బస్సు ఢీకొని పెరవలి ఏఎస్సై మృతి
పెరవలి : ఓ ప్రయివేటు బస్సు ఢీకొన్న ఘటనలో పెరవలి హైవే పెట్రోలింగ్ ఏఎస్సై జొన్నాడ ధనరాజ్(59) అక్కడికక్కడే మతిచెందారు. పెరవలి అభయాంజనేయస్వామి సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైవే పెట్రోలింగ్ డ్యూటీలో రాత్రి 11 గంటలకు ధనరాజ్ అన్నవరప్పాడు నుంచి జీప్‌లో బయలు దేరి పెరవలి సెంటర్‌కు వచ్చారు. కారును రోడ్డు పక్క నిలుపుదల చేసి రోడ్డుకి రెండో వైపున ఉన్న బీట్ కానిస్టేబుళ్లకు సూచనలు ఇచ్చేందుకు రోడ్డు దాటుతున్నారు. ఇదే సమయంలో వేగంగా వస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ధనరాజ్‌ను ఢీకొంది.
ధనరాజ్ 50 మీటర్లు ఎగిరి పడడంతో తల నేలకు గుద్దుకుని అక్కడికక్కడే మృతి చెందారు. బస్సును నిలుపుదల చేయకుండా వేగంగా వెళ్లిపోవడంతో కానిస్టేబుళ్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎట్టకేలకు తణుకు సమీపంలో పోలీసులు బస్సును పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రయాణికులను వేరే బస్సులో పంపించేశారు. పెరవలి ఎస్సై నాగరాజు, తణుకు సీఐ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బస్సు వచ్చి ఢీకొని ఉంటుందని భావిస్తున్నారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్ డ్రై వర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ధనరాజ్ భార్య మంగతాయారు భర్త మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. మరో ఏడాదిలో ఉద్యోగం నుంచి రిటైరై హాయిగా విశ్రాంతి తీసుకుందామనకుంటుండగా మృత్యువు కబళించిందని ఆమె రోదించిన తీరు చూపరులను కలచివేసింది.
1979లో ఉద్యోగంలో చేరిన ధనరాజ్
పెనుమంట్ర గ్రామానికి చెందిన ధనరాజ్ 1980లో కానిస్టేబుల్‌గా నరసాపురం టౌన్‌స్టేషన్‌లో తన తొలి పోస్టింగ్ పొందారు. ఈయనకు భార్య మంగతాయారుతో పాటు కుమారుడు రామాంజనేయులు, కుమార్తె ధరణి ఉన్నారు. కుమార్తెకు మూడేళ్ల క్రితం వివాహం చేశారు. కుమారుడు దుబాయ్‌లో ఉంటున్నాడు. ధనరాజ్ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి ఏఎస్సై స్థాయికి చేరుకున్నారు.