కొత్త విద్యుత్ ప్లాంట్లు అవసరమే
నూతన ఎత్తిపోతల పథకాలు,పరిశ్రమలతో పెరగనున్న డిమాండ్
వచ్చే ఏడాది పీక్ డిమాండ్ అంచనా 17,041 మెగావాట్లు
మరో మూడేళ్లలో 20 వేల మెగావాట్లకు పెరిగే అవకాశం
తక్కువ వ్యయంతో కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం
ఈఆర్సీ బహిరంగ విచారణలో జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్‌లో పెరగనున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం చేపట్టిందని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) సీఎండీ డి.ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. మూడు నాలుగేళ్లలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, కొత్త ఎత్తిపోతల పథకాలు రానుండటంతో విద్యుత్ అవసరాలు పెరుగుతాయన్నారు. రాష్ట్రంలోని జెన్కో విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి 2017–19 మధ్య ఉత్పత్తి కానున్న విద్యుత్ ధరల నిర్ధారణ కోసం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ విచారణలో ప్రభాకర్‌రావు మాట్లాడారు.
2018–19లో రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,041 మెగావాట్లకు పెరుగుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనా వేసిందని అన్నారు. మరో మూడు నాలుగేళ్లలో పీక్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు పెరిగే అవకాశముందని చెప్పారు. పాతబడిన 3 విద్యుత్ ప్లాంట్లను మూడు నాలుగేళ్లలో మూసేయక తప్పదని, ఈ నేపథ్యంలోనే కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తున్నామన్నారు. జెన్కో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ వ్యయం మెగావాట్‌కు రూ.4.7 కోట్లకు మించడం లేదని, అదే ఇతర రాష్ట్రాల్లో రూ.5 కోట్లకు పైనే ఉంటోందన్నారు.
అంత విద్యుత్ అవసరమా..: నిపుణులు
మూడు నాలుగేళ్లలో జెన్కో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 24,000 మెగావాట్లకు పెంచేందుకు భారీగా కొత్త విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తున్నారని, వాస్తవానికి రాష్ట్రంలో అంత భారీ మొత్తంలో విద్యుత్ డిమాండ్ ఉండదని విద్యుత్ రంగ నిపుణులు ఎం.వేణుగోపాల రావు, ఎం.తిమ్మారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. డిస్కంల తాజా అంచనాల ప్రకారం 2017–18లో 17,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగిలిపోనుందని, దీంతో ఆ మేర విద్యుదుత్పత్తి తగ్గించేందుకు బ్యాకింగ్ డౌన్ చేయక తప్పదన్నారు. బ్యాకింగ్ డౌన్ చేసినా స్థిర చార్జీల రూపంలో వినియోగదారులపై రూ.వందల కోట్ల భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పదేళ్ల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కొత్త పీపీఏలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. జెన్కో విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన పీపీఏలు, నిర్మాణ వ్యయం, నిర్మాణ వ్యవధి, ఆలస్యంతో పెరిగిన వ్యయాలు తదితర వివరాలు బయటపెట్టకుండానే విద్యుత్ టారీఫ్‌పై బహిరంగ విచారణ నిర్వహించడం సరికాదన్నారు. ఈ వివరాలు లేకుండా పారదర్శకంగా టారీఫ్ నిర్థారణ సాధ్యం కాదన్నారు. కాగా, తెలంగాణ జెన్కో విద్యుత్ ధరలపై ఏపీ డిస్కంలు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానమిచ్చారు. ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు హెచ్ శ్రీనివాసులు, జెన్కో డైరెక్టర్ కేఆర్కే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.