‘గ్రేటర్ గుంటూరు’కు సన్నాహాలు
గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థను గ్రేటర్ గుంటూరుగా మార్చేందుకు పురపాలకశాఖ ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. గతంలోనే గుంటూరు చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేయాలనే ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. నగరానికి చుట్టూ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలన్నింటినీ కలుపుకొని గుడ్లుక్తో గ్రేటర్ గుంటూరుగా మార్చడానికి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
అయితే, కృష్టాజిల్లాను మినహాయించి గుంటూరు జిల్లాలో సీఆర్డీఏ పరిధి మొత్తాన్ని కలిపి ‘గ్రేటర్ గుంటూరు’గా మార్చాలా, లేక చుట్టుపక్కల ప్రాంతాలను మాత్రం విలీనం చేయాలా అనే దానిపై ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. వాస్తవానికి 2005లో ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపాదనలు ఆచరణలోకి రాలేదు. అయితే, 2011లో గుంటూరు రూరల్ మండలం పరిధిలోని నల్లపాడు, పెదపలకలూరు, అంకిరెడ్డిపాలెం మిగిలిన భాగం, అడవితక్కెళ్లపాడు, గోరంట్ల, పొత్తూరు, చౌడవరం, ఏటుకూరు మిగిలిన భాగం, బుడంపాడు మిగిలిన భాగం, రెడ్డిపాలెం గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేసి మిగిలిన గ్రామాలను వదిలేశారు.
దీంతో ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో లాలిపురం గ్రామం అంశంలో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంలో ఉన్న ప్రభుత్వం ఈ అంశంపై దృష్టిసారించింది. రాష్ట్ర నూతన రాజధాని ప్రాంతంగా ఉన్న గుంటూరును మరింత విస్తరించి గ్రేటర్‌గా రూపొందించేందుకు ప్రతిపాదనలు పంపాలని గత ఏడాది జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆయన కార్పొరేషన్ అధికారులతో చర్చించి గ్రేటర్ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.
గ్రేటర్ ఆవిర్భావానికి మార్గం సుగమం
1994లో గుంటూరు.. మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా ఆవిర్భవించింది. విద్యారంగానికి పేరుగాంచిన గుంటూరులో అనేక విద్యాసంస్థలు ఆవిర్భవించటం, నగర శివారుల్లో మిల్లులు, ఇతర చిన్న పరిశ్రమలు రావటంతో సరిహద్దులు గణనీయంగా విస్తరించాయి. దీంతో నగర జనాభా 6.47 లక్షలు దాటింది. అలాగే, పది విలీన గ్రామాలతో కలిపి 7.20 లక్షలకు చేరింది. గుంటూరు నగరంలోని మంగళగిరి, పెదకాకాని, పేరేచర్ల, తాడికొండ, గుంటూరు రూరల్ మండలాలను నగరపాలక సంస్థలో విలీనం చేస్తే జనాభా 15 లక్షలు దాటే అవకాశం ఉంది. దీంతో గ్రేటర్ గుంటూరు ఆవిర్భావం సాధ్యపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
గ్రేటర్లోకి ఆరుగురు ఎమ్మెల్యేలు
గ్రేటర్ గుంటూరు ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే గ్రేటర్ పరిధిలోకి ఐదుగురు ఎమ్మెల్యేలు వస్తారు. మంగళగిరి, పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ పరిధిలోకి రానున్నారు. వీరు నగరపాలక సంస్థలో ఎక్స్‌ఆఫిషియో సభ్యులుగా ఉంటారు.
గ్రేటర్ గుంటూరు ఎందుకంటే..
నగర సరిహద్దుల్లోని 15 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రాంతాలను కలుపుకొని విశాఖపట్నం తర్వాత రెండో గ్రేటర్ నగరంగా గుంటూరు అవతరించనుంది. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు పెద్ద మొత్తంలో అందే అవకాశం ఉంది. నగర జనాభా 10 లక్షల పైచిలుకు ఉంటే మురికివాడల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు లభిస్తాయి. అలాగే, నగరంలో పరిశ్రమలు పెరగడం, విమానాశ్రయాలు, స్టేడియంల నిర్మాణం సాధ్యపడే అవకాశం ఉంది. కాగా, గ్రేటర్ గుంటూరు అయితే.. ప్రజలకు పన్నుల వడ్డన కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది.