రైలు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా రేపు పార్లమెంట్ ఘెరావ్...
న్యూఢిల్లీ: రైలు చార్జీల పెంపు, నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసిస్తూ సోమవారం పార్లమెంట్ హౌజ్‌ను దిగ్బంధిస్తామని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) హెచ్చరించింది. డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉదయం పది గంటలకు జంతర్‌మంతర్ వద్ద సమావేశమవుతారు. అక్కడనుంచి పార్లమెంట్‌వరకూ హభల్లాబోల్ ఆందోళన చేపడతారు. ఈ విషయమై డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ, సీఎల్పీ నాయకుడు హరూన్ యూసఫ్ మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. మంచిరోజులొస్తాయంటూ ప్రచారం చేశారని, అయితే అందుకు భిన్నంగా అన్ని చెడ్డరోజులుగా మారిపోతున్నాయని, ఇందుకు కారణం తప్పుడు నిర్ణయాలు, విధానాలేనన్నారు.
‘నిత్యావసరాల ధరలు నానాటికీ పెరుగుతుండడంతో ప్రజలు విసిగిపోయారు. మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందువల్లనే బీజేపీ ప్రభుత్వం ముంబై లోకల్ రైళ్ల చార్జీలను తగ్గించింది. అయితే ఇతర రాష్ట్రాలనుంచి ఇక్కడికి వచ్చి జీవిస్తున్న వారిపై మాత్రం రైలు చార్జీల భారం పడింది, ఇందుకు కారణం వారు ఏడాదికి రెండు పర్యాయాలు తమ తమ స్వస్థలాలకు వెళుతుండడమే. రైలు చార్జీల పెంపు అన్ని రకాల వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయినప్పటికీ ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు’ అని ఆరోపించారు.