పాఠశాలలో పేలిన తూటా..
ఆరుగురు చిన్నారులకు గాయాలు
భయభ్రాంతులకు గురైన తల్లిదండ్రులు
తూటా పేలటంతో బయటపడ్డ నిజాలు
తాడే: పల్లి రూరల్ (గుంటూరు)తాడేపల్లి పట్టణ పరిధిలోని పోలకంపాడు పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాలలో కొండను పేల్చే తూటా పేలటంతో ఆరుగురు చిన్నారులకు శుక్రవారం గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం పాఠశాలకు సబంధంలేని ఓ వ్యక్తి కొండను పేల్చే తూటా ఒకదానిని పాఠశాలకు తీసుకొచ్చాడు. అక్కడ విద్యార్థులు ఆ తూటాను తీసుకుని అందులో ఒక విద్యార్థి అగ్గిపెట్టెతో దానిని వెలిగించాడు. దీంతలో సమీపంలోని నలుగురు విద్యార్థులకు చేతులు, మొహం, తలజుట్లు కాలాయి. విద్యార్థులు భయభ్రాంతులతో పక్కకు పరిగెత్తారు. అంతలో తూటా పేలటంతో సమీపంలో ఉన్న మరో ఇద్దరు విద్యార్థులకు చాతిపైన, వీపుపైన రాళ్లు తగిలి గాయాలయ్యాయి. గాయపడిన ఆరుగురు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు ఎటువంటి ప్రాథమిక చికిత్స నిర్వహించకుండా ఒంటిపై నీళ్లు పోసి ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. అంతలో సమీపంలో ఉన్న ఒక వ్యక్తి గాయపడిన విద్యార్థుల బంధువులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. తల్లిదండ్రులకు పాఠశాలలో సమాధానం చెప్పేవారు లేకపోవటంతో ప్రధానోపాధ్యాయులకు ఫోన్ చే శారు. ఆయన దురుసుగా మాట్లాడటంతో పాఠశాల ముందే బైఠాయించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకే ఆర్ ఎంపీ డాక్టర్ని పిలిపించి ఆందోళన చేపట్టారు. వెంపాటి వెంకట శివనాగేంద్ర అనే ఆరో తరగతి విద్యార్థికి చేతివేలికి గాయమవగా, మూడో తరగతి చదివే ఉమామహేష్కి భుజంపై గాయమైంది. వెంకటసాయి అనే మరొక బాలుడుకి, నాలుగో తరగతి చదివే వేముల సురేష్, రెండో తరగతి చదివే జస్వంత్కి నుదుటి పైన జుట్టు కాలిపోయింది. మరో ఆరో తరగతి చదివే విద్యార్థికి ఛాతిపైన గాయమైంది. ఇంతమందికి గాయాలైనా పాఠశాల ఉపాధ్యాయులు పట్టించుకోకపోవటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఎం ఈవో రాయల సుబ్బారావు విద్యార్థులను తల్లిదండ్రులను సముదాయించాడు.
తూటా పేలటంతో బయటపడ్డ నిజాలు
కొండలు పేల్చే తూటా పాఠశాల ఆవరణలో పేలటంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఒక్కసారిగా పాఠశాలకు తరలివచ్చారు. పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఏ స్తాయిలో ఉందో వారి మాటలు విన్నవారికి అర్థమైంది. పాఠశాల పరిసరాల్లో ఎటువంటి పదార్థాలు వచ్చి చేరుతున్నాయి. వాటిని ఎవరు తెస్తున్నారు? వాటి పరిణామాలు ఏంటో కూడా ఆలోచించలేని స్థితిలో ఉన్నారని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పాఠశాలకు వచ్చి, పాఠాలు చెప్పి, నెలసరి వేతనాలు తీసుకోవటం తప్ప తమను నమ్మి బడికి పంపే పిల్లల క్షేమం ఏమాత్రం పట్టడంలేదని అర్థం అవుతుందంటున్నారు. పాఠశాలలో పిల్లలు ఆడుకునే సమయంలో లేదా ఒకరిని ఒకరు కొట్టుకునే సమయంలో దెబ్బలు తగిలితే పట్టించుకోకుండా స్కూల్ మానిపించేయండంటూ పెద్ద మాష్టారు మాపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఒక మహిళ ఆవేదన చెందింది. ఈమధ్య కాలంలో బాత్రూంలు కడిగిస్తున్నారని ప్రశ్నించగా తనపై దురుసుగా ప్రవర్థించారని ఒక విద్యార్థి తల్లి ప్రధానోపాధ్యాయుని ముందే ఎంఈవోకి ఫిర్యాదు చేసింది. గతంలో ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్న నేపథ్యంలో ఒక విద్యార్థికి తలపగిలితే ఆసుపత్రికి పంపకుండా ఇంటికి పంపారని, అడిగితు ప్రయివేటు పాఠశాలలో చదివించుకోండంటూ సమాధానం చెప్పినట్లు ఒక మహిళ చెప్పింది.