giddalur mla ashok reddy
-
ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోడిగుడ్లతో దాడి
సాక్షి, గిద్దలూరు : ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా గ్రామసభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యేపై కొందరు యువకులు కోడిగుడ్లు విసిరిన ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వైఎస్సార్ సీపీ తరపున గెలిచి టీడీపీలో చేరారు. ఆయన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా అర్ధవీడు మండలం వెలగలపాయగ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతున్న సమయంలో అశోక్‌రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో నాలుగైదు కోడిగుడ్లు విసిరేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా అలజడి రేగింది. పక్కనే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు కొంతమంది యువకులపై చేయి చేసుకోవడంతో గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లు విసిరేశారనే అనుమానంతో సర్పంచి బంధువులు నలుగురు యువకులపై దాడికి దిగారు. నిందితులపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించినట్లు సమాచారం. దీనిపై పోలీసులను వివరణ కోరగా ఎవరో ఆకతాయిలు మద్యం మత్తులో కోడిగుడ్లు విసురుకున్నారని, తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. -
కెమెరాకు చిక్కిన ఎమ్మెల్యే అనుచరుల నిర్వాకం
గిద్దలూరు : అధికారంలో తమ ప్రభుత్వమే... దీంతో తాము ఏం చేసినా అడిగేవారు ఉండరనే ధీమా. వెరసి అవకాశం వస్తే రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారనే విషయంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అనుచరులు మరోసారి నిరూపిస్తున్నారు. స్థానిక ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన మంచి నీటిని ఎమ్మెల్యే అనుచరులు ట్యాంకర్ల ద్వారా పక్క దారి పట్టిస్తున్న వైనం కెమెరా కంటికి చిక్కింది. వ్యక్తిగతంగా తనకు చెందిన ట్యాంకర్లను ప్రజలకు తన స్వంత డబ్బుతో సరఫరా చేస్తున్నట్టు జనాన్ని మభ్యపెట్టడమే కాక ఆ వాహనాలపై నిబంధనలకు విరుద్ధంగా తాటికాయంత అక్షరాలతో గుమ్మడికాయ అంత ఫోటో వేసుకుని మరీ తిరుగుతున్న వైనం చూసి స్థానికులు ఈసడించుకుంటున్నారు. దానికి తోడు సరఫరా చేయడానికి ఉద్దేశించిన మంచి నీటిని స్వార్థ ప్రయోజనాల కోసం స్థానికంగా పేరున్న ఓ ప్రముఖ రెస్టారెంట్ కు ఇవే ట్యాంకర్ల ద్వారా వ్యాపారం చేయటం కూడా కెమెరాకు చిక్కింది. ఇలా సామాన్యులకు అందాల్సిన కనీస హక్కు అయినా మంచి నీటిని ఇలా లాభాపేక్ష కోసం అమ్ముకోవడం నీచమని స్థానికులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. స్థానికులు కనీస తాగునీటి అవసరాలకు కూడా నీరు లేక అలమటిస్తూ ఉంటే సిగ్గు లేకుండా ఇలా బజారులో అమ్ముకోవడంపై భగ్గుమంటున్నారు. ప్రజల క్షేమం పట్టని ఇలాంటి నాయకులు ఉంటే క్షామం తప్పదని మరోసారి అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు రుజువు చేశారని దుమ్మెత్తి పోస్తున్నారు. మరి సదరు ఎమ్మెల్యే దీనికి ఏం సమాధానం ఇస్తారో చూడాలి.