gas price increased
-
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. ఎంతంటే..
భారత్‌లోని మెట్రోనగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. అందులో భాగంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.100కు పెంచాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో 19 కిలోల కమర్షియల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి. పెరిగిన ధర నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. తాజా ధరల సవరణతో దిల్లీలో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,833గా ఉంది. కోల్‌కతాలో రూ.1,943, ముంబైలో రూ.1,785, బెంగళూరులో రూ.1,914.50, చెన్నైలో రూ.1,999.50గా ఉంది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి. అక్టోబర్‌లో వీటి ధరను రూ.209కి పెంచారు. అయితే ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను యథాతథంగా ఉంచాయి. వీటి ధర దిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, బెంగళూరులో రూ.905, చెన్నైలో రూ.918.50 ఉంది. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా ప్రతి నెల మొదటి తేదీన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ వాతావరణాన్ని మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నందున యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు గ్లోబల్ చమురు ధరలు బుధవారం పెరిగాయి. -
మళ్లీ పేలింది..!
వంట గ్యాస్ మళ్లీ భగ్గుమంది. ఈ ఏడాది వరుసగా నాలుగుసార్లు ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో సారి వినియోగదారులపై భారం మోపింది. గృహావసరాల సిలిండర్‌కు రూ. 4.50 పెంచింది.ఇప్పటికే నిత్యావసరాల రేట్లు పెరిగి విలవిలలాడుతున్న సామాన్యుడు.. పెరిగిన గ్యాస్ ధరతో మరింత ఆందోళన చెందుతున్నాడు. సాక్షి, యాదాద్రి : వంట గ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని క్రమంగా ఎత్తివేసే ప్రక్రియలో భాగంగా మరోసారి వినియోగదారులపై భారం మోపింది. నెలనెలా గ్యాస్ ధరలను పెంచుతూపోతున్న కేంద్రం.. మరోసారి పెద్ద మొత్తంలో పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌పై రూ.4.50 పెంచింది. పెరిగిన దరలను గ్యాస్ ఏజెన్సీలు గురువారం నుంచి అమల్లోకి తెచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.807 అయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 25 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 16 మండలాల్లో గ్యాస్ వినియోగం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ఆర్, దీపం పథకం కింద కనెక్షన్లు ఇస్తుండడంతో గ్యాస్ వాడకం మరింత పెరిగింది. గ్యాస్ లేకపోతే వంట చేసుకోలేని పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆరు నెలలుగా గ్యాస్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతూపోతోంది. సబ్సిడీ సొమ్మును వినియోగదారుల ఖాతాల్లో వేస్తున్నప్పటికీ ఒకేసారి మొత్తం చెల్లించి కొనుగోలు చేయడం వారికి ఇబ్బందిగా మారింది. గత అక్టోబర్‌లో రూ.700 ఉన్న సిలిండర్ ప్రస్తుతం పెంచిన ధరతో రూ.807కు చేరింది. దీంతో ప్రతి సంవత్సరం జిల్లాలోని వినియోగదారులపై సుమారు రూ.16 కోట్ల భారం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 2,93,766 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 2,04,033 కనెక్షన్లు, 50,156 దీపం, 4377 సీఎస్ఆర్ కంపెనీ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కనెక్షన్లు ఉన్నాయి. డెలివరీ చార్జీలు... ఏజెన్సీ నిర్వాహకులు డెలివరీ చార్జీలు అంతకు పదింతలు పెంచుతున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారుల నియంత్రణ కొరవడడంతో ఒక్కో సిలిండర్‌పై డెలివరీ చార్జీల పేరుతో రూ.20 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. యాదగిరిగుట్టలోని ఓ గ్యాస్ ఏజెన్సీ 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలేరులో సిలిండర్లు డెలివరీ చేసినందుకు గాను చార్జీల కింద రూ.45 అదనంగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చాలా ఏజెన్సీలు రూ.20 నుంచి రూ.50వరకు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నాయి. ఒక్కో సిలిండర్‌పై డెలివరీ చార్జీల కింద రూ.20 అంచనా వేసిన జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా రూ.58.75 లక్షలు వినియోగదారుల జేబుకు చిల్లు పడుతోంది. ఉపసంహరించుకోవాలి గ్యాస్ ధర పెంపును కేంద్రం ఉపసంహరించుకోవాలి తరచు ధరలు పెంయడంతో సామాన్యులపై భా రం పడుతుంది. నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. –చింతల కరుణ, గృహిణి, చౌటుప్పల్ సబ్సిడీ ఎత్తివేసే కుట్ర.. గ్యాస్ సబ్సిడీ ఎత్తివేసే కుట్రలో భాగమే ధరలు పెంచుతున్నారు. సామాన్య ప్రజలపై విపరీతమైన భారం ప డుతోంది. ప్రస్తుతం పూర్తి ధర చెల్లించి సబ్సిడీ పొందాల్సి వస్తుంది. –అన్నెపు పద్మ, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు, మోత్కూరు -
ఖమ్మంలో కదం తొక్కారు...
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజలు శనివారం ఖమ్మంలో కదంతొక్కారు. ప్రదర్శన, మహాధర్నా నిర్వహించారు. తొలుత వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రోటరీనగర్‌లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ ప్రదర్శనగా బయలుదేరారు. ధరల పెంపునకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇందిరానగర్, కోర్టు, ఇల్లెందు క్రాస్‌రోడ్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని, మహాధర్నా చేపట్టారు. కట్టెల పొయ్యిని వెలిగించి నిరసన తెలిపారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో రాష్ట్ర ప్రజలు కష్టాల్లో కూరుకుపోయారని పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు అన్నారు. ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పేరోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. వైఎస్ఆర్ గ్యాస్‌పై పేదలకు రూ.50 సబ్సిడీ ఇచ్చిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం దానిని ఎత్తివేసిందన్నారు. ప్రజలపై భారాల మీద భారాలు మోపుతున్న ప్రభుత్వానికి పాలించే అర్హతలేదని పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారన్నారు. నూతన భూ చట్టాన్ని అమలుచేయడంలో జిల్లా అధికారులు, ప్రభుత్వం విఫలమయ్యాయన్నారు. సత్తుపల్లిలో రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. భూ నిర్వాసితులకు ఎకరానికి రూ.12 లక్షలు ఇవ్వాల్సి ఉండగా రూ.3.70 లక్షలు మాత్రమే ప్రకటించారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పార్టీ కొత్తగూడెం అసెంబ్లీ సమన్వయకర్త ఎడవల్లి కృష్ణ కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చినా ఆ పార్టీకి బుద్ధిరాలేదని యువజన విభాగం మూడు జిల్లా కో-ఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి అన్నారు. ఇంకా పార్టీ బీసీ విభాగం, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్లు తోట రామారావు, వెంకటేశ్వర్లు, అధికారప్రతినిధి నిరంజన్‌రెడ్డి, సీనియర్ నాయకులు మందడపు వెంకటేశ్వరరావు, ఆకుల మూర్తి, పట్టణ మహిళా అధ్యక్షురాలు కొత్తగుండ్ల శ్రీలక్ష్మి, పద్మజారెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ట్రేడ్‌యూనియన్ కన్వీనర్ సంపెట వెంకటేశ్వర్లు, కొదమసింహం పాండురంగాచార్యులు, కాంపెల్లి బాలకృష్ణ, దారేల్లి అశోక్, వల్లూరి సత్యనారాయణ, కొదమసింహం పాండురంగాచార్యులు, జిల్లేపల్లి సైదులు, ముస్తఫా, సునీల్, అశోక్, మార్కం లింగయ్యగౌడ్, మైపా కృష్ణ, దోడ్డి సాంబయ్య, పుల్లయ్య, జంగాల శ్రీను, ఎన్.వెంకటేశ్వర్లు, పత్తి శ్రీను, జాకబ్ ప్రసాద్, కె. జ్యోతిర్మయి, షర్మిలా సంపత్, రేణుక, యశోద, సబిత, సీత, ఎస్కె.సకీనా, హెచ్.వెంకటేశ్వర్లు, పొదిల వెంకటేశ్వర్లు,సుందర్రావు పాల్గొన్నారు.