గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలపై దాడులు
సైదాబాద్: అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో ఐఎస్‌సదన్ డివిజన్లోని సింగరేణి గుడిసెల్లో సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రీఫిల్లింగ్ చేయడానికి సిద్ధంగా ఉంచిన 34 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. సైదాబాద్ ఇన్స్పెక్టర్ సత్తయ్య మాట్లాడుతూ గ్యాస్ రీఫిల్లింగ్ కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు. స్థానికుల సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్న గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపైన కూడ కేసులు నమోదు చేస్తామని అన్నారు. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా సరఫరా చేసినట్లు రుజువైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.