కాంగ్రెస్ ‘వుుఖాల’తో యువమోర్చా నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: ‘రాహుల్‌గాంధీ గుర్రంపై ఊరేగారు..ఆయన వెనుకే సోనియా, మన్మోహన్, షీలా, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్తో సహా పలువురు ప్రముఖులు తరలివచ్చారు. మందీమార్బలం బంధుగణం తోడురాగా బాజాభజంత్రీల సందడితో బీజేపీ కేంద్ర కార్యాలయం వైపుగా సాగిందీయాత్ర...’ అదేంటీ రాహుల్ పెళ్లి ఎప్పుడు కుదిరింది...ఏంటీ హంగామా అనుకుంటున్నారా..? అదేనండి ఫొటోలో చూస్తున్నారుగా.. పెళ్లికుమారుడి మాదిరిగా రాహుల్ గాంధీ మాస్క్ ధరించిన వ్యక్తి గుర్రం మీద వస్తుంటే.
.ఆయనను మాస్క్‌లు ధరించిన మహా నాయకులు అనుసరించారు..‘గొటాలోకి బరాత్’ పేరిట అశోకా రోడ్డులోని బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి బీజేపీ యువమోర్చా కార్యకర్తలు శనివారం నిరసన ప్రదర్శనలోనివీ దృశ్యాలు..యూపీఏ ప్రభుత్వ, కాంగ్రెస్ నాయకుల అవినీతిని తెలియజెప్పేందుకు తమ నిరసనను వినూత్నంగా చెప్పేందుకు ఇలా ఊరేగింపుతో ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని బీజేవైఎం సభ్యులు ఆరోపించారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చినందుకు కుంభకోణాలను బహుమతిగా ఇచ్చారని వారు ఆరోపించారు. 2జీ, కామన్వెల్త్గేమ్స్ కుంభకోణం, ఆదర్శ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, రైల్వే కుంభకోణంతోపాటు ఇటీవల హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ వరకు కాంగ్రెస్ నాయకులంతా అవినీతిలో కూరుకుపోయారన్నారు.
ఓ వైపు పార్టీ నేతలంతా అవినీతిలో మునిగి తేలుతుంటే ఆ పార్టీ ఉపాధ్యక్షుడు లోక్‌పాల్ బిల్లు ఘనత తన ఖాతాలో వేసుకునేందుకు ఆరాటపడుతున్నారన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. శనివారం నిర్వహించిన ప్రదర్శనలో రాహుల్‌గాంధీ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి పెళ్లికుమారుడిలా గుర్రంపై ఊరేగుతుంటే, హిమాచల్‌ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్, ఏ.రాజా, పవన్‌బన్సల్, అశ్వినీ కుమార్ మాస్క్‌లతో ఉన్న వ్యక్తులకు డప్పుచప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్‌లు చేస్తూ ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన గుర్రపు బండిపై కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్, ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ మాస్క్ల్లో కూర్చున్న వ్యక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మోడీకి క్షమాపణ చెప్పాలి
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు అనురాగ్‌సింగ్ ఠాకూర్ అన్నారు. ప్రధాని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్న విషయం ప్రధానికి తెలుసన్నారు.