అందరికీ సేవలందించడమే లక్ష్యం
నకిరేకల్, న్యూస్‌లైన్: అందరికీ సేవలందించడమే లక్ష్యంగా రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పనిచేస్తున్నదని ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ ఆర్ఎన్ డాష్ అన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నోముల గ్రామాన్ని బ్యాంకు అధికారులు గత ఏడాది డిసెంబర్ 15న దత్తత తీసుకొని ఆర్థిక ప్రగతి, అక్షరాస్యతపై కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలపై బుధవారం బ్యాంకు అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాష్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 35నుంచి 45శాతం గ్రామీణ ప్రజలు బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్నారని చెప్పారు.
అందరికీ బ్యాంక్ సేవలందించాలన్న లక్ష్యంతో ప్రజల ముంగిట్లోకి బ్యాంకు సేవలు తెస్తున్నామన్నారు. బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజాపుత్, ఎస్బీహెచ్ జనరల్ మేనేజర్ సింగ్‌లు మాట్లాడుతూ ప్రత్యేకించి నోముల గ్రామంలో ఆర్థిక సమీకృత కార్యక్రమంలో భాగంగా 2300 ఖాతాలు ప్రారంభించామన్నారు. 300మంది రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు అందించి రుణ సౌకర్యం కల్పించామన్నారు. మహిళలలో కూడా వృత్తి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి కుట్టు శిక్షణ మిషన్లు అందించామని చెప్పారు. 54 సమభావన సంఘాలకు రూ.50వేల చొప్పున రుణాలు ఇచ్చామన్నారు.
అనంతరం వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రైతు క్లబ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు కుమారస్వామి, సత్యప్రసాద్, ఎస్బీహెచ్ డీజీఎం గిరిప్రసాద్, డీడీ బ్యాంక్ మేనేజర్ రవి, ఏజీఎం రమణ, స్థానిక ఎస్బీహెచ్ మేనేజర్ శుక్ల, గంగి అవిలయ్య, బాదిని వెంకటరమణ, రాచకొండ లింగయ్యగౌడ్, లగిశెట్టి శ్రీనివాస్, యానాల లింగారెడ్డి, వీర్లపాటి రమేష్, మాచర్ల నాగయ్య, దిండుగాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అయితే, గ్రామంలో ఏడాది క్రితం బ్యాంకు ఏర్పాటు చేసినా ఎలాంటి సేవలూ అందించలేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు.