ఖాయిలా సంస్థగా గాయత్రి షుగర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చక్కెర తయారీ సంస్థ గాయత్రి షుగర్స్‌ను బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ (బీఐఎఫ్ఆర్) తాజాగా ఖాయిలా పడిన సంస్థగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఆపరేటింగ్ ఏజెన్సీగా ఐడీబీఐని బీఐఎఫ్ఆర్ నియమించినట్లు గాయత్రి షుగర్స్ తెలిపింది. ఈ పరిణామంతో తమకు రుణాల చెల్లింపుల్లో కొంత వెసులుబాటు లభించగలదని.. చక్కెర, ఇతరత్రా ఉత్పత్తులపై సుంకాలు, సెస్సు, పన్నుల నుంచి మినహాయింపు తదితర ప్రయోజనాలు ఉండగలవని పేర్కొంది. అలాగే నగదు లభ్యతను పెంచుకోవడానికి, కంపెనీ ఆర్థిక పనితీరును మెరుగుపర్చుకోవడానికి ఇది తోడ్పడగలదని గాయత్రి షుగర్స్ వివరించింది.
2010-11 నుంచి వివిధ కారణాలతో కంపెనీ గణనీయమైన నష్టాలు చవిచూసింది. కంపెనీ నివేదిక ప్రకారం.. 2016 మార్చి ఆఖరు నాటికి నష్టాలు సుమారు రూ. 139 కోట్లకు చేరుకున్నాయి. నికర విలువ పూర్తిగా కరిగిపోయిన నేపథ్యంలో గతేడాది అక్టోబర్ 7న గాయత్రి షుగర్స్ ఖాయిలా పారిశ్రామిక కంపెనీ చట్టం 1985 నిబంధనల కింద బీఐఎఫ్ఆర్కు దరఖాస్తు చేసుకుంది.