మళ్లీ పేలింది..! | Lpg Cylinder Price Hike | Sakshi
Sakshi News home page

మళ్లీ పేలింది..!

Published Sun, Nov 5 2017 3:45 PM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

Lpg Cylinder Price Hike - Sakshi

వంట గ్యాస్‌ మళ్లీ భగ్గుమంది. ఈ ఏడాది వరుసగా నాలుగుసార్లు ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో సారి వినియోగదారులపై భారం మోపింది. గృహావసరాల సిలిండర్‌కు రూ. 4.50 పెంచింది.ఇప్పటికే నిత్యావసరాల రేట్లు పెరిగి విలవిలలాడుతున్న సామాన్యుడు.. పెరిగిన గ్యాస్‌ ధరతో మరింత ఆందోళన చెందుతున్నాడు.

సాక్షి, యాదాద్రి :  వంట గ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని క్రమంగా ఎత్తివేసే ప్రక్రియలో భాగంగా మరోసారి వినియోగదారులపై భారం మోపింది. నెలనెలా గ్యాస్‌ ధరలను పెంచుతూపోతున్న కేంద్రం.. మరోసారి పెద్ద మొత్తంలో పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌పై రూ.4.50 పెంచింది.  పెరిగిన దరలను గ్యాస్‌ ఏజెన్సీలు గురువారం నుంచి అమల్లోకి తెచ్చాయి. గ్యాస్‌ సిలిండర్‌ ధర ఇప్పుడు రూ.807 అయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 25 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. 16 మండలాల్లో గ్యాస్‌ వినియోగం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం  సీఎస్‌ఆర్, దీపం పథకం కింద కనెక్షన్లు ఇస్తుండడంతో గ్యాస్‌ వాడకం మరింత పెరిగింది. గ్యాస్‌ లేకపోతే వంట చేసుకోలేని పరిస్థితి ఉంది. 

కేంద్ర ప్రభుత్వం ఆరు నెలలుగా గ్యాస్‌ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతూపోతోంది. సబ్సిడీ సొమ్మును వినియోగదారుల ఖాతాల్లో వేస్తున్నప్పటికీ ఒకేసారి మొత్తం చెల్లించి కొనుగోలు చేయడం వారికి ఇబ్బందిగా మారింది. గత అక్టోబర్‌లో రూ.700 ఉన్న సిలిండర్‌ ప్రస్తుతం పెంచిన ధరతో రూ.807కు చేరింది. దీంతో ప్రతి సంవత్సరం జిల్లాలోని వినియోగదారులపై సుమారు రూ.16 కోట్ల భారం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 2,93,766 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 2,04,033  కనెక్షన్లు, 50,156 దీపం, 4377 సీఎస్‌ఆర్‌ కంపెనీ సోషల్‌ రెస్పాన్స్‌ బిలిటీ కనెక్షన్లు ఉన్నాయి.  

డెలివరీ చార్జీలు...
ఏజెన్సీ నిర్వాహకులు డెలివరీ చార్జీలు అంతకు పదింతలు పెంచుతున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారుల నియంత్రణ కొరవడడంతో ఒక్కో సిలిండర్‌పై డెలివరీ చార్జీల పేరుతో రూ.20 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. యాదగిరిగుట్టలోని ఓ గ్యాస్‌ ఏజెన్సీ 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలేరులో సిలిండర్లు డెలివరీ చేసినందుకు గాను చార్జీల కింద రూ.45 అదనంగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  చాలా ఏజెన్సీలు రూ.20 నుంచి రూ.50వరకు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నాయి.  ఒక్కో  సిలిండర్‌పై డెలివరీ చార్జీల కింద రూ.20 అంచనా వేసిన జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా రూ.58.75 లక్షలు వినియోగదారుల జేబుకు చిల్లు పడుతోంది. 

ఉపసంహరించుకోవాలి
గ్యాస్‌ ధర పెంపును కేంద్రం ఉపసంహరించుకోవాలి తరచు ధరలు పెంయడంతో సామాన్యులపై భా రం పడుతుంది.  నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. 
–చింతల కరుణ, గృహిణి, చౌటుప్పల్‌

సబ్సిడీ ఎత్తివేసే కుట్ర..
గ్యాస్‌ సబ్సిడీ ఎత్తివేసే కుట్రలో భాగమే ధరలు పెంచుతున్నారు. సామాన్య ప్రజలపై విపరీతమైన భారం ప డుతోంది.  ప్రస్తుతం పూర్తి ధర చెల్లించి సబ్సిడీ పొందాల్సి వస్తుంది.    –అన్నెపు పద్మ, మహిళా కాంగ్రెస్‌ 
  మండల అధ్యక్షురాలు, మోత్కూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement