పల్స్‌పోలియో విజయవంతం
సాక్షి, బెంగళూరు : ఈ ఏడాది మొదటి విడతగా చేపట్టిన పల్స్‌పోలియో కార్యక్రమం రాష్ర్ట వ్యాప్తంగా విజయవంతమైంది. 75 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా 89 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి యూటీ ఖాదర్ శివాజీ నగరలోని గౌసియా ఆస్పత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక నగరంలోని పలు ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేసే కేంద్రాలు ఏర్పాటు చేశారు.
బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఏయిర్‌పోర్టులతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాల్లో ప్రత్యేకంగా బూత్‌లను ఏర్పాటు చేసి ఐదేళ్ల లోపు చిన్నారులకు చుక్కల మందు వేశారు. రాష్ర్ట వ్యాప్తంగా 31,782 పోలియో బూత్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే విధంగా ఆరోగ్య కార్యకర్తలు పట్టణ ప్రాంతంలో మూడు రోజులు, గ్రామాల్లో రెండు రోజుల పాటు ఇంటింటికి తిరిగి మిగిలిన చిన్నారులకు చుక్కల మందు వేస్తారు.
ఈ కార్యక్రమంలో లక్షకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక వలస కార్మికులను గుర్తించి వారు ఉంటున్న ప్రాంతాలకు వెళ్లి చుక్కల మందు వేశారు. రెండోవిడత పల్స్ పోలియో కార్యక్రమం ఫిబ్రవరి 23న జరగనుంది. ఇదిలా ఉంటే 2007 నుంచి రాష్ట్రంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు.