'జెయింట్ వాల్ ఆఫ్ సీ' ఎందుకో తెలుసా?
జకర్తా: రాజధాని నగరాన్ని కాపాడుకునే చర్యలను ఇండోనేషియా పునఃప్రారంభించింది. రోజు రోజుకూ సముద్రమట్టం పెరుగుతూ పోతుండటంతో జకర్తా మునిగిపోకుండా ఉండేందుకు ఇండోనేషియా ప్రభుత్వం 'జెయింట్ వాల్ ఆఫ్ సీ'ని నిర్మిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో వాల్ కారణంగా పర్యావరణం నష్టపోతుందంటూ స్వచ్ఛంద సంస్థలు చేసిన నిరసనలతో ఇండోనేషియా గవర్నర్ ప్రాజెక్టును నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రపంచంలో అత్యధిక జనభా నివసించే నగరాల్లో జకర్తా కూడా ఒకటి. అంతేకాకుండా మిగిలిన నగరాలతో పోలిస్తే అత్యంత వేగంగా మునిగిపోతున్న నగరం కూడా ఇదే. దీంతో రక్షణ చర్యలు చేపట్టిన ఇండోనేషియా ప్రభుత్వం 15 మైళ్ల విస్తీర్ణంలో 'జెయింట్ వాల్ ఆఫ్ సీ' నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ వాల్ ను నిర్మించకపోతే భవిష్యత్తులో జకర్తాలో మంచి నీటి జాడ దొరకదని మారిటైమ్ మంత్రి లుహుత్ పన్ జైతన్ చెప్పారు.
ఈ మేరకే వాల్ నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కాగా మంగళవారం రాత్రి నుంచి వాల్ పునఃనిర్మాణం ప్రారంభమయింది. వాల్ నిర్మాణ ప్లాన్ లో భాగంగా ఉత్తర జకర్తా సముద్రంలో అక్కడక్కడా కృత్రిమ ఐల్యాండ్స్ ను నిర్మిస్తారు. వీటిలో సింగపూర్ తరహా షాపింగ్ మాల్ లను నిర్మించనున్నట్లు జైతన్ తెలిపారు. వరదలు, సునామీల సమయంలో నీటి ఒరవడిని తట్టుకునే విధంగా డ్రైనేజీ వ్యవస్థను కూడా రూపుదిద్దనున్నారు.