మెర్కల్ నాలుగో గెలుపు ఖాయం?
జర్మనీ చాన్సలర్ ఏంజిలా మెర్కల్ (63) వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టడానికి ఓటర్లు అనుకూలంగా ఉన్నారని తాజా ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. ఆదివారం ఐరోపాలో అతి పెద్ద దేశమైన జర్మనీ దిగువసభ బుందేస్టాగ్‌కు ఎన్నికలు జరుగుతాయి. 598 మంది సభ్యులుండే బుందేస్టాగ్‌లోని సగం మంది సభ్యులను(299) అంతే సంఖ్యలో ఉండే నియోజకవర్గాల నుంచి ఎన్నుకుంటారు. మిగిలిన సగం సభ్యులను నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం(దామాషా పద్ధతి) ద్వారా ఎంపిక చేస్తారు. 2005లో తొలిసారి ఏంజిలా చాన్సలర్ పదవి చేపట్టారు.
ప్రతి నాలుగేళ్లకు జరిగే బుందేస్టాగ్ ఎన్నికల్లో ఆమె నాయకత్వంలోని క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్(సీడీయూ)-క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ) కూటమి 2009, 2013 ఎన్నికల్లో మెజారిటీ సాధించడంతో పన్నెండేళ్లుగా చాన్సలర్ పదవిలో కొనసాగుతున్నారు. ఈ నెల 24 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా పోటీచేస్తున్న సోషల్ డెమొక్రాటిక్ పార్టీ(ఎస్పీడీ) ప్రస్తుత పాలక కూటమి సభ్యులైన సీడీయూ-సీఎస్‌యూతో కలిసి అధికారంలో ఉండడం విశేషం.
జర్మనీలో రెండు ప్రధాన రాజకీయపక్షాలు (సీడీయూ, ఎస్పీడీ) కలిసి ప్రభుత్వాన్ని నడిపితే దాన్ని మహా సంకీర్ణం అని పిలుస్తారు. ప్రస్తుత మహాసంకీర్ణం సజావుగా నడవడం లేదనీ, భవిష్యత్తులో వద్దని భావించిన సోషల్ డెమోక్రాట్లు అధికారం కోసం సొంతంగా పోటీపడుతున్నారు. చాన్సలర్ పదవికి ఎస్పీడీ అభ్యర్థిగా 61 ఏళ్ల మార్టిన్ షూల్జ్ రంగంలోకి దిగారు. ఆయన యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షునిగా 2012లో, మళ్లీ 2014లో ఎన్నికయ్యారు. ఇంకా వామపక్షాలు, గ్రీన్ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీచేస్తున్నాయి.
రెండు ఓట్లు-దామాషా పద్ధతి!
18 ఏళ్లు నిండి ఓటేసే అర్హత ఉన్న జనం జర్మనీలో ఆరు కోట్ల పదిహేను లక్షలమంది ఉన్నారు. పోలింగ్ రోజు ప్రతి ఓటరూ రెండు ఓట్లు వేసే వీలు కల్పించారు. ఒక ఓటు పార్లమెంటులో(బుందేస్టాగ్) తమ నియోజకవర్గ ప్రతినిధికి, రెండో ఓటు తమ కిష్టమైన రాజకీయ పార్టీకి వేసే హక్కుంది. మొదటి ఓటు ద్వారా 299 మంది బుందేస్టాగ్ సభ్యులు ఆయా నియోజకవర్గాల నుంచి ఎన్నికౌతారు. రెండో ఓటు ద్వారా మిగిలిన సగం మందిని దామాషా పద్ధతిలో ఎన్నుకుంటారు. కనీసం 5శాతం ఓట్లు దక్కించుకున్న ప్రతి రాజకీయపక్షం అదే నిష్పత్తిలో సభ్యులను(299లో వాటా కింద) బుందేస్టాగ్ సభకు నామినేట్ చేసుకుంటుంది. ఐదు శాతం ఓట్లు రాని పార్టీకి ఈ పద్ధతిలో ఒక్క సభ్యుడిని కూడా పంపుకునే అర్హత ఉండదు.
అంటే సగం సీట్లకు ఇండియాలోని లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో (మాదిరిగా మిగిలినవారి కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి గెలిచే విధానం) పద్ధతిని, మిగిలిన సగం సీట్లకు దామాషా పద్ధతిని జర్మనీలో అనుసరిస్తున్నారు. ఈ కారణంగా బుందేస్టాగ్‌లో ఏ ప్రధాన రాజకీయ పక్షానికి సంపూర్ణ మెజరిటీ సాధించే అవకాశాలు లేవు. 1954లో పూర్వపు కమ్యూనిస్ట్ తూర్పు జర్మనీ(జీడీఆర్) జన్మించి అక్కడే పెరిగిన ఏంజిలా మెర్కల్ యువ కమ్యూనిస్ట్‌గా కొంతకాలం ఉన్నారు. 1990 జర్మనీ ఏకీకరణ తర్వాత నెమ్మదిగా సీడీయూలో చేరి మొదట బుందేస్టాగ్‌కు ఎన్నికయ్యారు. 1991లో చాన్సలర్ హెల్మట్ కోల్ కేబినెట్లో మహిళలు, యువజన శాఖ మంత్రిగా చేరారు. 2000లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని, 2002లో బుందేస్టాగ్‌లో సీడీయూ నాయకత్వాన్ని చేపట్టారు. 51 ఏళ్ల వయసులో ఆమె మూడేళ్ల తర్వాత జర్మనీ చాన్సలర్‌గా ఎన్నికయ్యారు. 2009, 2013 తర్వాత వరుసగా నాలుగోసారి చాన్సలర్‌గా ఎన్నికవడం ఖాయమని రాజకీయ పండితులు అంచనావేస్తున్నారు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)