గే సెక్స్‌పై సుప్రీం తీర్పు : సెలబ్రిటీల హర్షం
సాక్షి, న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరం కాదని, గే సెక్స్‌కు చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును సెలబ్రిటీలు స్వాగతించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని, స్వలింగ సంపర్కం నేరం కాదని, సెక్షన్ 377ను సుప్రీం కోర్టు కొట్టివేయడం ఆహ్వానించదగినదని బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు. ఇది మానవత్వానికి, సమాన హక్కులకు దక్కిన గౌరవమని ట్వీట్ చేశారు.
సుప్రీం..థ్యాంక్స్ : స్వరభాస్కర్
సమున్నత తీర్పును వెలువరించిన సుప్రీం కోర్టుకు ధన్యవాదాలని బాలీవుడ్ నటి స్వరభాస్కర్ వ్యాఖ్యానించారు. మెజారిటీ అభిప్రాయాలు, నైతికత రాజ్యాంగ హక్కులను నిర్ధేశించలేవని తీర్పు స్పష్టం చేసిందన్నారు. అందరి భావాలను సమ్మిళితం చేయడం, సమాన హక్కులు అమలయ్యేలా చూడటం మన బాధ్యతని వ్యాఖ్యానించారు.
సెక్షన్ 377 గాలిలో కలిసింది : అర్జున్ కపూర్
సుప్రీం తీర్పును బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ స్వాగతించారు. సమదృష్టిని ప్రదర్శించి సున్నిత నిర్ణయాలు తీసుకునే వారు ఈ తరంలో ఉన్నారనే నమ్మకాన్ని ఈ తీర్పు కలిగించిందంటూ ట్వీట్ చేశారు. సెక్షన్ 377 గాలిలో కొట్టుకుపోయిందని వ్యాఖ్యానించారు.