సిటీ కుర్రాడి గిన్నిస్ ప్రయత్నం
టాటా.. బైబై.. వీడ్కోలు.. అయినా కళ్ల ముందు కదలాడే అనుబంధం.. మరపురానీయని మధుర జ్ఞాపకం.. పచ్చబొట్టు. అనాదిగా ఉన్నదే. పేరు మారి మళ్లీ కొంగొత్త సింగారంగా మనముందుకొచ్చిందే టాటూ. నాడు తాతా అవ్వల ఒంటి మీద పచ్చందనపు గుర్తే నేడు యువత సొగసుకు కొత్తరూపుతో వన్నెలద్దుతోంది.
ఈ టాటూలు వేయడంలోనూ గిన్నిస్‌బుక్ రికార్డులూ బద్దలవుతున్నారుు. గత ఏడాదే అమెరికాకు చెందిన లేడీ టాటూనిస్ట్ 24 గంటల్లో 801 టాటూలు వేసి రికార్డు నెలకొల్పింది. ఆ రికార్డును తిరగరాయడానికి నేనున్నా అని రంగంలోకి దిగాడు... నగరానికి చెందిన కిషోర్ సందుప్తల. శనివారం ఉదయం 8 గంటలకు బంజారాహిల్స్‌లోని ‘గెట్ ఇంక్డ్’ టాటూ స్టూడియోలో మొదలైన ఈ టాటూయజ్ఞం ఆదివారం ఉదయం 8 వరకు కొనసాగనుంది. 803 టాటూలతో రికార్డు నెలకొల్పాలన్నదే ఆయన సంకల్పం.
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ...
సిటీలో గత ఐదేళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాడు టాటూయిస్ట్ కిషోర్. ‘రికార్డు సాధించడం ఒక్కటే కాదు.. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ.. 2 చదరపు అంగుళాల టాటూను పరిచయం చేస్తున్నా’ అన్నాడు కిషోర్. అందుకు అమ్మ ఆశీర్వాదం కూడా ఉందంటున్నాడు.
సాక్షి, సిటీప్లస్