పాతికేళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమా?
‘గీతాంజలి’... విడుదలై పాతికేళ్లవుతోంది. ఇంకా ఎవరూ మరచిపోలేదు. మరచిపోలేరు కూడా. నాటి యువతరాన్నే కాదు, నేటి యువతను కూడా వెంటాడుతోన్న అజరామర ప్రేమకావ్యం అది. తెలుగులో ఈ ఒక్క సినిమానే చేశారు మణిరత్నం. దాన్ని క్లాసిక్‌గా నిలబెట్టారు. మణిరత్నం డెరైక్ట్ తెలుగు సినిమా మళ్లీ ఎప్పుడు తీస్తారు? అని పాతికేళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరపడే సమయం ఆసన్నమైంది. త్వరలోనే డెరైక్ట్ తెలుగు సినిమా మణిరత్నం చేయబోతున్నారట.
తెలుగు, తమిళ భాషల్లో మణిరత్నం ఓ చిత్రం తెరకెక్కించనున్నట్లు, తెలుగు వెర్షన్లో నాగార్జున, మహేశ్ హీరోలుగా నటించనున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే... తాజా సమాచారం ఏంటంటే... మణిరత్నం డెరైక్ట్‌గా ముందు తెలుగులోనే సినిమా చేస్తారట. ఆ తర్వాతే తమిళ సినిమా ఉంటుందట. హైదరాబాద్‌లోని పలు అందమైన లొకేషన్లను కూడా ఈ సినిమా కోసం మణిరత్నం ఖరారు చేశారట. నాగార్జున, మహేశ్ ఇందులో హీరోలుగా చేయనున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జూలైలో మొదలవుతుందని వినికిడి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఐశ్వర్యారాయ్ ఇందులో ముఖ్యపాత్ర చేయబోతున్నారట. రవివర్మన్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించనున్నట్లు
తెలిసింది.