ప్రముఖ సంస్థలకు జీహెచ్ఎంసీ రెడ్ నోటీసులు
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో జీహెచ్ఎంసీకి భారీగా పన్నులు వసూళ్లు కావడంతో ఇక మొండి బకాయిలపై అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా కోట్లలో బకాయిలు ఉన్న ప్రముఖ సంస్థలకు సోమవారం రెడ్ నోటీసులు జారీ చేశారు.
నోటీసులు అందుకున్న వారిలో ప్రతిష్టాత్మక నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్), పార్క్ హయత్ హోటల్, సైఫాబాద్‌లోని ఏజీ కార్యాలయంతో పాటు టెలిఫోన్ భవన్ ఉన్నాయి. నిమ్స్ ఆస్పత్రి రూ.9 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాల్సిందని జీహెచ్ఎంసీ సర్కిల్-10(బి) అధికారులు తెలిపారు. తక్షణం పన్ను చెల్లించకుంటే జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ఆస్తులను జప్తు చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక బంజారాహిల్స్ రోడ్ నంబర్ -2లోని పార్క్‌హయత్ హోటల్ ఈ ఏడాదికి గాను రూ.2.16 కోట్లు ఆస్తిపన్ను బకాయి ఉండడంతో రెడ్ నోటీసులు జారీ చేశారు. సైఫాబాద్‌లోని ఏజీ ఆఫీస్ రూ. 2.37 కోట్లు, టెలిఫోన్ భవన్ కూడా పెద్ద ఎత్తున బకాయిపడినట్లు అధికారులు తెలిపారు.