సాక్షి, గిద్దలూరు : ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా గ్రామసభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యేపై కొందరు యువకులు కోడిగుడ్లు విసిరిన ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వైఎస్సార్ సీపీ తరపున గెలిచి టీడీపీలో చేరారు. ఆయన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా అర్ధవీడు మండలం వెలగలపాయగ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభలో మాట్లాడుతున్న సమయంలో అశోక్‌రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో నాలుగైదు కోడిగుడ్లు విసిరేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా అలజడి రేగింది. పక్కనే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు కొంతమంది యువకులపై చేయి చేసుకోవడంతో గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లు విసిరేశారనే అనుమానంతో సర్పంచి బంధువులు నలుగురు యువకులపై దాడికి దిగారు. నిందితులపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించినట్లు సమాచారం. దీనిపై పోలీసులను వివరణ కోరగా ఎవరో ఆకతాయిలు మద్యం మత్తులో కోడిగుడ్లు విసురుకున్నారని, తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment