బాలయ్యకు బాణీలిచ్చేదెవరో..?
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు.., ప్రస్తుతం సంగీత దర్శకుడి నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారని ప్రకటించారు. అయితే ఇప్పటికే ఒక పాటను అందించిన దేవీ.. సినిమాను నుంచి తప్పుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
దేవీ తప్పుకుంటే గౌతమీ పుత్ర శాతకర్ణికి సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకుంటారన్న చర్చ భారీగా జరుగుతోంది. ఇళయారాజ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా.. ఆయన ఈ ప్రాజెక్ట్ అంగీకరిస్తారా.. లేదా..? అన్న అనుమానం వ్యక్తమవుతోంది. అదే సమయంలో కీరవాణిని సంప్రదించే ఆలోచన కూడా చేస్తున్నారట. అయితే బాహుబలి 2 పనుల్లో బిజీగా ఉన్న కీరవాణి, కొత్తగా గౌతమీ పుత్ర శాతకర్ణి బాధ్యతలు తీసుకుంటాడో.. లేదో..?
బాలయ్యకు లక్కీ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న మణిశర్మ పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ఫాంలో లేకపోవటం కారణంగా ఆ చాన్స్ కూడా లేదంటున్నారు. సీనియర్లను పక్కన పెట్టి కంచె సినిమాకు సంగీతం అంధించిన చిరంతన్ భట్ లాంటి వాళ్లతో ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారట. ప్రస్తుతం వేట కొనసాగిస్తున్న యూనిట్ త్వరలోనే కొత్త సంగీత దర్శకుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది.