వరంగల్: బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా.. సోమవారం కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. ఉదయం 10 గంటలకు నాయకులు పెద్దఎత్తున ఎంజీఎం జంక్షన్‌కు చేరుకున్నారు. ముందుగానే మోహరించిన పోలీసు బలగాలు ధర్నాకు అనుమతి లేదంటూ అడ్డుకున్నాయి.
దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు కార్పొరేషన్ వైపు వెళ్లనివ్వకపోవడంతో నాయకులు రోడ్డుపైనే బైఠాయించారు. ఈసందర్భంగా రాజేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హనుమకొండ, వరంగల్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను వెంటనే అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేయూసీ నుంచి కాజీపేట వరకు చేపట్టిన రహదారి మరమ్మతులు ఇంకా ఎన్ని రోజులు సాగుతాయో చెప్పాలన్నారు.
ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అసమర్థత కారణంగానే ఇటీవల వర్షాలకు హనుమకొండ ముంపునకు గురైందన్నారు. నాలాలు, చెరువులు, ఎఫ్‌టీఎల్‌లు కబ్జాలకు గురువుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ధర్నాలో పాల్గొనేందుకు వస్తున్న వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులను అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో పోలీసులు రాత్రికి రాత్రే అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించడం నియంతృత్వ పాలనకు నిదర్శనమని రాజేందర్‌రెడ్డి మండి పడ్డారు.
నాయకుల అరెస్టు తరలింపు..
ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో ఎంజీఎం రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకోవడతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడే బైఠాయించి సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మీడియాతో రాజేందర్‌రెడ్డి మాట్లాడుతుండగానే ఆయనతో పాటు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి మడికొండ శివారులోని సిటీ పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. అనంతరం సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
కార్యక్రమంలో పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచన రవళి, నాయకులు అశోక్‌రెడ్డి, రవీందర్, పులి రాజు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, మాజీ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, కూర వెంకట్, సతీశ్, సమద్, రాజు, ఐలయ్య, సదానందం, సంపత్ యాదవ్, రాహుల్‌రెడ్డి, కార్తీక్, ముస్తాక్ నేహళ్, దీపక్‌రెడ్డి, సుధీర్, సారంగం, మహేందర్, డివిజన్ అధ్యక్షుడు, యువజన, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment