాల ప్రజ లు పెద్దసంఖ్యలో అమ్మవారి నగలను అనుసరి స్తూ కాలినడకన గంగానదికి పయనమయ్యా రు. దీంతో పాటు ఆయా గ్రామాల్లో మహిళలు అమ్మవారి నగలకు గ్రామ గ్రామాన మంగళ హారతులతో స్వాగతం పలికి అమ్మవారిని తమ గ్రామ పొలిమేరల వరకు సాగనంపారు. అలాగే పలువురు భక్తులు దండాలు పెట్టారు. గంగపుత్రులు తమ పనిమట్లయిన వలలతో గొడుగు పట్టి అమ్మవారిని సాగనంపారు. అమ్మవారి నగలవెంట పోలీసులు, ఆలయ సిబ్బంది గోదావరి నరదికి తరలివెళ్లారు.
అమ్మవారి ఆభరణాల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు బందోబస్తు నిర్వహించామని ఎస్సై లింగమూర్తి తెలిపారు. వీరం తా బృందాలుగా ఏర్పడి భద్రతా చర్యలు చేపడుతారని పేర్కొన్నారు. తిరగి మళ్లీ ఆదివారం ఉదయం సూర్యోదయానికి ముందే నగలశుద్ధి, పవిత్ర గోదావరి నదిలోని నీటితో జలాభిషేకం అనంతరం ఇవే గ్రామాల మీదుగా సాయంత్రానికి ఆలయానికి నగలు చేరుకోవడంతో జాతర ముగియనుంది. నగల వెంట గోదావరి నదికి తరలివెళ్లిన భక్తులంతా తమ వెంట తీసుకెళ్లిన గడ ముంతల్లో గంగానది జలాలను వెంటతీసుకుని వస్తారు. వీటిని ఇళ్లలో, పంట పొలాల్లో చ ల్లడంతో పాడి పంటలు, పిల్లాపాపలు చల్లగా ఉంటారని భక్తుల విశ్వాసం. అయితే ఆదివారం జరిగే జాతరలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.