దెయ్యాల స్వర్గంలోకి...
హారర్
గెరి సిటీ (ఇండియానా రాష్ట్రం, అమెరికా)లోని ఒక ఇంటికి ‘దెయ్యాల స్వర్గం’ అని పేరు. ఆ ఇంటి యజమాని పేరు లటోయ. ఒకరోజు రాత్రి లటోయ, ఆమె ముగ్గురు పిల్లలు ఆ ఇంట్లో చనిపోయి ఉన్నారు. ఎలా చనిపోయారనేది పెద్ద మిస్టరీగా మారింది.
చనిపోవడానికి కొంతకాలం ముందు, తన ఇంట్లో వింత వింత సంఘటనలు జరుగుతున్నట్లు చెప్పింది లటోయ. ‘‘మా అబ్బాయి ఒక రాత్రి గాలిలో నడిచాడు. గట్టిగా అరవగానే దబ్బుమని కింద పడ్డాడు. ఏ మూల నుంచో పెద్దగా అరుపు వినిపించేది. వెదికితే ఎవరూ ఉండేవారు కాదు...’’ ఇలా తన ఇంటి గురించి చెప్పుకొచ్చేది. కానీ ఎవరూ సీరియస్గా తీసుకునేవారు కాదు.
ఆ ఇంట్లో ఉన్న దుష్టశక్తులే లటోయను చంపేసాయని అందరూ బలంగా నమ్మడం మొదలైంది. ఇక ఆ ఇంటి వైపు ఎవరైనా చూస్తే ఒట్టు.
ఈ నేపథ్యంలో బుల్లితెర ప్రముఖుడు జాక్ బాగన్స్ ఈ దెయ్యాల ఇంటిని కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆయన చేయబోయే పని, ఆ ఇంట్లో ఒంటరిగా కొంతకాలం పాటు ఉండి తన అనుభవాలను అక్షరబద్ధం చేయడం. చూద్దాం ఏమవుతుందో!