డాక్టర్ ‘భగవాన్’.. మంచులో నడిచివచ్చి సర్జరీ
హూస్టన్ (అమెరికా): వైద్యుడంటే సాక్షాత్తూ భగవంతుడే అనేది ఆర్యోక్తి. ఇక్కడి ఒక వైద్యుడు ప్రాణాపాయంలో ఉన్న రోగిని రక్షించడానికి పడిన శ్రమను చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది. బర్మింగ్‌హామ్‌లోని ట్రినిటి మెడికల్ సెంటర్లో డాక్టర్ జెంకో హ్రింకివ్ పనిచేస్తున్నారు. ఆయన ఆ ప్రాంతంలో ఉన్న ఒక్కగానొక్క బ్రెయిన్ సర్జన్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తికి శస్త్రచికిత్స చేయాలని బుధవారం ఆయనకు ఆస్పత్రి నుంచి పిలుపువచ్చింది. డా. హ్రింకివ్ వెంటనే బయలుదేరినా.. ముందు రోజు మంచు తుపాన్ దెబ్బకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
ఆయన కారు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేని పరిస్థితి. కారును నమ్ముకుంటే వైద్యం అందించలేనని నిర్ణయించుకున్న ఆయన కాళ్లకు పని చెప్పారు. ఎముకలు కొరికే చలిని తట్టుకుంటూ 10 కిలో మీటర్లకు పైగా మంచులో నడిచి ఆస్పత్రికి చేరుకున్నారు. మెదడుకి గాయంతో తీవ్రమైన బాధ పడుతున్న రోగికి శస్త్రచికిత్స చేసి అతడికి పునర్జన్మ ప్రసాదించారు. సరైన సమయంలో శస్త్రచికిత్స జరగకపోయుంటే రోగి చనిపోయి ఉండేవాడని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. కాగా, అమెరికా దక్షిణ ప్రాంతంలోని చాలా రోడ్లు మంచుతో నిండిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్రంగా అంతరాయం కలుగుతోంది. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వాళ్లు కార్లలో ఉండలేక రోడ్డు పక్కన ఉన్న షాపుల్లో తలదాచుకుంటున్నారు.