గంటాపై గవిరెడ్డి నిప్పులు
ఆడారితో కలిసి మంత్రి పోకడలపై ఆగ్రహం
సీఎంకు ఫిర్యాదు చేస్తానని ప్రకటన
జిల్లా టీడీపీలో మరో వివాదం
మంత్రుల ఆధిపత్య పోరుతో ఇప్పటికే అట్టుడుకుతున్న జిల్లా అధికార పార్టీలో మరో వివాదం రాజుకుంది. దీనికి స్వయానా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు కేంద్ర బిందువు కావడం విశేషం. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ సీనియర్ నాయకుడు, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావే తన ఓటమి కారకుడంటూ కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఇప్పుడు ఏకంగా మంత్రి గంటా శ్రీనివాసరావుపైనే ధ్వజమెత్తడం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
చోడవరం/కె.కోటపాడు: విశాఖ డెయిరీ నిధులతో కె.కోటపాడు మండలంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తులసీరావుతో కలిసి మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల హాజరయ్యారు. ఇదే పార్టీలో వివాదానికి మరోసారి కారణమైంది. జిల్లా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు ఎడముఖం పెడముఖంగా ఉన్న విషయం తెలిసిందే. అయ్యన్నకు సన్నిహితుడిగా ఉంటున్న గవిరెడ్డి రామానాయుడు ఏకంగా కె.కోటపాడులో సోమవారం ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటుచేసి మంత్రి గంటా, డెయిరీ చైర్మన్ తులసీరావులపై ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా అధ్యక్షుడినైన తన నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు కనీసం తనతో సంప్రదించాలన్న ఆలోచన మంత్రికి లేకపోవడం విచారకమని వాపోయారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఆడారి తులసీరావు రమ్మంటే వచ్చేయడమేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిపోకడ, తులసీరావు విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని సమావేశంలో ఆవేశంగా పేర్కొన్నారు. రైతుల డబ్బుతో అధికారం అనుభవిస్తూ అన్నీ తానే చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్న డెయిరీ చైర్మన్ తీరుపై ఇప్పటికే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశానన్నారు.
ఇలా పార్టీ జిల్లా అధ్యక్షుడి వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అధికార పార్టీలో తీవ్ర చర్చకు తెరతీశాయి. గంటా వర్గీయుల్లో ఆగ్రహావేశాలు రేపాయి. అవిర్భావం నుంచి పార్టీని వెన్నంటి ఉన్న విశాఖడెయిరీ చైర్మన్‌ను, మంత్రి గంటాను బహిరంగంగా గవిరెడ్డి విమర్శించడాన్ని ఆ పార్టీకి చెందిన కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలోని అంతర్గత సమస్యలను ఇలా బహిరంగపరచడం జిల్లా అధ్యక్షుడిగా అతనికి తగదని పలువురు సీనియర్లు పేర్కొంటున్నారు. ఈ వివాదం ఏ స్థాయికి వెళుతుందో చూడాలి.