ఆ గ్యాస్ నిక్షేపాలను ఆర్ఐఎల్కే ఇవ్వండి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కు చెందిన కేజీ డీ6 బ్లాకులో కనుగొన్న మూడు గ్యాస్ బావుల అభివృద్ధి సాంకేతిక వివాదంతో నిలిచిపోయిన నేపథ్యంలో... గడువు సడలించి, ఉత్పత్తి చేసుకోవడానికి ఆర్ఐఎల్ను అనుమతించాలని చమురు శాఖ కేంద్ర మంత్రివర్గాన్ని కోరనుంది. ధీరూభాయ్ 29, 30, 31 అనే పేర్లు పెట్టిన ఈ బావుల్లో 145 కోట్ల డాలర్ల విలువైన నిక్షేపాలున్నట్లు అంచనా.
వీటిలో వాణిజ్య కార్యకలాపాలకు అనుమతించాలని కోరుతూ 2010లో ఆర్ఐఎల్ లాంఛనంగా చమురు శాఖకు దరఖాస్తు పంపింది. అయితే నిర్ణీత ధ్రువీకరణ పరీక్షలు నిర్వహించని కారణంగా ఆర్ఐఎల్ అభ్యర్థనను డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) తిరస్కరించింది. డ్రిల్ స్టెమ్ టెస్ట్ (డీఎస్టీ) నిర్వహణకు రిలయన్స్ అంగీకరించినప్పటికీ, గడువు ముగిసిపోయిందని డీజీహెచ్ పేర్కొంది.
దాదాపు 34,500 కోట్ల ఘనపు అడుగుల మేర ఉన్న గ్యాస్ నిక్షేపాల వెలికితీతకు ఆర్ఐఎల్ను నిరాకరించడం, కొత్తగా బిడ్డింగ్ నిర్వహించడం వల్ల బావుల అభివృద్ధి ఆలస్యమవుతుందని చమురు శాఖ భావిస్తోంది. ఆర్ఐఎల్ ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం)ను కోరితే ఉత్పత్తి మరింత జాప్యమవుతుందని యోచిస్తోంది. కనుక, ఉత్పత్తి పంపిణీ ఒప్పందం(పీఎస్సీ)లోని గడువులను సవరించి, ఆర్ఐఎల్కు అవకాశం ఇవ్వాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీని చమురు శాఖ కోరనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.