పుంజుకుంటున్న అమ్మకాలు
ఫిబ్రవరిలో వాహన విక్రయాలు స్వల్పంగా వృద్ధి
న్యూఢిల్లీ: కార్ల విక్రయాలు ఫిబ్రవరిలో కొంత పుంజుకున్నాయి. కొత్త మోడళ్లు దీనికి ప్రధాన కారణం. ప్రధాన కార్ల కంపెనీలు మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌లు గత నెల విక్రయాల్లో ఒక అంకె వృద్ధిని సాధించాయి. హోండా కార్స్ ఇండియా, టాటా మోటార్స్‌లు మాత్రం రెండంకెల వృద్ధిని సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, జనరల్ మోటార్స్ అమ్మకాలు మాత్రం తగ్గాయి.
ఇక టూవీలర్ల విషయానికొస్తే హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో విక్రయాలు తగ్గగా, టీవీఎస్ మోటార్, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా అమ్మకాలు మాత్రం పెరిగాయి. ఇంధనాల ధరలు తక్కువగా ఉండడం, తరుగుదల ప్రయోజనం పొందడం కోసం కొత్త కార్లను కొనుగోలు చేయడం, పెళ్లిళ్ల సీజన్ వంటి కారణాల వల్ల కూడా అమ్మకాలు కొంచెం పుంజుకున్నాయని నిపుణులంటున్నారు. హ్యుందాయ్ ఐ20ఇలీట్, మారుతీ సెలెరియా, సియాజ్, టాటా బోల్ట్, జెస్ట్, హోండా సిటీ కార్లు డిమాండ్‌ను పెంచాయి.
వడ్డీరేట్లు తగ్గించాలి... : గత రెండు నెలల విక్రయాలపై ఎక్సైజ్ సుంకం రాయితీల రద్దు ప్రభావం చూపుతోందని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ చెప్పారు వడ్డీ రేట్లు తగ్గితేనే అమ్మకాలు మరింత పుంజుకుంటాయని వివరించారు.
విక్రయాల విశేషాలు...
⇒ మారుతీ సుజుకీ దేశీయ విక్రయాలు 8%, ఎగుమతులు 14% చొప్పున పెరిగాయి. కాంపాక్ట సెడాన్ డిజైర్ టూర్ వి6కయాలు 96% వృద్ధితో 2,552కు పెరిగాయి.
⇒ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన జెస్ట్, బోల్డ్ కార్లకు స్పందన బావుందని టాటా మోటార్స్ పేర్కొంది. ఎగుమతులు 11% తగ్గాయని వివరించింది.
⇒ హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 10% పెరిగాయి. ఎగుమతులు 18%తగ్గాయి.
⇒ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ బైక్‌ల విక్రయాలు 2% తగ్గాయి.
⇒ టీవీఎస్ మోటార్ టూవీలర్ల విక్రయాలు 15% వృద్ధి చెందాయి. బైక్‌ల విక్రయాలు 18%, స్కూటర్ల అమ్మకాలు 35%, త్రీ వీలర్ల విక్రయాలు 23%, ఎగుమతులు 35 % చొప్పున వృద్ధి చెందాయి.
⇒ బజాజ్ ఆటో మోటార్ సైకిల్ విక్రయాలు 21% తగ్గాయి. ఎగుమతులు 20%, వాణిజ్య వాహనాల విక్రయాలు 32% చొప్పున తగ్గాయి.