విద్యుత్ కొను‘గోల్మాల్’ అంతు తేలుద్దాం
సాక్షి, అమరావతి: గాడి తప్పిన విద్యుత్ శాఖను దారిలో పెట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గడచిన ఐదేళ్లుగా ఈ రంగంలో జరిగిన అవినీతి కార్యకలాపాలపై అధికారులు చెప్పిన వివరాలు విని విస్తుబోయారు. ఇందుకు బాధ్యులైన ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి బుధవారం విద్యుత్ రంగంపై ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష జరిపారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. చౌకగా లభించే థర్మల్ పవర్ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారులకు దోచిపెట్టారని, దీని వల్ల రూ.2,636 కోట్ల మేర విద్యుత్ సంస్థలకు నష్టం వాటిల్లిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జగన్.. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అడ్డగోలు పీపీఏలు జరిగాయని, ఫలితంగా విద్యుత్ పంపిణీ సంస్థలు ఘోరంగా నష్ట పోయాయని విద్యుత్ అధికారులు తెలిపారు.
తక్కువకే జీఎంఆర్ గ్యాస్ విద్యుత్ లభిస్తున్నా, పీపీఏ గడువు ముగిసిన ల్యాంకో, స్పెక్ట్రం నుంచి అధిక రేటుకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రూ.276 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇన్ని అక్రమాలు జరిగాయని తెలుసుకున్న ముఖ్యమంత్రి అన్నింటిపైనా వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఇన్ని స్కాములకు పాల్పడి ప్రభుత్వం చేసిన పీపీఏలపై పునః సమీక్షించాలని సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని నియమించిందని, విద్యుత్ రంగంలోని అవినీతిని కూడా సమీక్షిస్తుందని, అన్ని వివరాలు కమిటీ సభ్యులకు ఇవ్వాలని సూచించారు. విండ్, సోలార్ పవర్ ధరలు తగ్గించేందుకు సంప్రదింపుల కమిటీ చర్చలు జరుపుతుందని చెప్పారు. అవినీతిని ప్రోత్సహించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ విద్యుత్ శాఖ మంత్రి, ఇందులో పాత్రధారులైన అధికారులనూ చట్ట ప్రకారం విచారించాలని ఆదేశించారు.
అడ్డూ అదుపులేని దోపిడీ
చౌకగా థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉన్నా ప్రైవేట్ పవన, సౌర విద్యుత్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా దోచిపెట్టిందో ఇంధన శాఖ సవివరంగా సీఎం ముందుంచింది. వాస్తవానికి మెరిట్ ఆర్డర్ ప్రకారం చౌకగా లభించే విద్యుత్‌కు ముందు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఆ శాఖ అధికారులు వివరించారు. ఈ లెక్కన రాష్ట్రానికి కేంద్రం అందించే థర్మల్ విద్యుత్ స్థిర (ఫిక్స్డ్) వ్యయం యూనిట్‌కు రూ.1.10 అని, చర (వేరియబుల్) వ్యయం రూ.3.10 ఉంటుందని, మొత్తం కలిపినా యూనిట్ రూ.4.20కే లభిస్తుందని తెలిపారు. ఇంత తక్కువకు లభించే విద్యుత్‌ను పక్కన పెట్టి యూనిట్ రూ.4.84 చొప్పున పవన విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. అదీ ఏకంగా 5,900 మెగావాట్ల మేర ప్రోత్సహించారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో డిమాండ్ లేకపోవడం వల్ల విండ్ సోలార్ కోసం థర్మల్ విద్యుత్‌ను నిలిపి వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ కారణంగా పీపీఏలున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు యూనిట్‌కు రూ.1.10 స్థిర వ్యయం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విండ్‌కు చెల్లించేది రూ.4.84 అయితే, విండ్ తీసుకోవడం వల్ల థర్మల్‌కు చెల్లించే స్థిర వ్యయం రూ.1.10 కలుపుకుంటే, పవన విద్యుత్ ధర యూనిట్ రూ.5.94 పడుతోందని తెలిపారు. థర్మల్ విద్యుత్ యూనిట్ రూ.4.20కే లభిస్తుంటే పవన విద్యుత్ రూ. 5.94 చొప్పున కొనడం వల్ల యూనిట్‌కు రూ. 1.74 ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. సోలార్కు ఏకంగా యూనిట్‌కు రూ.5 నుంచి రూ.6 చెల్లించారని సీఎంకు వివరించారు. యూనిట్ రూ.5 సోలార్కు ఇచ్చి, థర్మల్ స్థిర వ్యయం రూ.1.10 ఇస్తే అప్పుడు సోలార్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.6.10 అయినట్టు అని, రూ.4.20కే లభించే థర్మల్ కన్నా ఇది యూనిట్‌కు రూ.1.90 ఎక్కువని తెలిపారు. అదే యూనిట్‌కు రూ.6 చొప్పున చెల్లించిన సౌర విద్యుత్ థర్మల్ స్థిర వ్యయంతో కలుపుకుని రూ.7.10 అవుతుందన్నారు. ఈ లెక్కన యూనిట్‌కు రూ.2.90 అధికం అవుతుందని తెలిపారు. ఇలా అధికంగా చెల్లించడం వల్ల ఈ ఐదేళ్ల కాలంలో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులకు ప్రజాధనం రూ.2,636 కోట్లు చెల్లించినట్టుగా అధికారులు సీఎంకు వివరించారు.
క్రిమినల్ కేసులు పెట్టాలి..
అధికారులు తన దృష్టికి తెచ్చిన వివరాలపై సీఎం జగన్ సీరియస్‌గా స్పందించారు. పవన, సౌర విద్యుత్‌ను ఈ స్థాయిలో ప్రోత్సహించాల్సిన అవసరం ఎవరికి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈ రేట్లకు కొన్నది ఎవరు? ఇలా కొనాలని నిర్ణయించింది ఎవరు? వీరందరిమీదా క్రిమినల్ కేసులు పెట్టి విచారణ చేయాలి.. ప్రజల సొమ్మును ఇలా దోచిపెడతారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా రెండు రకాలుగా డిస్కంలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. సోలార్ విండ్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలపై సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీని వేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ కమిటీ కంపెనీలతో సంప్రదింపులు జరిపి, విద్యుత్ కొనుగోలు రేట్లను తగ్గించేలా చూడాలని, అధికంగా చేసిన చెల్లింపుల రికవరీపై దృష్టి పెట్టాలని చెప్పారు. సోలార్, విండ్ విద్యుత్ కంపెనీలతో ఒప్పందాలు కుదిరిన సమయంలో ఇతర రాష్ట్రాల్లో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో అప్పటి సోలార్, విండ్ విద్యుత్ రేట్లను పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. ఒకవేళ కంపెనీలు దారికి రాకుంటే ఒప్పందాలు రద్దు చేయాలని, ఆ మేరకు ప్రత్యామ్నాయంగా తక్కువ రేటుకు ఎక్కడ దొరుకుతుందో అక్కడ విద్యుత్ కొనుగోలుకు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. కాగా, ఐదేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని దోచుకోవడం వల్ల డిస్కమ్‌లకు కలిగిన నష్టాలేంటో అధికారులు సీఎంకు తెలిపారు. డిస్కమ్‌లకు 2019 మే నాటికి రూ.18,375 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఈ మొత్తం.. డిస్కమ్‌లు విద్యుత్ ఉత్పత్తిదారులకు చెల్లించాల్సిన సొమ్మని తెలిపారు. ఇన్ని వేల కోట్ల బకాయిలతో మొత్తంగా విద్యుత్తు రంగం మునిగే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
థర్మల్ మాటేంటి?
జెన్కో నిర్మించే కొత్త థర్మల్ ప్లాంట్లలోనూ అవినీతి ఏరులై పారిందనే ఆరోపణలున్నాయి. దీనిపై సీఎం లోతుగా సమీక్షించారు. కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలో నిర్మించే 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాల కాంట్రాక్టులపై అవినీతి గురించి అధికారులు సీఎం దృష్టికి తేవడంతో వాటిపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని కోరారు. బయట రాష్ట్రాల్లో ఒక మెగావాట్ తయారీకి రూ.4.49 – రూ.4.64 కోట్లు ఖర్చు చేస్తుంటే, అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న విద్యుత్ కేంద్రాల్లో మెగావాట్ ఉత్పాదక సామర్థ్యం కోసం దాదాపు రూ.7 కోట్లు ఎందుకు వెచ్చించాల్సి వచ్చిందని సీఎం ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో కూడా భారీగా దోచేశారని, ఇప్పటికైనా ఖజానాకు ఎంత మిగులుతుందో పరిశీలించాలని, త్వరలోనే రివర్స్ టెండరింగ్‌కు చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్యాస్ పేరుతోనూ లూటీ
వాస్తవానికి మన రాష్ట్రంలో జీఎంఆర్ సంస్థ చౌకగా గ్యాస్ విద్యుత్ అందించేందుకు ముందుకొచ్చిందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇది యూనిట్ కేవలం రూ.3.29కే ఇస్తానందని, కానీ గ్యాస్ కేటాయింపులు లేవనే సాకుతో పీపీఏలు ముగిసినా ల్యాంకో, స్పెక్ట్రం గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలను ప్రోత్సహించినట్టు చెప్పారు. నిజానికి ల్యాంకో స్పెక్ట్రంతో 2016 నాటికి విద్యుత్ కొనుగోలు ఒప్పందం ముగిసింది. కానీ స్వల్ప కాలిక పీపీఏలు అప్పటికప్పుడు కుదుర్చుకుని, యూనిట్ కరెంటుకు 40 పైసలు అదనంగా పెట్టి రూ.3.70 తో కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. అదే సమయంలో జీఎంఆర్ వేమగిరి సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం యూనిట్‌కు రూ.3.29తో కొనే అవకాశం ఉన్నా, ఆ సంస్థకు గ్యాస్ సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ రాయలేదన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా రూ.92 కోట్ల మేర అదనపు భారం పడిందని, మూడేళ్లలో రూ.276 కోట్లకుపైగా ఖజానాకు నష్టం వాటిల్లిన అంశాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. అధికారుల వివరాలు విన్న సీఎం ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుంభకోణాలకు పాల్పడిన అప్పటి ఉన్నతాధికారి, విద్యుత్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రిపైన విచారణ చేయాలని ఆదేశించారు. జరిగిన విషయాలను వివరిస్తూ కేంద్రానికి ఒక లేఖ రాసి, గ్యాస్ అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు.
బాగు చేద్దాం.. తోడుగా ఉండండి
వ్యవస్థను బాగు చెయ్యాలన్న తన ఆకాంక్షకు అధికారులు చేయూతనివ్వాలని సీఎం జగన్ కోరారు. మనకు ప్రజలు ముఖ్యమన్న విషయాన్ని అందరూ గుర్తించాలని చెప్పారు. ఎక్కడ డబ్బు మిగిల్చగలమో గుర్తించడానికి సహకరించాల్సింది అధికారులేనని పదేపదే చెప్తున్నానన్నారు. అవినీతిని నిర్మూలించి వ్యవస్థలను సరిచేసుకోవడానికి అందరం కలిసికట్టుగా వెళదామని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రూ.2.58 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, దీనిపై వడ్డీలు, ఇతర రూపంలో రూ.40 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో చూడాలని, బాగు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతం ఫీడర్లలో పగటి విద్యుత్ అందించాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది జూలై 30 నాటికి మిగిలిన 40 శాతం ఫీడర్లలో పనులు పూర్తి చేసి పగటి పూట కరెంటు ఇవ్వాలని ఆదేశించారు. ఈ పీడర్లలో చేపట్టాల్సిన పనులకోసం రూ.1,700 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు.