స్వీట్ మెమొరీస్
వారం రోజులు ‘వారెవ్వా’ అనే విధంగా గడిచిపోతే.. జీవితాంతం గుర్తుపెట్టుకోదగ్గ తీపి జ్ఞాపకాలుగా అవి మిగిలిపోతాయి. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, సుహాసిని, రాధిక, ఖుష్బూ, లిజీ అలాంటి జ్ఞాపకాలతోనే చైనా టు ఇండియా వచ్చారు. వీళ్లతో పాటు భాగ్యరాజా, ఆయన భార్య పూర్ణిమా భాగ్యరాజా, రాజ్‌కుమార్, సుజాత కూడా ఈ ట్రిప్‌కు వెళ్లారు. 1980లలో రాణించిన హీరో హీరోయిన్లు ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్ రీ–యూనియన్’ అంటూ ఓ గ్రూప్‌ని ఫామ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్రూప్‌లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ రంగానికి చెందిన పలువురు ప్రముఖ తారలు ఉంటారు.
మన టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, సీనియర్ నరేశ్, తమిళంలో రజనీకాంత్, ప్రభు, కన్నడంలో అంబరీష్, మలయాళ నటుడు మోహన్‌లాల్ తదితరులు ఉన్నారు. వీళ్లంతా ప్రతి ఏడాదీ ఒక చోట కలుస్తారు. 2009లో ఇది మొదలైంది. హైదరాబాద్, చెన్నై, కేరళ, బెంగళూరుల్లో వీళ్లందరూ కలిసేవారు. ఈసారి ఇండియా దాటారు. రీ–యూనియన్‌కి చైనా వేదిక అయింది. మామూలుగా ఈ గెట్ టు గెదర్‌ని గోప్యంగా ఉంచుతుంటారు. తర్వాత వాళ్లే కొన్ని ఫొటోలను బయటపెడుతుంటారు.
ఇప్పుడు చైనా ట్రిప్ ఫొటోలను ఖుష్బూ, రాధిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘చైనాను మిస్ అవుతున్నాం.. మరచిపోలేని ట్రిప్ ఇది’ అని పేర్కొన్నారు. చిరంజీవి సతీమణి సురేఖ కూడా వెళ్లారని ఫొటోలు చూపించాయి. జనరల్‌గా ప్రతి ఏడాదీ 25, 30 మంది కనిపించేవాళ్లు. ఈసారి మాత్రం సంఖ్య తగ్గిందని ఫొటోలను చూస్తే తెలుస్తోంది. మిగతావాళ్లందరూ షూటింగ్స్తోనో, వేరే కారణాల వల్లో ఈ ట్రిప్‌ను మిస్ అయ్యుంటారని ఊహించవచ్చు.