ఉప్పు ఎక్కువగా తింటున్నారా..
బెర్లిన్: ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆకలి పెరుగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఉప్పుతో కూడిన ఆహారం వల్ల దాహం వేయకపోగా ఆకలిని కూడా పెంచుతున్నట్లు కాస్మోనాట్స్పై జరిగిన పరిశోధనలలో గుర్తించారు. జర్మనీలోని జర్మన్ ఏరో స్సేస్ సెంటర్(డిఎల్ఆర్) నుంచి అంగారకుడు మీదకు వెళ్లే పది మందిని రెండు గ్రూపులు విభజించి పరిశీలించారు. మొదటి గ్రూపును 105 రోజులు, రెండో గ్రూపును 205 రోజులు పరిశీలించారు. ఈ రెండు గ్రూపులకు కొన్ని వారాలపాటు ఒకే రకమైన ఆహారాన్ని ఇచ్చి, తరువాత ఉప్పును వేర్వేరు స్థాయిలలో అందించారు.
ఎక్కువగా ఉప్పు తీసుకున్న వారి మూత్రంలో ఉప్పు ఎక్కువగా ఉండడాన్ని గమనించారు. ఇది ఎక్కువ నీరు తాగడం వల్ల జరగలేదని, ఉప్పు మూత్రపిండాలలోని నీటిని ఆదా చేయడం వల్ల జరిగిందని పరిశోధకులు గుర్తించారు. ఉప్పులోని సోడియం, క్లోరైడ్ అయానులు నీటిఅణువులను లాక్కుని మూత్రం రూపంలో విడుదల చేశాయని చెప్పారు. మూత్రంలో ఉప్పు ఉంటే నీరు మూత్ర పిండాలనుంచి వెనక్కు అంటే శరీరానికి చేరుతుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఇవే పరిశోధనలు చిట్టెలుకల మీద జరిపినప్పుడు యూరియా స్థాయిలు పెరగడాన్ని గమనించారు.
యూరియా మూత్రపిండాల్లోని సోడియం క్లోరైడ్ని బయటకు పంపడానికి తోడ్పడుతుంది. ఎక్కువ ఉప్పు తీసుకున్న ఎలుకలలో యూరియాను సంకలనం చేయడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. దాంతో ఆకలి పెరుగుతున్నట్లు గుర్తించారు. అదేవిధంగా మనుషులలో కూడ ఇలానే జరుగుతుందనే విషయం కాస్మోనాట్స్పై జరిపిన పరిశోధనలో తేలింది. ఎందుకంటే వారు తమకు దాహం లేదుగాని బాగా ఆకలేస్తుందని చెప్పారు.