ఫిట్నెస్ కోసం మరో స్మార్ట్ వాచీ!
టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. అందులో భాగంగానే స్మార్ట్ వాచీల పరంపర కొనసాగుతోంది. ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన సౌకర్యంతో స్మార్ట్ వాచీలను రూపొందిస్తున్నాయి. పోటాపోటీగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ వాచీలు మార్కెట్లో అందుబాటులో ఉండగా... తాజాగా గార్మిన్ ఇండియా వ్యాయామానికి పనికొచ్చే మరో కొత్త స్మార్ట్ వాచీని అందుబాటులోకి తెచ్చింది. గుండె కొట్టుకునే రేటుతోపాటు, ఫిట్నెస్ను సూచించే స్మార్ట్ నోటిఫికేషన్స్ టెక్నాలజీతో కూడిన 'వావోస్మార్ట్ హెచ్ ఆర్' యాక్టివిటీ ట్రాకర్‌ను విడుదల చేసింది.
టచ్ స్క్రీన్ తో కూడిన వావోస్మార్ట్ యాక్టివిటీ ట్రాకర్‌లో ఇంచుమించుగా స్మార్ట్ ఫోన్లో ఉండే టెక్స్ట్, కాల్స్, ఈ మెయిల్, క్యాలెండర్, సోషల్ మీడియా అలర్ట్స్, మ్యూజిక్ వంటి ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అతిపెద్ద సన్ లైట్ రీడబుల్ డిస్ ప్లే తో 'వావ్ స్మార్ట్ హెచ్ ఆర్' ట్రాకర్ ఎప్పుడూ పనిచేస్తుంది. 24 గంటలూ పనిచేసే ట్రాకర్... గుండె కొట్టుకునే రేటు, నడక, మెట్లు ఎక్కడం, కేలరీలు తగ్గడం వంటి లెక్కలన్నింటినీ ఎప్పటికప్పుడు సూచిస్తుంటుంది.
రోజువారీ జీవితంలోని కార్యకలాపాలు, సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనేవారికి వావ్ స్మార్ట్ హెచ్ ఆర్ విప్లవాత్మక ఉత్పత్తిగా చెప్పుకోవచ్చని గార్మిన్ ఇండియా నేషనల్ సేల్స్ మేనేజర్ అలి రిజ్వి చెప్తున్నారు. ఏ సమయంలోనైనా చేతికి పెట్టుకోగలిగేలా ఎంతో తేలిగ్గా, సౌకర్యవంతంగా ఈ ట్రాకర్ ఉంటుందన్నారు. ఒకసారి చార్జి చేస్తే ఏడు రోజుల పాటు పనిచేస్తుందని, ఈ పరికరాన్ని వినియోగించే వారు చేతి నుంచి తీయాల్సిన పని కూడా పెద్దగా ఉండదని అంటున్నారు. అమెజాన్‌లో ప్రస్తుతం ఈ ట్రాకర్ రూ. 14,999కు అందుబాటులో ఉంచారు.