‘పెప్పర్ స్ప్రే’ కన్నా ఘాటు గురూ..
లండన్: ఈ మిరపకాయను ముట్టుకుంటే చేయి భగ్గుమంటుంది. ఎందుకంటే ఇది అంత ఘాటు. అందుకని చేతికి గ్లౌజులు లేకుండా ఈ మిరపకాయను ముట్టుకోవద్దంటూ కస్టమర్లను బ్రిటన్‌లోని టెస్కో షాపులు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచంలోనేఅత్యంత ఘాటైన ఎర్ర మిరపకాయగా ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు’లోకి ఎక్కిన ఈ మిరపకాయను మంగళవారం నాడే బ్రిటన్ మార్కెట్లోకి వచ్చింది. ‘కరోలినా రీపర్’ వెరైటీగా పిలిచే ఈ మిరపకాయ వినియోగదారులకు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి.
భారత సైనికులు హ్యాండ్ గ్రెనేడ్లో ఉపయోగించే ‘గోస్ట్ చిల్లీ’ ఘాటు స్కోవిల్లీ స్కేల్‌పై పది లక్షల యూనిట్లు వుంటే కరోలినా రీపర్గా పిలుస్తున్న ఈ చిల్లీ అదే స్కేలుపై 25 లక్షల యూనిట్లు ఉందంట. మిరపకాయ లాంటి ఘాటైన పదార్థాలను కొలిచేందుకు ఉపయోగించే స్కేల్‌ను స్కోవిల్లీ అంటారు. ఆడవాళ్ల భద్రత కోసం ఇప్పుడు మార్కెట్లో దొరకుతున్న ‘పెప్పర్ స్ప్రే’ కన్నా దీని ఘాటు ఎక్కువ. పెప్పర్ స్ప్రే స్కోవిల్లీ స్కేల్‌పై 20 లక్షల యూనిట్లు ఉంటుంది. అల్లర్ల సమయంలో విధ్వంసానికి పాల్పడుతున్న మూకలను చెదరగొట్టడానికి భద్రతా బలగాలు ఉపయోగించే టియర్ గ్యాస్ టిన్ల (భాష్పవాయు గోళాలు)తో పోలిస్తే వాటికన్నా సగం ఘాటు ఉంటుంది. స్కోవిల్లీ స్కేల్‌పై టియర్ గ్యాస్ గరిష్టంగా 50 లక్షల యూనిట్లు ఉంటుంది. దాని వల్ల కళ్లు కూడా పోతాయి.
ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయగా గతంలో రికార్డు సృష్టించిన ‘జలపెనో’ వెరైటీకన్నా ఈ కరోలినా రీపర్ 400 రెట్లు ఘాటైనదని దీన్ని పండించిన ఇటలీ రైతు సాల్వటోర్ జె నోవీస్ చెబుతున్నారు. బ్లడ్ఫోర్డ్షైర్కు సమీపంలోని బ్లునామ్ గ్రామంలోని ఏడెకరాల్లో పలు వెరైటీల మిరపకాయలను పండిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి కార్పొరేట్ ఉద్యోగం చేసిన ఆయన మిరప పంటపైనున్న మమకారంతో ఉద్యోగం వదిలేసి ఈ పంట మీదనే దృష్టిని కేంద్రీకరించారు. ఈ కరోలినా రీపర్‌ను కొరకగలిగితే పండులాంటి రుచి తగులుతుందని జెనోవీస్ చెబుతుండగా, కూరల్లో ఈ మిరపకాయను వేసుకుంటే తినేముందు తీసి పారేయండి, గానీ తినకండి అని విక్రయిస్తున్న టెస్కో షాపులు సలహాయిస్తున్నాయి. ఒక్క రోజులోనే మిరపకాయల స్టాకంతా దేశవ్యాప్తంగా బుక్కయిపోయిందట.