దొంగ దాడిలో కానిస్టేబుల్ మృతి
సాక్షి, ముంబై: వాడి బందర్లోని ఒక గెస్ట్‌హౌస్‌లో దొంగతనానికి వెళ్లిన వ్యక్తిని పట్టుకునేందుకు యత్నించిన పోలీసు అదే దొంగ కర్రతో చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున వాడి బందర్ లోని పిడిమెల్లో రోడ్‌లోని ఒక గెస్ట్‌హౌస్‌లో సాల్వి అనే దొంగ చొరబడ్డాడు. గమనించిన స్థానికులు డోంగ్రీ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులను చూసిన సాల్వి ఒక గదిలో దూరి లోపలివైపు నుంచి గొళ్లెం పెట్టుకున్నాడు. తర్వాత గదిని చుట్టుముట్టిన పోలీసులపై రాళ్లతో దాడిచేశాడు.
ఆ దాడిలో ఒక పోలీసుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో గావంద్ అనే పోలీస్ అధికారి రెండవ అంతస్తులోని టైమీదకు వెళ్లాడు. అతడిని స్థానిక వాసి అయిన ఖాన్ అనుసరించాడు. అప్పటికే గదిలోంచి బయటకు వచ్చి టై మీదుగా బయటకు పారిపోయేందుకు యత్నిస్తున్న సాల్విని ఇద్దరూ పట్టుకోవడానికి ప్రయత్నించారు. వాళ్లకు దొరక్కుండా పారిపోయిన సాల్వి చేతికి దొరికిన పెద్ద కట్టె తీసుకుని గావంద్ తలమీద కొట్టడంతో అతడు కిందపడిపోయాడు. ఈలోగా మరో పోలీసు, ఖాన్ కలిసి దొంగను పట్టుకోగలిగారు. గావంద్ను జేజే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యు లు ధృవీకరించారు. కాగా, విధినిర్వహణలో మృతిచెందిన గావంద్ కుటుంబానికి తగిన పరిహారం చెల్లిస్తామని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని అడిషనల్ పోలీస్ కమిషనర్ (సౌత్) కృష్ణ ప్రకాష్ తెలిపారు.