ఆత్మహత్య కోసం స్విట్జర్లాండ్ పయనం!!
ఆత్మహత్య చేసుకోడానికి స్విట్జర్లాండ్ వెళ్లడం ఈమధ్య ఫ్యాషన్ అయిపోయింది. దీన్ని 'సూసైడ్ టూరిజం' అంటున్నారు. ఓ భారతీయుడు కూడా ఈమధ్య ఇలా ఆత్మహత్య చేసుకోడానికి స్విస్ వెళ్లినట్లు తాజాగా నిర్ధారణ అయ్యింది. ఇటీవలి కాలంలో ఈ వ్యవహారం బాగా ముదురుతోందని ఇంగ్లండ్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో ఇలా ఆత్మహత్య కోసం స్విస్ వెళ్లేవాళ్ల సంఖ్య రెట్టింపు అయ్యింది. జర్మనీ, ఇంగ్లండ్ వాళ్లే ఈ జాబితాలో ఎక్కువగా ఉంటున్నారు.
సాధారణంగా పక్షవాతం, మోటార్ న్యూరాన్ వ్యాధి, పార్కిన్సన్స్, మల్టిపుల్ స్లెరోసిస్.. ఇలాంటి వ్యాధులతో బాధపడేవాళ్లు అక్కడకు వెళ్లి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. 2008లో 123 మంది ఇలా కేవలం ఆత్మహత్య చేసుకోడానికే స్విట్జర్లాండ్ వెళ్లగా 2012లో ఈసంఖ్య 172కు పెరిగింది. 31 దేశాల నుంచి ఇలా వెళ్తున్నట్లు తాజాగా తెలిసింది. అందులో అత్యధికంగా జర్మనీ, ఆ తర్వాత ఇంగ్లండ్ ప్రజలు ఉంటున్నారు. ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా, ఆస్ట్రియా, కెనడా, స్పెయిన్, ఇజ్రాయెల్ దేశాల వాళ్లు ఆ తర్వాతి వరుసలో ఉన్నారు.