సచివాలయంలో నయీమ్ ఖాకీలు!
- అమెరికా వెళ్లేందుకు అనుమతికోసం విశ్వప్రయత్నం
- ఓ మంత్రితో ఏకాంతంగా భేటీ
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో ఆరోపణలతో సస్పెండైన ఇద్దరు పోలీసు అధికారులు సోమవారం సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. నయీమ్‌తో అంటకాగారని, పలు దందాలకు సహకరిం చారనే ఆరోపణల నేపథ్యంలో దాదాపు నెల రోజుల కింద ఐదుగురు పోలీసు అధికారులను డీజీపీ అనురాగ్‌శర్మ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వెలుగులోకి రాని అధికారులు ఇలా సచివాలయంలో కనిపించడంతో మీడియా, ఇతర పోలీసు అధికారులు ఆశ్చర్యపోయారు.
అమెరికా వెళ్తాం.. అనుమతి కావాలి
నయీమ్ కేసులో సస్పెండైన అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్‌రావు, ఏసీపీ మలినేని శ్రీనివాస్‌రావు సోమవారం సచివాలయానికి వచ్చారు. వ్యక్తిగత కారణాల రీత్యా అమెరికా వెళ్లేందుకు అనుమతి కావాలంటూ ఇటీవల వారు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని.. ఆ అనుమతి వ్యవహారం ఎంతవరకు వచ్చిందనేది తెలుసుకునేందుకు సచివాలయానికి వచ్చారని వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. సచివాలయంలోని సి బ్లాక్‌లో ఉన్న సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ)లోకి వెళ్లిన ఈ ఇద్దరు అధికారులు... తమ విదేశీ పర్యటన అనుమతిపై ఆరా తీశారని, అయితే ఆ ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపామని జీఏడీ అధికారులు చెప్పారని సమాచారం. సీఎం కార్యాలయం నుంచి అనుమతిపై స్పష్టత రాగానే ఆదేశాలిస్తామని పేర్కొన్నట్లు తెలిసింది.
మంత్రితో ఏకాంతంగా భేటీ?
ఈ ఇద్దరు పోలీసు అధికారులు జీఏడీకి వెళ్లడానికి ముందుగా... తొలి నుంచీ తమ వాదనను బలపరుస్తున్న ఓ సీనియర్ మంత్రితో ఏకాంతంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. తమ విదేశీ పర్యటనకు అనుమతిప్పించేలా ప్రయత్నించాలని ఆ మంత్రికి మొరపెట్టుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. సస్పెన్షన్ వ్యవహారంపై ఇప్పటికే రగిలిపోతున్న ఆ సీనియర్ మంత్రి.. ఈ ఇద్దరు అధికారుల తరఫున పైరవీకి సిద్ధమైనట్లు సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. అయితే.. నయీమ్ కేసులో సస్పెన్షన్‌లో ఉన్న అధికారులు.. హైదరాబాద్ విడిచివెళ్లేందుకు డీజీపీ అనురాగ్‌శర్మ నుంచి అనుమతి రావాల్సి ఉందని ఉన్నతా« దికారులు అభిప్రాయపడ్డారు. నయీమ్ కేసు విచారణలో ఉన్న సమయంలో ఆరోపణలున్న అధికారులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పేర్కొంటున్నారు.