హిట్లర్ మీసం వెనుక...
అదన్న మాట!
ముక్కుకు దిగువ గుబురుగా టూత్‌బ్రష్‌ను తలపించే మీసం కనిపిస్తే ఠక్కున గుర్తుకొచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు అడాల్ఫ్ హిట్లర్, మరొకరు చార్లీ చాప్లిన్. ఒకరు కరడు కట్టిన నియంతృత్వానికి, మరొకరు కడుపుబ్బ నవ్వించే హాస్యానికీ ప్రతీక. ఇంతకీ ఈ మీసం కథేమిటిటంటే... చార్లీ చాప్లిన్ అయితే జగమెరిగిన హాస్యనటచక్రవర్తి, అందువల్ల జనాలకు నవ్వు తెప్పించే ఉద్దేశంతో అలాంటి మీసం పెంచుకున్నాడనుకోవచ్చు.
మరి ప్రపంచాన్ని గడగడలాడించిన జర్మన్ నియంత హిట్లర్ కూడా అలాంటి కామెడీ మీసాన్ని ఎందుకు పెంచుకున్నాడు? నియంతగా ముదరక ముందు సైన్యంలో పనిచేసే కాలంలో హిట్లర్‌కు తెగబారెడు మెలితిరిగిన మీసాలుండేవి. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం శత్రుసేనలపై మస్టర్డ్ గ్యాస్‌తో దాడులు ప్రారంభించింది. మస్టర్డ్ గ్యాస్ దాడి నుంచి రక్షణ పొందేందుకు బ్రిటన్‌కు వ్యతిరేకంగా పోరాడిన సైనికులు గ్యాస్ మాస్క్‌లను తయారు చేసుకున్నారు. ఆ మాస్క్‌లు తొడుక్కోవడానికి అనుగుణంగా మీసాల పొడవును కుదించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా హిట్లర్ మీసాలు ఇలా మారాయి.